సుంకేసులకు వరద

ABN , First Publish Date - 2021-07-28T06:03:10+05:30 IST

ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర పరవళ్లు తొక్కుతూ సుంకేసుల డ్యాంను చేరుకుంది.

సుంకేసులకు వరద
సుంకేసుల డ్యాం నుంచి విడుదలవుతున్న నీరు

కర్నూలు, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర పరవళ్లు తొక్కుతూ సుంకేసుల డ్యాంను చేరుకుంది. రెండు, మూడు రోజుల నుంచి కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు మంగళవారం సుంకేసుల వద్ద భారీగా ఇన్‌ఫ్లో నమోదైంది. ఈ సీజన్‌ మొదలయ్యాక ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారి. దీంతో అధికారులు డ్యాం గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. డ్యాం నీటి నిల్వ సామర్థ్యం కేవలం 1.2 టీఎంసీలు కాగా, దాదాపు లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీంతో ముందుగానే అప్రమత్తమై నీటి నిల్వను తగ్గించారు. మంగళవారం ఉదయం డ్యాం 22 గేట్లను ఎత్తి స్పిల్‌ వే ద్వారా 95 వేల క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 800 క్యూసెక్కులు విడుదల చేశారు. మధ్యాహ్నం 12 కల్లా డ్యాం డెడ్‌ స్టోరేజీకి చేరుకుంది. ఆ తర్వాత మళ్లీ సుంకేసులకు ఎగువ నుంచి భారీగా ఇన్‌ ఫ్లో మొదలైంది. మంగళవారం సాయంత్రానికి డ్యాం వద్ద 1.07 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో నమోదవగా, స్పిల్‌ వే ద్వారా 1.06 లక్షల క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు మరో వెయ్యి క్యూసెక్కులు విడుదల చేశారు. డ్యాం సామర్థ్యం తక్కువ కావడంతో సరిపడా నీటిని నిల్వ చేసి మిగిలినవి కిందికి  వదులుతున్నామని, ఇన్‌ఫ్లో ఇంకా కొనసాగే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 0.554 టీఎంసీల నిల్వ స్థిరంగా ఉందని తెలియజేశారు.


నేడు శ్రీశైలం గేట్లు ఎత్తివేత!


శ్రీశైలం, జూలై 27: శ్రీశైల జలాశయానికి వరద కొనసాగుతోంది. మంగళవారం 6 గంటలకు జూరాల నుంచి 2,98,468 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 89,103 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 876.60 అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు. ప్రస్తుతం 172.6615 టీఎంసీల నీరు ఉంది. తెలంగాణ వైపు ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. బుధవారం గేట్లు ఎత్తి నీరు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2021-07-28T06:03:10+05:30 IST