అటు ఊరట.. ఇటు హెచ్చరిక

ABN , First Publish Date - 2022-08-20T06:59:12+05:30 IST

గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది.

అటు ఊరట.. ఇటు హెచ్చరిక
పి గన్నవరం మండలం గంటిపెదపూడిలో పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్న దృశ్యం

తగ్గుముఖం పడుతున్న గోదావరి వరద

తీవ్ర వాయుగుండం హెచ్చరికతో లంకవాసుల్లో ఆందోళన

కుమ్మరికాల్వకు గండి.. జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు

వరద కష్టాలు అన్నీ ఇన్నీ కావు అంటున్న బాధితులు


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. భద్రాచలం మూడు, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. వరద తీవ్రత కారణంగా కోనసీమలోని నదీ పరీవాహక లంక గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం, అనారోగ్య కార ణాలతో రోగులు, గర్భిణీలు, వైరల్‌ ఫీవర్లతో బాధపడుతున్న రోగులు సురక్షిత ప్రాంతాలకు వచ్చి వైద్యసేవలు పొందేందుకు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. వరద ప్రవా హం తీవ్రంగా ఉండడంతో పలుచోట్ల ఉన్న అవుట్‌ఫాల్‌ స్లూయీస్‌ల నుంచి వరదనీరు వెనక్కు తన్నిపెట్టడంతో సమీపంలోని పంట పొలాలు, పలు ప్రాంతాలు జల దిగ్బంధానికి గురవుతు న్నాయి. శుక్రవారం కుమ్మరికాల్వ డ్రెయిన్‌కు గండి పడడంతో అల్లవరం మండలం బోడసకుర్రు పరిసర ప్రాంతాల్లోకి వరదనీరు ముంచెత్తింది. దాంతో బోడసకుర్రులో ఉన్న టిడ్కో ఇళ్ల గృహ సముదాయాలు, పక్కనే ఉన్న లేఅవుట్‌ జలదిగ్బంధంలో ఉన్నాయి. కాల్వకు గండి పడినప్పటికీ దానిని పూడ్చేందుకు అధికారులెవరూ పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుమ్మరి కాల్వ డ్రెయిన్‌ పొంగడం వల్ల సమీప గ్రామాల్లోకి వరదనీరు ముంచెత్తి ప్రజలు ఇబ్బం దులకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక పరిసర ప్రాంతాల్లోని కాజ్‌వేలు నీట మునగడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందిపడ్డారు. అప్పనరాము నిలంక, రామరాజులంక  ప్రాంతం నుంచి మృతదేహాన్ని తరలించడానికి ఆ గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. మామిడికుదురు మండలం పాశర్లపూడి, అప్పనపల్లి కాజ్‌ వేలపై గురువారం రాత్రి ఓ వ్యక్తి నడిచి వెళుతుండగా అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. అతడు కేకలు వేయడంతో స్థానికులు రక్షించారు. పి.గన్నవరం మండలంలోని పలు ప్రాంతాల్లో రోగులు వైద్యసేవల నిమిత్తం ఆసుపత్రులకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. శనివారం సాయంత్రానికి వరద తగ్గుముఖం పట్టవచ్చని జలవనరులశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో రాగల రెం డ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలతో గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికార యంత్రాంగం మాత్రం బాధితులను పట్టించుకునే పరిస్థితిలో లేదు. రెండోసారి వరదలతో పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో పడవ, పంటు ప్రయాణాలు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు.

Updated Date - 2022-08-20T06:59:12+05:30 IST