కుళ్లిన కంకులు.. కూలిన ఆశలు

ABN , First Publish Date - 2020-10-30T05:14:14+05:30 IST

వర్షానికి వాగులు పొంగడంతో.. 20 రోజులు గా పొలాలు, ఇళ్లు ఇంకా నీళ్లలోనే నాను తు న్నాయి. తమ్మిలేరు, బుడమేరు, ఎర్ర కాల్వ వరదలకు ఏలూరు రూరల్‌, ఆకివీడు, తాడే పల్లి గూడెం మండలాల్లోని పలు ప్రాంతాల్లో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ నే ఉన్నారు.

కుళ్లిన కంకులు.. కూలిన ఆశలు
రంగు మారి ముంపులోనే వున్న వరి పొలాలు

రైతుల బతుకుల్లో వర్షాలు, వరద కల్లోలం 

గింజకట్టే దశలో కోలుకోలేని దెబ్బ.. తాలుగింజలు తేలిన వరి కంకులు 

బురదలో  పైరు.. పశుగ్రాసానికి పనికిరాదు

వేల ఎకరాల్లో పంటలు.. చేపలు,  రొయ్యల చెరువులకు తీవ్ర నష్టం

ఇసుక మేటలు.. తరలింపునకు పాట్లు

పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు 

కోయిస్తే ఖర్చులు దండగ


(ఏలూరు రూరల్‌ / ఆకివీడు రూరల్‌ / తాడేపల్లిగూడెం రూరల్‌)

వర్షానికి వాగులు పొంగడంతో.. 20 రోజులు గా పొలాలు, ఇళ్లు ఇంకా నీళ్లలోనే నాను తు న్నాయి. తమ్మిలేరు, బుడమేరు, ఎర్ర కాల్వ వరదలకు ఏలూరు రూరల్‌, ఆకివీడు, తాడే పల్లి గూడెం మండలాల్లోని పలు ప్రాంతాల్లో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ నే ఉన్నారు. వరి కంకి గింజ గట్టి పడే దశలో కురిసిన వర్షాలకు పైరు నేలకు ఒరిగింది. వరద గుప్పెట చిక్కుకుని రోజుల తరబడి ముంపులోనే ఉండిపోయింది. కంకుళ్లన్నీ కుళ్లిపోయాయి. పొలాల వైపు వెళుతుంటే కుళ్లిన దుర్వాసన వస్తోంది. పలుచోట్ల వరద తగ్గడంతో దానిపై బురదతోపాటు ఇసుక మేటలు వేశాయి. పైరు సగ భాగం కుళ్లిపో యింది. గింజకట్టే దశలో విపత్తు రావడంతో పంట చేతికందే పరిస్థితి లేదు. చేసిన అప్పు లకు వడ్డీలు పెరిగి మరింత కష్టాల్లో కూరుకు పోయామని రైతులు వాపోతున్నారు. దీనిపై ఆంధ్రజ్యోతి బృందం గురువారం జరిపిన పరిశీలనలో తేలిన వాస్తవాలవి..

  

ఏలూరు రూరల్‌ మండలం లింగారావుగూడెం, మాదేపల్లి, కాట్లంపూడి, జాలిపూడి, మల్కాపురం గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా వరద ముంపుబారిన పడిన వరి పైరు పైకి కళకళలాడుతూ కనిపిస్తున్నా దగ్గరకు వెళ్లి చూస్తే కనీసం గింజ కూడా కనిపించడం లేదు. మరికొన్నిచోట్ల పైరు పూర్తిగా కుళ్లిపోయింది. లింగారావుగూడెం, మాదేపల్లి ప్రాంతంలో వెన్ను తెల్లగా మారిపోయి గింజకట్టలేదు. అదంతా తాలుగా మారింది.  మల్కాపురంలో ఇప్పటికీ పైరు బురదలోనే ఉంది. పశుగ్రాసానికి కూడా పనికిరాదు. కోయిస్తే ఖర్చులు దండగ. ముంపు తొలగిన తరువాత ఆకుపచ్చగా కనిపిస్తున్నాయన్న పేరుతో నష్టాలు నమోదు చేయడం లేదు. భారీ వర్షాలకు పంటలు ముంపునకు గురై నష్టపోయిన కౌలు రైతులను, పేద రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. నష్టపరిహారం ఇచ్చి పంట రుణాలు మాఫీ చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేస్తున్నారు.


వరి, రొయ్య, చేపలకు అపారనష్టం

కొల్లేరులోని నీరంతా సముద్రంలోకి తీసుకెళ్లే ఉప్పుటేరు ఆకివీడు సమీపం నుంచి ప్రవహిస్తుం డటంతో 13 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. రెండు వారా లకుపైగా నీటిలో నాని పోవడంతో వరి పైరు కుళ్లి నీరు రంగు మారి దుర్వాసన వెదజల్లుతున్నది. పొట్ట, పాలు పోసుకునే దశలో వచ్చిన వరదతో 5,275 ఎకరాల పంట పనికిరాకుండా పోయింది. వేల ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువులు వరద నీటిలో మునిగాయి. రైతులు వలలు, ఆపాలు కట్టినా చేపలు వరద నీటికి వలలను చింపుకుని బయటకు వెళ్లిపోయాయి. వరద నీరు తగ్గుముఖం పట్టిన తరువాత చెరువులలో నీరు రంగు మారుతున్న తరుణంలో చేపలు  ఏ మేర బతికుంటాయనేది అనుమానమే. వలలకు, కర్రలకు కూలీలకు అదనంగా ఎకరాకు రూ.50 వేలు ఖర్చయ్యింది.


నీటిలోనే నివాసాలు.. ప్రజల అవస్థలు

ఆకివీడు మండలం ఆకివీడు, గుమ్ములూరు, తరటావ, అప్పారావుపేట, చినకాపవరం, పెదకాపవరం, కోళ్ళపర్రు, రాజులపేట, చినిమిల్లిపాడు, కళింగపాలెం, సిద్దాపురం, దుంపగడప, మందపాడు, అయిభీమవరం, చెరుకుమిల్లి గ్రామాలలో ఏడు వేల గృహాలు నీట మునిగాయి. ఇప్పటికీ పలు గ్రామాలు నీళ్లలోనే ఉన్నాయి. వరద నీరు తగ్గిన తరువాత డ్యామేజీ అయిన నివాసాలను గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు. కరోనా కారణంగా పునరావాస కేంద్రాల నుంచి వరద బాధితులు తమ ఇళ్లకు వెళ్ళేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.


వందల ఎకరాల్లో ఇసుక మేటలు

తాడేపల్లిగూడెం మండలంలోని ఎర్రకాలువ పరివాహక గ్రామాలైన వీరంపాలెం, పట్టింపాలెం, కొమ్ముగూడెం, అప్పారావుపేట, మాధవరం, జగన్నాధపురం, నందమూరు, మారంపల్లి, ఆరుళ్ల గ్రామాల్లో వేల ఎకరాల్లో చేతికందిన వరి, మినప పంటలు నష్టపోయాయి. వందల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. దీనిని బయటకు తరలించే మార్గం లేక రెండో పంటపైన రైతులు ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మండలంలోని అప్పారావుపేట, పట్టింపాలెం, వీరంపాలెం గ్రామా ల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఎర్రకాలువపై వీరంపా లెంలో వేసిన వైరు వంతెన పూర్తిగా ధ్వంసం అయింది. మాధవరం–కంసాలిపాలెం మధ్యలో  కాజ్‌వే వంతెన కూలిపోయింది. వీటితో పాటు పదుల సంఖ్యలో గండ్లు పడి గట్టు చిన్నా భిన్నమైంది.


చెరువులో చేపలున్నాయో.. లేదో..?

వరద నుంచి రక్షించుకోవడానికి ఎకరం చెరువుకు అదనంగా రూ.50 వేలు ఖర్చయ్యింది. చెరువులలో నీరు రంగు మారుతున్నది. వరద నీటి మట్టం తగ్గిన తరువాత పట్టుబడి పట్టే సమయానికి చేపలు ఎంత ఉన్నాయి, ఏ మేర పెరిగాయో తెలియదు. అప్పటి వరకు మేత వెయ్యాల్సిందే. ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

– గాదిరాజు సత్తిరాజు, చేపల రైతు, కురుపాక


వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి

ముంపుతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలి. దాళ్వా కు విత్తనాలు పూర్తి సబ్సిడీపై అంద జేయాలి. మద్దతు ధర ప్రకటించాలి. కాలువలు ఆక్రమణలు తొలగించి, మట్టిపూడిక తీయించి వ్యవసాయాన్ని ముంపు బారిన పడకుండా చర్యలు చేపట్టాలి. 

– పూసపాటి లక్ష్మీపతిరాజు, రైతు సిద్ధ్దాపురం 


అప్పులే మిగులుతాయి

పదెకరాల్లో సాగు చేశా. 80 వేల వరకూ పెట్టుబడి పెట్టా. ఇప్పటికీ పైరు బురదలోనే ఉంది. పైరును కోయిస్తే ఖర్చులు వృథా. ఈ కష్టాల నుంచి గట్టెక్కే మార్గమే కనిపించడం లేదు. తాలు గింజలు అధికంగా వచ్చాయి. ధర సగానికి సగం పడిపోతుంది. ఈ ఏడాది అప్పులే  మిగులుతాయి. 

– డేవిడ్‌ రాజు, రైతు, లింగారావుగూడెం


మూడెకరాల్లో ఇసుక మేటలు

అప్పారావుపేటలో మా కున్న పదెకరాలు సాగు చేశాం. పంట మొత్తం నష్టపోయాం. మూడెకరా ల్లో ఇసుక మేటలు వేయ డంతో పంట ఊడ్చేందుకు అవకాశం లేదు. దీనిని బయటకు తరలించేందుకు రెండు లక్ష లు ఖర్చవుతుంది. దీనికి అధికారులు నష్ట పరిహారం ఇప్పించాలి.

– వంగూరి సుబ్బారావు, రైతు, అప్పారావుపేట


పెట్టుబడంతా నీటి పాలు 

మాకు మూడెకరాల పొలం ఉంది. మరో ఆరెక రాలు కౌలుకు చేస్తున్నాం. మరో పది రోజుల్లో పంట చేతికి వస్తుందనే సమ యంలో ఎర్రకాల్వ ఉధృతికి మొత్తం నాశన మైంది. ఎకరానికి పాతికవేలు ఖర్చుచేసినా.. అదంతా నీటిపాలైంది. ప్రభుత్వం ఇచ్చే కొద్ది పాటి సబ్సిడీ ఏ మాత్రం సరిపోదు.  

– శనగన రాంబాబు, నందమూరు


రుణమాఫీ చేయాలి 

వర్షాలకు వరి పంట పూర్తిగా నేలమట్టమైంది. నీరు నిలవడంతో పైరు మొత్తం కుళ్లిపోయింది. పంట చేతికందే పరిస్థితే లేదు. వ్యవసాయాన్నే నమ్ముకున్న మాకు అప్పులే మిగులుతున్నాయి. సాగు చేసిన ప్రతి సారి ఏదో విధంగా నష్టపోతున్నాం. మాకు రుణమాఫీ చేసి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.

– రంగారావు, మాదేపల్లి 





Updated Date - 2020-10-30T05:14:14+05:30 IST