వరద..వంచన

ABN , First Publish Date - 2022-09-14T06:02:15+05:30 IST

పోలవరం ప్రాజెక్టు కోసం నిలువెత్తు త్యాగాలు చేసి ఉన్న ఊరిని, పచ్చటి పొలాలను ప్రభుత్వానికి అప్పగిస్తే.. దశాబ్దాలు గడిచినా చేస్తామన్న సాయానికి దిక్కుమొక్కు లేదు. ఎన్నో హామీలు ఇచ్చి నిర్వాసితులకు అండగా నిలబడతామని చెప్పి ఓట్లు దండుకున్న వైసీపీ సర్కారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మాట నిల బెట్టుకోలేక మడమ తిప్పుతూనే ఉంది

వరద..వంచన

నిర్వాసితులకు హామీలు.. ఎడాపెడా జీవోలు 

ఆచరణకు వచ్చేసరికి అన్నీ డ్రామాలే

సీఎం వస్తున్నారంటే కొంత మంది ఖాతాల్లోనే జమ

వరదొస్తే ఇంకొంత మందికి పరిహారం

మూడేళ్లుగా ఇదే సీను

కుక్కునూరు, వేలేరుపాడుల్లో ఉండలేమంటున్న జనం

పరిహారం పూర్తిగా ఇస్తే పునరావాస

కాలనీలకు పోతామంటూ గగ్గోలు


గోదావరి వరదల్లో సర్వస్వం కోల్పోయి, చతికిల పడిన అనేక కుటుంబాలకు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. ఇళ్లను కోల్పోయిన కుటుంబాలకు ఇస్తామన్న పది వేల నష్టపరిహారం 90 రోజులు గడిచినా ఇంకా అడ్రస్సు లేదు. వరదల కారణంగా సర్వం తుడుచుకుపెట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలిన వారికి అండగా నిలబడాల్సింది పోయి ఇప్పుడు వారందరినీ బికార్లుగా చూస్తున్నారు. ఒకవైపు గోదావరి మళ్లీ ఊళ్ళవైపు దూసు కొస్తున్నది. నిర్వాసితులు బిక్కుబిక్కుమంటూ ఇప్పటికే కొన్ని గ్రామాలను ఖాళీ చేశారు. భద్రాద్రిలో పెరుగుతున్న వరద గోదావరి వీరందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా.. సర్కారు చేస్తున్న అన్యాయం చూసి రగలిపోతున్నారు. ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన తమని ఇలా గాలికి వదిలేస్తారా అని ఆక్రోశిస్తున్నారు..


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) 

పోలవరం ప్రాజెక్టు కోసం నిలువెత్తు త్యాగాలు చేసి ఉన్న ఊరిని, పచ్చటి పొలాలను ప్రభుత్వానికి అప్పగిస్తే.. దశాబ్దాలు గడిచినా చేస్తామన్న సాయానికి దిక్కుమొక్కు లేదు. ఎన్నో హామీలు ఇచ్చి నిర్వాసితులకు అండగా నిలబడతామని చెప్పి ఓట్లు దండుకున్న వైసీపీ సర్కారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మాట నిల బెట్టుకోలేక మడమ తిప్పుతూనే ఉంది. ఇచ్చేస్తామంటూ జీవోలు విడుదల చేయడం, తీరా నిధులు విడుదలకు చేతులెత్తేయడం ఈ మూడేళ్లలో నిత్యకృత్యం. మొన్నీమధ్య వరదలొచ్చినప్పుడు పరామర్శించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ వేలేరుపాడు మండలానికి వస్తుండగా ఒకరిద్దరి ఖాతాల్లో మాత్రం పరిహారం సొమ్ము వేసి చేతులు దులుపేసుకున్నారు. ఇప్పుడు కూడా ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్న గృహాల మరమ్మతుకు ఇస్తామన్న పది వేల పరిహారంలోనూ అదే తంతు. ఊరించి ఊరించి కొందరి ఖాతాల్లో జమ చేసి వేల మందిని గాలికొదిలేశారు. 


ఉన్నామనుకుంటున్నారా.. 

పోలవరం ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు వాసులకు వరుస కష్టాలు ప్రారంభమయ్యాయి. గడిచిన మూడేళ్లుగా గోదావరి పొంగడం, ఊళ్లకు ఊళ్లను ముంచెత్తడం, వేలాది మంది సర్వం కోల్పోవడం కొనసాగుతూనే ఉంది. 90 రోజుల క్రితం గోదావరి వరద రికార్డు స్థాయిలో ముంచెత్తడంతో వేలేరుపాడు మండలంలో సగ భాగం అడ్రస్సు లేనంతగా దెబ్బతింది. విలువైన పంటలన్నీ మట్టికరిచాయి. పొరుగున ఉన్న కుక్కునూరు మండలంలోనూ ఇలాంటి భయానక పరిస్థితే. లక్షలు విలువైన ప్రత్తి వరదపాలైంది. ఇళ్ళల్లో దాచుకున్న గ్రాసమంతా మట్టిపాలైంది. బతికితే చాలనుకుని సురక్షిత ప్రాంతాలకు చేరారు. అప్పట్లో దాతలు ముందుకొచ్చి మేమున్నామంటూ సాయపడ్డారు. కాని సర్కారు మాత్రం ఈ రెండు మండలాల్లో జనం ఇంకా నివసిస్తున్నారనే విషయాన్ని మరిచినట్టే వ్యవహరించింది. పోలవరం నిర్వాసిత కాలనీలకు ఇప్పటిదాకా ఎందుకు వెళ్ళలేకపోయారంటూ ప్రశ్న సంధిస్తూనే అరకొర సాయానికి మాత్రమే పరిమితమయ్యారు. తాము ఇక్కడే ఉన్నామనే స్పృహ లేకుండా.. ఇంకా ఇక్కడే ఉంటున్నారా అనే ప్రశ్నలు సంధిస్తున్న వారి పట్ల ఆగ్రహంతో రగిలిపోయారు.  


వరదొస్తే వాళ్ళకు పండగే :

వరదలొస్తే కొంతమందికి పండగే. కష్టాలు, కన్నీళ్ళతో సతమతమవుతున్న వారందరికీ ఇబ్బందులే. గడిచిన గోదావరి వరదల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అయినప్పటికీ ఇళ్ళు, రోడ్లు, ఇతర శాఖల్లో జరిగిన నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వారం వ్యవధిలోనే నష్టం తేల్చాలని కోరారు. ఛిద్రమైన రోడ్లు, కుప్పకూలిన ఇళ్లు, కోల్పోయిన పంటలు, చిన్నాభిన్నమైన జీవనం, చితికిన చిరు వ్యాపారుల బతుకులు వీటన్నింటినీ ఇప్పటికీ లెక్కకట్టలేకపోయారు. కేవలం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఏడు వేల ఇళ్లు మాత్రం దెబ్బతిన్నట్టు అది కూడా కేంద్ర విపత్తుల బృందం వచ్చినప్పుడు అధికారికంగా తేల్చారు. ఆ తరువాత ఈ రెండు మండలాల్లో జరిగిన నష్టమెంతో ఇప్పటికీ తేల్చలేదు. మళ్ళీ గోదావరి వరద ఊళ్ళను ఊళ్ళనే ముంచెత్తుతోంది. అప్పట్లోనే గోదావరి వరదల్లో సహాయక చర్యలకుగాను రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్లు సాయం విడుదల చేసింది. ఆ మేరకు పూర్తి అధికారాలను జిల్లా కలెక్టర్‌కు బదలాయించింది. రెండు మండలా ల్లోనూ రెండు కోట్లకుపైగానే ఖర్చు అయినట్టు వరద పద్దు ఈ మధ్యే బహిర్గత మైంది. ఈ పద్దులో హద్దులేని లెక్కలు, ఊహించనంత జమా లెక్కలు. జరిగిన నష్టం ఏమార్చి పద్దులో మాత్రం ఇష్టానుసారం లెక్కలు చూపినట్టే అభియోగం. కుక్కు నూరులో రూ.70 లక్షలకు పైబడి, వేలేరుపాడులో అంతకంటే మించి మరీ వరద లెక్కలను తేల్చి చూపించారు. అప్పట్లో బాధితుల తరలింపు, ఆదుకునేందుకు రాజకీయ పక్షాలు, స్వచ్చంధ సంస్థలే ముందు వరుసలో నిలవగా తామే అన్నీ చేసినట్టు ఖర్చు చూపిస్తూ మండలాధికారులు ఫోజులిచ్చారని వివిధ పక్షాలన్నీ మండిపడ్డాయి. 


ఎన్నాళ్లిలా.. గోదాట్లో కలిపేస్తారా

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ గిరిజనులు, గిరిజనేతరులని విభజించి ఎక్కడికక్కడ నిర్వాసిత కాలనీలను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. గడిచిన ఏడేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే వచ్చింది. ఎక్కడికక్కడ నిర్వాసిత కాలనీల్లో సమస్యలే ఉన్నాయి. అక్కడ బతికేందుకు వీలులేని పరిస్థితిలున్నాయి. అధికారులు మాత్రం తక్షణం నిర్వాసిత కాలనీలకు తరలిపోవాలంటూ ఆయా కుటుంబాలపై ఒత్తిడి తేవడం.. ఇస్తామన్న పరిహారం ఏమైందంటూ బాధితులు నిలదీస్తుండడంతో వాయిదాలు వేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు వరుసగా గోదావరి వరదలు ఊళ్ళను ఊళ్ళనే ముంచేయడం, వరుస నష్టాలు కొనసాగడం, నెలల వ్యవధిలోనే జలదిగ్బంధనకు గురికావడం వంటివి కళ్ళెదుటే కనిపిస్తుండగా వేలాది మంది నిర్వాసిత కుటుంబాలు గొల్లుమంటున్నాయి. అటు కాలనీలకు వెళ్దామంటే సౌకర్యాలు లేకపోవడం, ఉన్న ఊరు, బతుకు నేర్చిన ఇల్లును వదిలేసి వెళ్ళలేక.. ఎటూ పాలుపోక వేల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. కేంద్రం సైతం పునరావాస ప్యాకేజీపై పదేపదే ఆరా తీస్తున్నప్పుడు నిర్వాసితులు ఎదుర్కొంటున్న కష్టాలను మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మధ్యనే గుర్తుచేసింది. ఇదే విషయాన్ని స్థానిక నేతలు కూడా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. కాని ఇచ్చిన హామీలు ఆచరణకు తీసుకురాలేక, నిధులు సమకూర్చలేక ఏదో వంకన ఎవరెవరిపైనో నెట్టేయడంలోనే సర్కారు పోటీ పడుతోంది. ఎన్నాళ్ళిలా.. గోదాట్లో కలిపేస్తారా అంటూ నిర్వాసితులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




Updated Date - 2022-09-14T06:02:15+05:30 IST