సంబరాల్లో తేలి.. సమస్యలు మరిపిస్తూ..

ABN , First Publish Date - 2022-05-19T06:55:11+05:30 IST

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలు పక్కదారిపట్టాయి.

సంబరాల్లో తేలి.. సమస్యలు మరిపిస్తూ..

 - గడపగడపలో మంత్రి నృత్యాలు

 - సమస్యలు దాటవేస్తూ ముందుకు.. 

 కళ్యాణదుర్గం, మే 18: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  సమస్యలు పక్కదారిపట్టాయి. అందులోనూ ఎస్సీ, ఎస్టీల కాలనీల్లో  రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉష శ్రీచరణ్‌  కాలనీ మహిళతో నృత్యాలు చేస్తూ  సమస్యలను మరిపించింది. బుధవారం కళ్యాణదుర్గం మండలం నుసికొట్టాల, నుసికొట్టాల తండాలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తండాలో సమస్యలు అడిగేందుకు మహిళలు వెళ్లివెళ్లగానే సంప్రదాయ నృత్యాలు చేయాలని కోరారు. లంబాడీలతోపాటు మంత్రి కూడా నృత్యాలు చేస్తూ జాతరను తలపించారు. దీంతో నాయకులు, కార్యకర్తలు చిందులువేస్తూ ఆనందహేళలలో మునిగారు. అనంతరం ర్యాలీగా వెళుతూ కరపత్రాలను అందజేశారు. ప్రభుత్వ పథకాలు ప్రతిఇంటికి చేరేలా బాధ్యత తీసుకుంటానని హామీలు గుప్పించారు. దీంతో తండా వాసులు మంత్రికి సమస్యలపై విన్నవించకుండా నిమ్మకుండిపోయారు. నుసికొట్టాల గ్రామంలో ఎస్సీకాలనీకి శ్మశాన వాటిక, సీసీరోడ్లు లేవని స్థానికులు మంత్రిని నిలదీశారు. ఈసమస్య ఇది వరకే తమ దృష్టిలో వుందని, శ్మశాన వాటికకు రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించారని, సీసీరోడ్లు కూడా త్వరలో వేయిస్తానని ప్రజలకు చెప్పుకొచ్చారు. తేలికపాటి వర్షం రావడంతో ఇదే అదునుగా భావించిన మంత్రి ర్యాలీ నిర్వహించి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించారు.

Updated Date - 2022-05-19T06:55:11+05:30 IST