మంటకలుస్తున్న మానవ సంబంధాలు

ABN , First Publish Date - 2020-10-01T10:31:26+05:30 IST

మాయమైపోతున్నడమ్మ..మనిషన్నవాడు..మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ఓ కవి ఈ స్వార్థపూరిత సమాజాన్ని

మంటకలుస్తున్న మానవ సంబంధాలు

మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త

కొడుకు ఉద్యోగం కోసం భర్తను పిల్లలతో కలిసి హత్య చేసిన భార్య


బెల్లంపల్లి, సెప్టెంబరు 30: మాయమైపోతున్నడమ్మ..మనిషన్నవాడు..మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ఓ కవి ఈ స్వార్థపూరిత సమాజాన్ని ఎండగడుతూ తన హృదయ వేదనను తెలియజేశారు. సందర్భం ఏదైనా కావచ్చు కానీ నేటి సమాజంలో కొందరు మనుషులు మానవత్వం మరిచిపోతున్నారు. కొందరు బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, అప్యాయతలు మరిచి పోయి ప్రవరిస్తున్నారు. క్షణికావేశంలో కట్టుకున్న భార్యను భర్త, భర్తను భార్య హత్య చేయడం, ఉద్యోగాల కోసం జన్మనిచ్చిన తండ్రిని కొడుకులు, కూతుళ్లు హతమార్చడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏది ఏమైనా జన్మనిచ్చిన తల్లిదండ్రులను కొడుకులే కాటికి పంపడం, కడదాకా తోడుంటానని నమ్మి వచ్చిన భార్యను భర్త హత్య చేయడం వంటి సంఘటనలు మానవ విలువలను పతనం చేస్తున్న పరిస్థితికి అద్దం పడుతోంది. కొందరు మద్యం మత్తులో, మరికొందరు క్షణికావేశంలో, ఇంకొందరు పథకం ప్రకారం హత్యలకు పాల్పడిన దారుణ ఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి.


ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనలు..

జూలై 17న దండేపల్లి మండలంలోని గూడెం గ్రామానికి చెందిన భీమయ్య (65) అనే వృద్ధుడు తన భూమిలో ఇల్లు నిర్మించుకుంటున్న సమయంలో అతడి తమ్ముడి కొడుకులే భూ వివాదం నేపథ్యంలో అత్యంత కిరాతంగా ఇనుపరాడ్లతో ముఖంపై కొట్టి హతమార్చారు. 


సెప్టెంబరు 3న జన్నారం మండలంలోని ధర్మారం గ్రామపంచాయతీలోని గోండుగూడలో మద్యం తాగేందుకు రూ. 30 ఇవ్వలేదని ఒక్కగానొక్క కొడుకు గంగు(26)ను తండ్రి పర్చకారి అతి కిరాతంగా కత్తితో మెడ కోసి హత్య చేశాడు. 


సెప్టెంబరు 4న ముత్తె శంకర్‌(55) అనే సింగరేణి కార్మికుడిని హత్య చేస్తే కొడుకుకు ఉద్యోగం వస్తుందని ఏకంగా భార్య, కొడుకు, కూతురు కలిసి హతమార్చిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. మృతుడు శంకర్‌ సింగరేణిలో పనిచేస్తున్నాడు. మరో రెండేండ్లు అయితే పదవీ విరమణ పొందేవాడు. పథకం ప్రకారం అతని భార్య, కొడుకు, కూతురు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో శంకర్‌ మెడకు బెల్టు బిగించి హత్య చేశారు. 


సెప్టెంబరు 19న  దండేపల్లి మండలంలోని రెబ్బెనపెల్లి గ్రామానికి చెందిన బత్తుల అమ్మాయి(52)ని భర్త బత్తుల లచ్చన్న హతమార్చాడు. రోజు మద్యం తాగి వచ్చి వేధిస్తుండడంతో భార్య మందలించింది. దీంతో మద్యం మత్తులో నిద్రిస్తున్న భార్య తలపై రోకలిబండతో లచ్చన్న కొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందింది. 


మార్చి 3న చెన్నూరు మండలంలోని నారాయణపూర్‌ గ్రామానికి చెందిన నిట్టూరి అంకులును అతని అన్న కొడుకు గొంతు నులిపి హత్య చేశాడు. కుటుంబ సభ్యుల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండడంతో క్షణికావేశంలో ఈ హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. 


జూలై 2న  హాజీపూర్‌ మండలం ముల్కలపేట గ్రామానికి చెందిన నీలం క్రాంతికుమార్‌పై అతని బావమరిది స్నేహితులతో కలిసి కత్తితో దాడి చేశాడు. తన తండ్రి సింగరేణి ఉద్యోగం తనకు ఇవ్వకుండా బావ క్రాంతికుమార్‌కు ఇవ్వడంతో కోపంతో దాడికి పాల్పడ్డాడు. 


సెప్టెంబరు 18న జైపూర్‌ మండలంలోని నజీర్‌పల్లి గ్రామంలో కిశోర్‌(25) నిత్యం తాగి వచ్చి డబ్బులు ఇవ్వాలని, భూములు అమ్మి ఇవ్వాలని వేధిస్తుండడంతో రఘువరణ్‌ అనే వ్యక్తికి తన కొడుకును హత్య చేస్తే రూ. 50 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని తల్లే హత్య చేయించింది. నవమాసాలు మోసి కొడుకును పెంచి పెద్ద చేసిన తల్లి కొడుకును హత్య చేయించడం జిల్లాలో కలకలం రేపింది. 


జూన్‌ 15న బెల్లంపల్లి మండలం రంగపేట గ్రామంలో చల్లూరి దుర్గయ్య(45) అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన దాగం నరేందర్‌ అనే వ్యక్తి తలపై బండరాయితో మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.  ఇంటిపక్కన చిన్న స్థలం విషయంలో ఈ హత్యకు పాల్పడడం గమనార్హం. 


విలువలను కాపాడుకోవాలి.. బాబురావు, తాండూర్‌ సీఐ

మానవులు తమ విలువలు కాపాడుకోవాలి. తల్లి, కొడుకు, అన్న తమ్ముడు, భార్య భర్తలు సంబంధాలు ఎంతో ఆత్మీయతతో కూడుకున్నవి.  మానవ సంబంధాలను మంట గలిపే విధంగా పలువురు వ్యవహరిస్తున్నారు. క్షణికావేశంలో హత్యలకు పాల్పడి తమ అందమైన జీవితాలను జైలుపాలు చేసుకుంటున్నారు. క్షణికావేశంలో హత్యలు చేసి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సమాజంలో మానవ సంబంధాలకు విలువలు ఇస్తూ గౌరవంగా బతకాలి. ఏమైనా సమస్యలుంటే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. పోలీసులను సంప్రదిస్తే కౌన్సెలింగ్‌ అందజేస్తారు. 

Updated Date - 2020-10-01T10:31:26+05:30 IST