మోదీకి అగ్నిపరీక్ష!

ABN , First Publish Date - 2022-01-09T07:57:58+05:30 IST

మరో రెండేళ్ల తరువాత సార్వత్రిక ఎన్నికలు. ఇప్పటికే వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. మళ్లీ అధికారం తమదేనని చెప్పాలంటే 5 రాష్ట్రాల..

మోదీకి అగ్నిపరీక్ష!

  • బీజేపీకి సవాల్‌గా ఐదు రాష్ట్రాల ఎన్నికలు..
  • సమాన స్థాయిలో అనుకూల, ప్రతికూలాంశాలు
  • యూపీలో సవాల్‌ విసురుతున్న అఖిలేశ్‌
  • ఎస్పీ వెంట ఓబీసీలు, రైతుల సంఘటితం
  • ఉత్తరాఖండ్‌లో బీజేపీపై ప్రజా వ్యతిరేకత
  • అకాలీదళ్‌ దూరమయ్యాక పంజాబ్‌లో..
  • ప్రశ్నార్థకంగా మారిన కమలనాథుల ఉనికి
  • గోవా, మణిపూర్‌లో ఏకపక్షంగా లేని పరిస్థితి


న్యూఢిల్లీ, జనవరి 8(ఆంధ్రజ్యోతి): మరో రెండేళ్ల తరువాత సార్వత్రిక ఎన్నికలు. ఇప్పటికే వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. మళ్లీ అధికారం తమదేనని చెప్పాలంటే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిపత్యం చాటుకోవాల్సిన పరిస్థితి. కానీ, ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలతలు ఏ స్థాయిలో ఉన్నాయో, ప్రతికూ ల పరిస్థితులూ అంతే స్థాయిలో ఉండడం ఆ పార్టీని కలవరపెడుతోంది. ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలకుగాను నాలుగు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవాల్లో బీజేపీయే అధికారంలో ఉంది. దాంతో ఆ రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు పంజాబ్‌లో ఉనికి చాటుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు బీజేపీ భవిష్యత్తుకు, ముఖ్యంగా ప్రధాని మోదీకి అగ్నిపరీక్షగా మారనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ ఒకవేళ మెజారిటీ స్థానాల్లో పట్టు కోల్పోతే.. అది దేశంలో ప్రతిపక్షాల ఐక్యత కు దారితీస్తుందని భావిస్తున్నాయి. బీజేపీ ఘనవిజయం సాధిస్తే మాత్రం కాంగ్రె్‌సతోపాటు ప్రాంతీయ పార్టీల ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని ఈ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ను గెలిస్తే దేశాన్ని గెలిచినట్లేనని తాము భావిస్తామని, అందుకే యూపీలో విజ యం ద్వారా లోక్‌సభలో తిరుగులేకుండా చేసుకుంటామ ని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ, యూపీలో బీజేపీ గెలిచినా మోదీకి అగ్ని పరీక్షేనని, జాతీ య స్థాయిలో మోదీకి ప్రత్యామ్నాయంగా యోగి ఆదిత్యనాథ్‌ అవతరిస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


బీజేపీ ప్రభంజనానికి అడ్డుకట్ట?

ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి, ప్రధాని మోదీ రూ.వేల కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడం, అవినీతి రహిత ప్రభుత్వం, నేరచరితులను నిర్మూలించ డం, హిందుత్వ ఓటుబ్యాంకును సంఘటితం చేసే విధానాలు, ప్రధాని మోదీ, సీఎం యోగీల వ్యక్తిగత ఆకర్షణతో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సీఎం యోగి పాలనతోపాటు కేంద్రంలోని ప్రధాని మోదీ విధానాల పట్ల కూడా ప్రజా వ్యతిరేకత ఏర్పడిందని చెబుతున్నారు. బీజేపీ అంతర్గత సర్వేలోనూ మెజారిటీ ఎమ్మెల్యేల పట్ల ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు తేలిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అఖిలేశ్‌యాదవ్‌ సారథ్యంలోని సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ) గతంలో ఎన్నడూ లేనివిధంగా చిన్న పార్టీలను కలుపుకొని పోతుండడం, ఓబీసీలను సంఘటితం చేయడం, పశ్చిమ యూపీలో రైతాంగ ఆందోళనలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్‌ఎల్డీతో చేతులు కలపడం ద్వారా బీజేపీకి సవాల్‌ విసురుతోంది.


ముస్లింలు సమాజ్‌వాది పార్టీ వెనుక సంఘటితం కావడం, రైతులు, యువత, వెనుకబడిన వర్గాలు, దళితుల్లో యోగి పాలనపై వ్యతిరేకత, కరోనా రెండో వేవ్‌ సమయంలో ప్రభుత్వ వైఫల్యం వంటి కారణలతో బీజేపీ అగ్రవర్ణాల ఓటు బ్యాంకునే నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఓటుబ్యాంకును చీల్చేందుకు ఉపయోగపడాల్సిన బీఎస్పీ అధినేత్రి మాయావతి బలహీనపడడం, ప్రియాంకగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌.. బ్రాహ్మణ, జాట్‌ల ఓట్లను చీల్చే అవకాశాలు కనిపిస్తుండడంతో బీజేపీకి యూపీ ఎన్నికలు కత్తిమీద సాములా మారాయి. లఖీంపూర్‌ ఖీరీ ఘటన, హాథ్ర్‌సలో దళిత యువతిపై సామూహిక హత్యాచారం వంటివి యోగి ఆదిత్యనాథ్‌ పాలనకు తలంవంపులు తెచ్చాయని అంటున్నారు.


ఉత్తరాఖండ్‌లో తీవ్ర ప్రజా వ్యతిరేకత..!

ఉత్తరప్రదేశ్‌ మాట ఎలా ఉన్నా.. ఉత్తరాఖండ్‌లో మాత్రం బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకుగాను బీజేపీ 57 స్థానాలను గెలుచుకుంది. అయితే అంతర్గత సంక్షోభం కారణంగా కేవ లం నాలుగు నెలల్లో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చాల్సి వచ్చింది. బీజేపీ జరిపిన అంతర్గత సర్వేల్లోనే 30 స్థానాల్లో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలు ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పరిణమించనున్నాయి. రాష్ట్ర మంత్రి యశపాల్‌ ఆర్యతోపాటు పలువురు నేతలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించడంతో బీజేపీ కొంత బలహీనపడింది. అయితే ఈ రాష్ట్రంలో కూడా ప్రధాని మోదీ జనాకర్షణ, పెద్ద ఎత్తున అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో తాము విజయం సాధిస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


దళిత ఓటర్లే కాంగ్రె్‌సకు శ్రీరామరక్ష..

సాగు చట్టాల కారణంగా శిరోమణి అకాలీదళ్‌ తెగదెంపులు చేసుకోవడంతో పంజాబ్‌లో బీజేపీ ఉనికి కోల్పోయింది. మరోవైపు చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించడం ద్వారా దళిత ఓట్లను సంఘటితం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. 2017 ఎన్నికల్లో పంజాబ్‌లోని 117 సీట్లలో కాంగ్రెస్‌ 77 సీట్లు గెలుచుకోగా, ఆమ్‌ ఆద్మిపార్టీ 20 సీట్లను గెలుచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. అకాలీదళ్‌ 14 సీట్లు గెలుచుకోగా, దాని భాగస్వామి అయిన బీజేపీ కేవలం మూడు సీట్లకే పరిమితమైంది. గత సెప్టెంబరు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్‌ సింగ్‌.. సొంత పార్టీ పెట్టి బీజేపీతో చేతులు కలపడం ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందో చెప్పలేమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే తాజాగా ఫెరోజ్‌పూర్‌లో ప్రధాని మోదీ భద్రత విషయంలో జరిగిన వైఫల్యం కొంత సానుభూతిని రేకెత్తించే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజోత్‌సింగ్‌ సిద్దూ.. పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలు, భావి ముఖ్యమంత్రిని ప్రకటించే పరిస్థితి కాంగ్రె్‌సకు లేకపోవడం, అమృత్‌సర్‌ కపుర్తాలలో జరిగిన ఊచకోతలు కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా మారాయి. 


గోవాలో మళ్లీ సంకీర్ణం?

బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉన్న గోవాలో మనోహర్‌ పరిక్కర్‌ మరణం తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ బీజేపీని ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ బలంగా ఢీకొంటుండగా తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ రంగప్రవేశం చేసింది. ప్రధాని మోదీ ఇటీవల రోమ్‌కు వెళ్లి పోప్‌ను కలవడం ద్వారా గోవాలోని క్రైస్తవ ఓటర్ల దృష్టిని తమవైపు తిప్పుకొనే ప్రయ త్నం చేశారు. ఈ నేపథ్యంలో గోవాలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మణిపూర్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లకుగాను బీజేపీ 21 సీట్లే గెలుచుకుంది. అయినా మణిపూర్‌, గోవాల్లో కాంగ్రెస్‌ సభ్యులను తమ వైపు తిప్పుకొని బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఈసారి తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా మణిపూర్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధా న పోటీ కాంగ్రె్‌సతోనే ఉన్నా ప్రజా వ్యతిరేకతను అధిగమించడం బీజేపీకి ఎంతవరకు సాధ్యమో చెప్పలేమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బీరేన్‌సింగ్‌ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ 73 ఏళ్ల కాంగ్రెస్‌ వృద్ధ నేత ఒక్రోమ్‌ ఇబోబీ అంత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారని చెబుతున్నాయి.


ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి కష్టమే!: రైతు నేతలు

రైతులు కీలకం కానున్న పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌(యూపీ) సహా మిగిలిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపొందడం చాలా కష్టమని రైతు నేతలు శనివారం అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, ఇది ఆ పార్టీకి వ్యతిరేకంగా మారుతుందని 44 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎ్‌సకేఎం) సభ్యుడు అభిమన్యుసింగ్‌ కొహార్‌ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ‘‘ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించినందున ప్రభుత్వం కొత్తగా ఏమీ చేయడానికి లేదు. రైతుల కీలక డిమాండ్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎస్‌కేఎం సభ్యులంతా ఈ నెల 15న సమావేశమై మా భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయిస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-09T07:57:58+05:30 IST