Abn logo
Oct 17 2021 @ 00:36AM

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి

మృతి చెందిన రాజగోపాల్‌రెడ్డి.. జనార్ధన్‌

పెనగలూరులో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని  ముగ్గురు..

చాపాడులో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు...


జిల్లాలో శుక్రవారం రాత్రి వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. పెనగలూరులో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్‌ ఢీకొని ముగ్గురు మృతి చెందగా.. ప్రొద్దుటూరులో జరుగుతున్న దసరా ఉత్సవాలను చూసేందుకు బైక్‌లో వెళుతూ చాపాడు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతి చెందారు.


పెనగలూరు, అక్టోబరు 16: మండలంలోని ఈటిమాపురం గ్రామ పరిధిలోని నాయుడువారిపల్లెలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ సంఘటనకు సంబంధించి పెనగలూరు ఎస్‌ఐ చెన్నకేశవ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఏపీ 39ఎఫ్‌ఎల్‌ 9628 నెంబరు గల ట్రాక్టరు సిమెంటు ఇటుకలను తీసుకుని మూగావారిపల్లె వైపు వెళుతుండగా మార్గమధ్యంలో టైరు పంచరు అయ్యింది. దీంతో ట్రాక్టర్‌ను రోడ్డుపక్కనే నిలిపివేశారు. ఇదిలా ఉండగా నాయుడువారిపల్లె ఎస్టీ కాలనీకి చెందిన నిమ్మల నరసింహులు (20), నిమ్మల సుధాకర్‌ (22), రమణ (40) బైకుపై ఇంటికి వస్తూ ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. ప్రమాదంలో నరసింహులు, సుధాకర్‌ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన రమణను రాజంపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ సంఘటనపై రాజంపేట, రూరల్‌, సీఐ పుల్లయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రమణ కుమార్తెను ఏడాది కిందట సుధాకర్‌కు ఇచ్చి వివాహం జరిపినట్లు స్థానికులు తెలిపారు. 


దసరా పండుగ చూసేందుకు వెళుతూ..

చాపాడు, అక్టోబరు 16: ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు చూసేందుకు వెళుతున్న వారిని మృత్యువు కబళించింది. ద్విచక్ర వాహనంలో వెళుతున్న వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని నాగులపల్లె బస్టాపు వద్ద ఉన్న పెట్రోలు బంకు వద్ద ఈనెల 15న శుక్రవారం రాత్రి మోటారు సైకిల్‌పై రాజగోపాల్‌రెడ్డి, జనార్ధన్‌, వెంకటేషు అనే ముగ్గురు విద్యార్థులు మైదుకూరు నుంచి ప్రొద్దుటూరు పట్టణానికి వెళుతుండగా వెనుకవైపు నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో జనార్ధన్‌ (22), రాజగోపాల్‌రెడి ్డ (22) అనే ఇరువురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి తలలకు, ఇతర శరీర బాగాలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందారన్నారు. వీరిద్దరూ బీటెక్‌ చదువుతున్నారు. వెంకటేష్‌ అనే విద్యార్థికి కాలు విరిగి పరిస్థితి విషమంగా ఉందన్నారు. జనార్ధన్‌ ప్రొద్దుటూరు పట్టణంలోని ఆచార ్ల కాలనీకి చెందినవాడు. రాజగోపాల్‌రెడ్డి దువ్వూరు మండలంలోని పెద్దశింగనపల్లె గ్రామానికి చెందినవాడు. వెంకటేషును మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించారు. దసరా పండుగను చూసేందుకు వెళుతుండగా వారు ఈ ప్రమాదానికి గురయ్యారు. ఇరువురి మృతదేహాలకు ప్రొద్దుటూరులోని జిల్లా ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.