ఐదు నిమిషాలు ఆలస్యమైతే అనుమతి లేదు

ABN , First Publish Date - 2022-05-23T05:02:07+05:30 IST

పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. జూన్‌ 1 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి

ఐదు నిమిషాలు ఆలస్యమైతే అనుమతి లేదు

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

పరీక్షల నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు

కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు


సంగారెడ్డి అర్బన్‌/మెదక్‌అర్బన్‌, మే 22: పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. జూన్‌ 1 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఐదునిమిషాలు ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు తెలిపారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉండనున్నది. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచారు. కేంద్రంలో ఏఎన్‌ఎం నియమించి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స, మందులను అందుబాటులో ఉంచారు.  హాల్‌టికెట్‌ చూపిస్తే బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేలా ఆర్టీసీ చర్యలు తీసుకున్నది. 


సంగారెడ్డిలో 118, మెదక్‌లో 73 పరీక్షా కేంద్రాలు

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 118 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. అందులో 22,564 మంది పరీక్షలు రాయనున్నారు. బాలురు 11,475 మంది, బాలికలు 11,089 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 25 స్టోరేజ్‌ పాయింట్లు, సీ-కేటగిరీ సెంటర్లు-11, సీ-కేటగిరీ కస్టోడియన్లు-11, ఛీప్‌ సూపరింటెండెంట్లు-117, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు-117, అడిషనల్‌ డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు-1, ఫ్లైయింగ్‌ స్క్వార్డ్‌-5, రూట్‌ ఆఫీసర్లు-18, ఇన్విజిలేటర్లు-1280 మంది విధులు నిర్వహించనున్నారు. మెదక్‌ జిల్లావ్యాప్తంగా 73 కేంద్రాలను ఏర్పాటు చేయగా 11,394 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ సారి పరీక్షలకు అదనంగా 15 నిమిషాల సమయం, 50శాతం ఛాయిస్‌ ఇవ్వనున్నారు. గతేడాది 11 పేపర్లు ఉండగా.. ఈ ఏడాది 6 పేపర్లకు మాత్రమే కుదించడంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు కల్పించారు. 


ప్రశాంతంగా పరీక్షలు రాయండి

- నాంపల్లి రాజేశ్‌, డీఈవో సంగారెడ్డి

రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న పదోతరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయించాం. విధుల్లో ఉండే సీఎస్‌, డీవో, ఇన్విజిలేటర్లకు గుర్తింపు కార్డు తప్పనిసరి. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. మాల్‌ప్రాక్టి్‌సకు పాల్పడినా, ప్రోత్సహించినా చర్యలుంటాయి. సందేహాల కోసం 9381190475 నంబరును సంప్రదించాలి. 


అన్ని ఏర్పాట్లు పూర్తి 

- రమేశ్‌కుమార్‌, డీఈవో మెదక్‌

 పదోతరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులూ పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కొవిడ్‌ నిబంధనల మేరకు మాస్కు ధరించి రావాలి. ఎలాంటి ఎలక్ర్టానిక్‌ వస్తువులకు అనుమతి ఉండదు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. 


Updated Date - 2022-05-23T05:02:07+05:30 IST