Abn logo
Aug 4 2020 @ 01:50AM

ఐదు వివాదాలు

Kaakateeya

 • మోదీ హాజరుపై విపక్షాల అభ్యంతరం
 • కరోనా వేళ భూమి పూజ ఎందుకు?
 • కొందరు నేతలనే పిలవడమేంటి?
 • ముహూర్తం బాగోలేదంటున్న కొందరు
 • కోదండపాణి విగ్రహానికి వ్యతిరేకం
 • విమర్శలను తోసిపుచ్చిన బీజేపీ

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరగబోతోంది. దీనిని మహావేడుకగా నిర్వహించేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతుండగా.. ఇంకోవైపు కొన్ని వివాదాలు ముసురుకుంటున్నాయి. మతపరమైన కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ ఎలా హాజరవుతారని కాంగ్రెస్‌, ఎంఐఎం వంటి విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కరోనా కల్లోలం వేళ ఈ కార్యక్రమం జరపడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.


అభ్యంతరాలివీ..

 1. ‘ప్రధాని రాజకీయాలకు అతీతం. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో లౌకికవాదం భాగం. అధికారిక హోదాలో మోదీ భూమిపూజకు హాజరు కావడం రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి విరుద్ధం’ అని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యా ఖ్యానించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దీనిని తిప్పిగొట్టారు. రాష్ట్రపతులు, ప్రధానులు, సీఎంలు అధికారిక హోదా లో, అధికారిక హోదాల్లో ఇఫ్తార్‌ విందులు ఇచ్చినప్పుడు లౌకికవాదం ఏమైందన్నారు. గతంలో సోమ్‌నాథ్‌ ఆలయ ప్రారంభోత్సవానికి నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌, ఉపప్రధాని సర్దార్‌ పటేల్‌ హాజరయ్యారు. మతపరమైన కార్యక్రమా ల్లో వారి ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ అప్పటి ప్రధాని నెహ్రూ వెళ్లలేదు. 1983లో ఇందిరాగాంధీ మాత్రం ప్రధాని హోదాలో హరిద్వార్‌లో భారతమాత మందిరాన్ని ప్రారంభించారు.
 2. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న సమయంలో భూమిపూజ నిర్వహించడాన్ని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ తప్పుబట్టారు. గుడి కడితే ఈ మహమ్మారి పోతుందని కొందరు భావిస్తున్నారని ఎద్దేవా కూడా చేశారు. అయితే పెద్దఎత్తున విమర్శలు చెలరేగడంతో రామాలయ నిర్మాణానికి తాను వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు. కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని.. భౌతిక దూరం పాటించడం తప్పనిసరని రామజన్మభూమి తీర్థ్‌ ట్రస్టు స్పష్టంచేసింది.
 3. భూమిపూజకు సంఘ్‌పరివార్‌ నేతలనే ఎక్కువగా పిలవడంపై కాంగ్రెస్‌, ఆర్‌జేడీ, ఎంఐఎం మండిపడ్డాయి. సుప్రీంకోర్టు తీర్పుతో వివాదం ముగిసిందని.. నిర్వాహకులు అన్ని ప్రధాన పార్టీలను భూమిపూజకు ఆహ్వానించి ఉండాల్సిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. శ్రీరాముడు దశరథుడి కుమారుడు మాత్రమే కాదని.. ఆయనంటే అందరికీ విశ్వాసం ఉందని ఆర్‌జేడీ నేత మనోజ్‌ ఝా వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదని ఎంఐఎం నేత ఒవైసీ ప్రశ్నించారు. అయితే ప్రధాని ప్రధాన అతిథిగా ఉన్న కార్యక్రమానికి.. ఆయన కంటే పెద్ద హోదాలో ఉన్న రాష్ట్రపతిని ఆహ్వానించరని అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి.
 4.  5వ తేదీ మధ్యాహ్నం 12.15.15 గంటల నుంచి 12.15.47 గంటలలోపు భూమిపూజ చేయాలని కాశీలోని సుప్రసిద్ధ జ్యోతిష్య శాస్త్రవేత్త ఆచార్య గణేశ్వర్‌రాజ్‌ రాజేశ్వర్‌ శాస్త్రి ద్రావిడ్‌ ముహూర్తం నిర్ణయించారు. ప్రధాని ఈ 32 సెకన్లలోనే వెండి ఇటుకలను ప్రతిష్ఠిస్తారు. ద్వారకా శంకరాచార్య స్వామి సంపూర్ణానంద సరస్వతి ఈ ముహూర్తంతో విభేదించారు. శంకుస్థాపన తేదీ శుభప్రదమైనది కాదని అన్నారు. దీంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ కూడా ముహూర్తం మంచిది కాదని.. అందుచేత కార్యక్రమాన్ని వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు.  మోదీ తనకు అనుకూలంగా ముహూర్తం నిర్ణయించుకున్నారని, హిందువుల విశ్వాసాలను ఆయన విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఆగస్టు 5 చాతుర్మాస్య దీక్ష సమయంలోకి వస్తోందని.. ఈ తరుణంలో ప్రధానమైన పూజలు నిర్వహించరాదనేది ఇంకొందరి వాదన. ఆ వాదనలో అర్థం లేదని గణేశ్వర్‌రాజ్‌ తోసిపుచ్చారు.
 5. ఇన్నాళ్లు తాత్కాలిక ఆలయంలో ఉన్న రామ్‌లల్లా విగ్రహం బదులు విల్లమ్ములు ధరించిన శ్రీరామచంద్రుడిని ప్రతిష్ఠించాలని ట్రస్టు సంకల్పించింది. భూమిపూజ దీని ప్రతిష్ఠకే జరగనుంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ అభ్యంతరం లేవదీశారు. రాముడు రౌద్రరూపుడు కాదని.. పట్టాభిషేక సమయంలో శ్రీరాముడు ఎలా ఉండేవాడో అలాం టి విగ్రహాన్ని ఎంపిక చేయాలని సూచించారు. నిర్మాణ నిర్వాహకులు ఆయన వాదనను తోసిపుచ్చారు. కోదండపాణిగా శ్రీరాముడి రూపం జగత్‌ ప్రసిద్ధమని స్పష్టంచేశారు.

Advertisement
Advertisement
Advertisement