నిషేధంలోనూ.. చేపల వేట..

ABN , First Publish Date - 2022-08-06T07:42:45+05:30 IST

జిల్లాలో సోమశిల బ్యాక్‌ వాటర్‌ పరిధిలోని ఒంటిమిట్ట, గోపవరం మండలాలలో చేపల వేట సాగుతోంది. అలాగే పోరుమామిళ్ల చెరువు, వాటర్‌గండి, ఇతర ప్రాజెక్టుల్లో కూడా మాఫియా మత్స్యసంపదను దోచుకుంటోంది. ప్రతి యేటా జూలై, ఆగస్టు మాసాల్లో

నిషేధంలోనూ.. చేపల వేట..
ఒంటిమిట్ట మండలం సోమశిల బ్యాక్‌వాటర్‌లో చేపల వేట

సోమశిల బ్యాక్‌వాటర్‌లో జాలర్ల తిష్ట

నిషేధ కాలానికి అధికార యంత్రాంగానికి మామూళ్ల ప్యాకేజీ

కలకత్తా, కేరళ ప్రాంతాలకు రవాణా

రెచ్చిపోతున్న చేపల మాఫియా


జిల్లాలో చేపల మాఫియా రెచ్చిపోతోంది. కొందరు అధికార పార్టీ నేతలు, అధికారులను అడ్డుపెట్టుకుని నిషేధ కాలంలో కూడా చేపలు పట్టేసి రోజూ రూ.లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు. నిషేధ కాలానికి సంబంధించి కొందరు అధికారులకు, నేతలకు ప్యాకేజీ అందుతుండడంతో వీరు చూసీచూడనట్టు ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. వెరసి ప్రాజెక్టులు, చెరువుల్లో ఉన్న చేపలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. అటవీ మార్గంలో నది వద్దకు రవాణాకు అనుమతులు లేకున్నా కూడా దర్జాగా వెళుతున్నారు. ఈ నిషేధిత కాలంలో చేపల వేట వల్ల చేపల గుడ్ల ఉత్పత్తి తగ్గిపోనుంది. అటు అక్రమ వ్యాపారం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడితే, ఇటు మత్స్యకారులకు ఉపాధి కరువు అవుతుంది.


(కడప - ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమశిల బ్యాక్‌ వాటర్‌ పరిధిలోని ఒంటిమిట్ట, గోపవరం మండలాలలో చేపల వేట సాగుతోంది. అలాగే పోరుమామిళ్ల చెరువు, వాటర్‌గండి, ఇతర ప్రాజెక్టుల్లో కూడా మాఫియా మత్స్యసంపదను దోచుకుంటోంది. ప్రతి యేటా జూలై, ఆగస్టు మాసాల్లో ప్రభుత్వం చేపల వేటను నిషేధించింది. ఈ కాలంలో చేపలు గుడ్లు పెడుతుంటాయి. ఈ రెండు నెలల్లో వేట ఆపితే చేపలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. అయితే నిషేధాన్ని ఉల్లంఘించి చేపల వేటను సాగిస్తున్నారు. ఒంటిమిట్ట మండలంలోని కోనాపురం, కోటపాడు, బెస్తపల్లె, తప్పెటవారిపల్లె, పెన్నపేరూరు, అట్లూరు మండలం మలినేనిపట్నం, గోపవరం మండలంలోని గట్టుపల్లె ప్రాంతాల్లో చేపలవేట సాగిస్తున్నట్లు సమాచారం. బద్వేలుకు చెందిన కొందరు అధికారపార్టీ నేతల సహకారంతో ఇక్కడ చేపల వేట కొనసాగిస్తున్నారు. ఒంటిమిట్ట మండల పరిధిలో కొందరు స్థానిక నేతలే చేపల వేటకు అండగా ఉన్నట్లు చెబుతున్నారు.


కడప, కలకత్తా, కేరళ...

జిల్లాలో వేట ద్వారా సేకరించిన చేపలను కడప, చెన్నూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోపవరం మండల పరిధిలోని చేపలను కడపలోని ఐటీఐ సర్కిల్‌ ప్రాంతంలో విక్రయిస్తుండగా ఒంటిమిట్ట మండలం, వాటర్‌ గండి చేపలను చెన్నూరుకు తరలించి అమ్ముతున్నట్లు చెబుతున్నారు. నాలుగు కేజీలకు పైబడి బరువుండే బొచ్చలను కిలో రూ.100 నుంచి రూ.110కి, 3 కిలోల లోపు ఉండే వాటిని రూ.75లకు విక్రయిస్తున్నారు. అయితే చెన్నూరులో స్థానికంగా అమ్ముకునే వారికి కిలోపై రూ.40 తీసుకుని అమ్ముతున్నారు. ఐదు కిలోల బరువు ఉండే బొచ్చ చేపలను కలకత్తా, మీడియం సైజు ఉండే చేపలను కేరళకు రవాణా చేస్తున్నారు.


అధికారులు ఏం చేస్తున్నారు..?

కోస్తాలోని సముద్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే జాలర్లను చేపల మాఫియా తీసుకువచ్చి వారికి స్థానికంగా వసతి ఏర్పాటు చేసి, చేపల వేట కొన సాగిస్తున్నట్లు తెలుస్తోంది. జాలర్లకు మాఫియా చేప సైజు బట్టి కిలోకు రూ.30 ఇస్తున్నారు. నిషేధిత కాలంలో చేపల మాఫియా చేపలు పట్టేస్తుంటే అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అనుమతులు లేకుండా పెన్నానది వద్దకు చేరేందుకు అడవిలో వాహనాల రాకపోకలు సాగుతున్నప్పటికీ పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. నిషేధిత కాలంలో చేపల వేటకు సహకరించిన అధికార యంత్రాంగానికి మాఫియా ప్రత్యేక ప్యాకేజీలను ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రోజూ 5 టన్నుల నుంచి సుమారు పది టన్నుల దాకా చేపల అక్రమ వేట సాగుతున్నట్లు సమాచారం. పోరుమామిళ్ల చెరువులో లీజు గడువు పూర్తయినప్పటికీ అక్కడ జోరుగా చేపల వేట సాగుతోంది. ఇటీవల అక్రమంగా రవాణా చేస్తున్న చేపల వాహనాన్ని మత్స్యశాఖ అధికారులు పట్టుకున్నారని సమాచారం. నిషేధిత కాలంలో కూడా చేపల వేట కొనసాగిస్తుండడంతో చేపల ఉత్పత్తి లేక ఉపాధి కోల్పోతామని స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మత్స్యకారుల పొట్ట కొట్టకండి

- యాటగిరి రాంప్రసాద్‌, టీడీపీ బెస్త సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు 

జిల్లాలో నిషేధం ఉన్నా కూడా చేపల వేట కొనసాగుతోంది. అలివి వలతో వేట సాగిస్తుండడంతో చిన్న చిన్న చేపలు కూడా అందులో చిక్కుతున్నాయి. దీని వల్ల చేపల వేటే జీవనాధారంగా బతికే మత్స్యకారులు ఉపాధి కోల్పోతారు. వైసీపీ నాయకులు, కొందరు అధికారులు కలిసి చేపల అక్రమ వేటను ప్రోత్సహిస్తున్నారు.


కేసులు నమోదు చేస్తాం

- రెడ్డెయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి

జూలై, ఆగస్టు నెలల్లో చేపల వేటపై నిషేధం ఉంది. ఈ కాలంలో చేపల వేట సాగిస్తే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే పోరుమామిళ్ల, బద్వేలులో కేసులు నమోదు చేశాం. 

Updated Date - 2022-08-06T07:42:45+05:30 IST