అమ్మకానికి వైరా చేపల సొసైటీ స్థలం

ABN , First Publish Date - 2022-01-22T04:12:07+05:30 IST

కోటిరూపాయలకు పైగా విలువైన స్థలాన్ని వైరా మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం విక్రయించే దిశగా పావులు కదుపుతోంది.

అమ్మకానికి వైరా చేపల సొసైటీ స్థలం
చేపల సొసైటీ స్థలం

 ప్రధాన రహదారి పక్కన 125 గజాలు

గజం రూ. లక్షకుపై మాటే

వేలంలో రేటు మరింత పెరిగే అవకాశం

వైరా, జనవరి21: కోటిరూపాయలకు పైగా విలువైన స్థలాన్ని వైరా మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం విక్రయించే దిశగా పావులు కదుపుతోంది. వైరాలో ప్రధాన రహదారి పక్కన క్రాస్‌ రోడ్డు వద్ద ఉన్న ఈ స్థలం ఎంతో విలువైనది. ఈ స్థలాన్ని విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్ముతో.. మరోచోట ఎక్కువ విస్తీర్ణంలో స్థలాన్ని కొనుగోలు చేసి భవనాన్ని నిర్మించాలని ప్రయత్నాలు చేపట్టింది. గురువారం ఈ సంఘం అధ్యక్షుడు షేక్‌. రహీమ్‌ అధ్యక్షతన జరిగిన జనరల్‌ బాడీ సమావేశంలో ఈ స్థల విక్రయ ప్రతిపాదన ముందుకోచ్చింది. సంఘం భవన నిర్మాణానికి మూడేళ్ల కిందట ప్రభుత్వం రూ.10 లక్షలు కేటాయించింది. ఇంత వరకు నిర్మాణం మొదలు కాలేదు. నేషనల్‌ హైవే పక్కన ఉన్న స్థలం సరిపోదని అందువలన దాన్ని విక్రయించి మరో చోట స్థలాన్ని కొనుగోలు చేసి భవనాన్ని నిర్మించాలనే ప్రతిపాదనతో సమావేశంలో చర్చ జరిగింది. పార్థసారధి  కలెక్టర్‌గా ఉన్న సమయంలో వైరాలో ఫిషరిస్‌కాలనీ నిర్మించారు. ఆ సమయంలోనే సంఘానికి ప్రధాన రహదారి పక్కన 125 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలంలో తాత్కాలిక భవనాన్ని నిర్మించి కొన్ని రోజుల పాటు సంఘం కార్యాకాలపాలు నిర్వహించారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఈ స్థలం విలువ చదరపు గజం ఒక్కింటికి రూ.లక్షకు పైగా ఉంది. బహిరంగ వేలం ద్వారా ఈ స్థలాన్ని విక్రయిస్తే ఆ ధరల మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ సెంట్రింగ్‌ నిర్వాహణ కొనసాగుతోంది. వైరా రిజర్వాయర్‌ చేపల వేట కాపల, మృతి చెందిన మత్స్యకారుల దహన సంస్కారాలకు రూ. 5 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. గ్రామ పంచాయితీల పరిధిలో ఉన్న 5 చెరువులను సంఘం పరిధిలో విలీనం చేసుకోవడంతో పాటు ఈ స్థలం విక్రయించే విషయం గురించి ఈ సమావేశంలో చర్చించారు.  విధివిధానాలు ఖరారు చేసుకోని అందరి ఆమోదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు అధ్యక్షుడు రహీమ్‌ ధృవీకరించారు.


Updated Date - 2022-01-22T04:12:07+05:30 IST