ఇలా ఎమ్మెల్యేగా గెలిచి..అలా సీఎం పదవి పట్టేసి..!

ABN , First Publish Date - 2021-09-12T23:33:54+05:30 IST

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర భాయ్ పటేల్ అనూహ్యంగా గుజరాత్ కొత్త సీఎంగా ఎంపికకావడం..

ఇలా ఎమ్మెల్యేగా గెలిచి..అలా సీఎం పదవి పట్టేసి..!

గాంధీనగర్:  తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర భాయ్ పటేల్ అనూహ్యంగా గుజరాత్ కొత్త సీఎంగా ఎంపికకావడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. విజయ వర్గీయ, ఆయన మంత్రివర్గం శనివారంనాడు రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు బీజేపీ అధిష్టానం ఆదివారం మధ్యాహ్నం బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో భూపేంద్ర భాయ్ పటేల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో తెరదించింది. భూపేంద్ర పటేల్ పేరును విజయ్ రూపానీ ప్రతిపాదించగా, పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. 182 మంది సభ్యుల అసెంబ్లీలో 122 మంది బీజేపీ ఎమ్మెల్యేలుండగా, దాదాపు అందరూ హాజరయ్యారు.


భూపేంద్ర పటేల్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘాట్‌లోడియా నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి శశికాంత్ పటేల్‌పై ఆయన గెలుపొందారు.2017 ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలుపుపొందిన నాయకుడు కూడా భూపేంద్ర పటేల్ కావడం విశేషం. ఆనందిబెన్ పటేల్ గవర్నర్‌గా నియమితురాలు కావడానికి ముందు 2012లో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లమో చేసిన ఆయనకు ఆనందిబెన్ పటేల్ సన్నిహితుడిగా కూడా పేరుంది. పాటీదార్ కమ్యూనిటీకి చెందిన ఆయన అహ్మదాబాద్‌లోని మెమ్నాగర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అహ్మదాబాద్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేసారు. కాగా, గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా సోమవారంనాడు భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Updated Date - 2021-09-12T23:33:54+05:30 IST