Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ప్రజాద్రోహంలో మీరే ఫస్ట్‌!

twitter-iconwatsapp-iconfb-icon
ప్రజాద్రోహంలో మీరే ఫస్ట్‌!


ప్రజాద్రోహంలో మీరే ఫస్ట్‌!

‘‘ఎక్కడ ప్రజలు గొర్రెల్లా బతుకుతారో వాళ్లను పక్కదారి పట్టించే గొర్రెల కాపరులు ఉన్న దేశాన్ని చూసి జాలి పడదాం. ఎవరి నాయకులైతే అబద్ధాలకోరులవుతారో ఆ జాతిని చూసి జాలిపడదాం. నిజం చెప్పే ధైర్యం చచ్చిన మేధావులు, జాతి 

విద్వేషంతో రగులుతూ పరుల గాలిని సైతం సహించని మూకలున్న దేశాన్ని చూసి జాలిపడదాం. గెలిచినవారిని కీర్తించడం తప్ప గొంతు విప్పని ఆ జాతిని చూ‍స్తే జాలేస్తోంది. రక్తపాతం, చిత్రహింసలతో ప్రపంచాన్ని ఏలాలనుకునే బందిపోట్లను, రౌడీలను ఎవరైతే హీరోలుగా కొలుస్తారో అలాంటి జాతిని చూస్తే జాలేస్తోంది. వారికి తమ భాష తప్ప మరో భాష, సంస్కృతి తెలియదు. వారు డబ్బును మాత్రమే ప్రేమిస్తారు. అలాంటి జాతిని చూస్తే జాలేస్తోంది. తిన్నది అరగని వారు నిద్ర కోసమే నిద్రపోతారు. అలాంటి జాతిని చూస్తే జాలేస్తోంది. తమ హక్కులు తెంచుకుపోతున్నా, తమ స్వేచ్ఛ కొట్టుకుపోతున్నా కిమ్మనని దేశాన్ని, ప్రజల్ని చూసి జాలి పడదాం. ఓ తీయనైన స్వేచ్ఛాయుత దేశమా! మా కన్నీళ్లకు అంతమేది తెలుపుమా!’’ 

ప్రపంచ ప్రఖ్యాత లెబనాన్‌ కవి ఖలీల్‌ జిబ్రాన్‌ రచించిన కవిత ఇది. ఇందులో ఖలీల్‌ వ్యక్తం చేసిన ఆవేదనాభరిత పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పోకడలను, ఆయనను కీర్తిస్తున్న మూకలను చూస్తున్న ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నిర్వహించిన పరిషత్‌ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, అధికార పార్టీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు రాజద్రోహం కేసులో బెయిలు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పకనే చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రమాణాలు దిగజారాయని, విస్తృత అధికారాలను చలాయిస్తూ రాజకీయపక్షాలను అణచివేయడంతో పాటు మీడియాను బెదిరిస్తూ, న్యాయపాలనను బలహీనపరుస్తూ, న్యాయ వ్యవస్థను సైతం బెదిరించడం ప్రజాస్వామ్యం మృగ్యమవుతోందనడానికి నిదర్శనమని హైకోర్టు విమర్శించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అర్థం చేసుకోలేకపోయారంటే ఎన్నికల కమిషనర్‌ పదవికి ఆమె అర్హురాలేనా అన్న సందేహం కలుగుతోందని కూడా హైకోర్టు ఆక్షేపించింది. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిలు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు నర్మగర్భంగా చురకలు అంటించింది. రఘుకు గాయాలయ్యాయని ఆర్మీ ఆసుపత్రి నివేదిక తేల్చి చెప్పిన విషయం వెల్లడవగానే మీ ముఖంలో నవ్వు మాయమైందేంటని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవేను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కస్టడీలో ఉన్నప్పుడు రఘు పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ఆర్మీ ఆసుపత్రి నివేదిక ప్రకారం ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నామని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే జగన్‌ అండ్‌ కో సుప్రీంకోర్టులో జరిగిన దాన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారు. అందుకే, ఎవరి నాయకులైతే అబద్ధాల పుట్టలవుతారో ఆ జాతిని చూస్తే జాలేస్తుందని ఖలీల్‌ జిబ్రాన్‌ అన్నారు. రఘుకు బెయిలు వచ్చిందన్న విషయంతో పాటు ఆయన కాళ్లకు గాయాలైన అంశాన్ని ఆర్మీ ఆసుపత్రి ధ్రువీకరించడాన్ని మరుగుపరచి, ఈ కేసు విషయంలో మీడియాతో మాట్లాడితే తీవ్రంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు అన్నదంటూ జగన్‌ సొంత మీడియా హైలైట్‌ చేసింది. బెయిలు మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు అసాధారణ షరతులు విధించినట్టుగా ప్రచారం మొదలుపెట్టింది. ఇలా మసిపూసి మారేడుకాయ చేసే వ్యాఖ్యలను ప్రచురించి ప్రసారం చేయడమే అసలైన జర్నలిజం అని, ఉన్నది ఉన్నట్టుగా జరిగింది జరిగినట్టుగా చెబితే ఎల్లో మీడియా అని నిందించడం ఈ ఉన్మాద మూకలకు అలవాటుగా మారింది.


బెయిలు మంజూరు చేయడాన్ని హైలైట్‌ చేయని మీడియా సంస్థ ఏదైనా ఉందంటే అది జగన్‌ మీడియా మాత్రమే. ఇప్పుడు చెప్పండి.. ఈ జర్నలిజాన్ని నీలి మీడియా అనొచ్చా లేదా! విచిత్రమేమిటంటే తనను తాను తటస్థవాదిగా చెప్పుకొనే ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ వంటి వాళ్లు కూడా సుప్రీంకోర్టు విధించిన షరతులకు వక్రభాష్యం చెప్పారు. రఘురామరాజు ఇకపై ఏ విషయంపైన కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయకూడదంటూ సుప్రీంకోర్టు షరతు విధించిందని, ముఖ్యమంత్రి కోరుకుంటున్నది కూడా అదే కనుక ఆ మేరకు ఆయన సుప్రీంకోర్టులో విజయం సాధించినట్టేనని నాగేశ్వర్‌ చెప్పుకొచ్చారు. విచారణలో ఉన్న కేసు విషయంలో మాత్రమే రఘుపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఇతర అంశాలపై ఆయన ఎప్పటిలాగే తన అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవచ్చు. నిజానికి భావ ప్రకటనా స్వేచ్ఛను కట్టడి చేసే హక్కు, అధికారం సుప్రీంకోర్టుకు కూడా లేవు. వాస్తవం ఇది కాగా, బెయిలు షరతులు గురించి చిలువలు పలువలుగా ప్రచారం చేయడం జగన్‌ అండ్‌ కో కే చెల్లింది. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి గతంలో బెయిలు మంజూరు చేసినప్పుడు కూడా కోర్టు ఇవే షరతులు విధించిన విషయం మర్చిపోయారు. సుప్రీంకోర్టులో రఘురామరాజుకు పెద్దగా ఊరట లభించలేదన్న అభిప్రాయం కలిగించడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. తొలుత తనను పరీక్షించిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై నమ్మకం లేనందున రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో లేని ఆసుపత్రి వైద్యులతో పరీక్ష చేయించాలన్న రఘురాజు విజ్ఞప్తిని సుప్రీంకోర్టు మన్నించి ఆయనను ఆర్మీ ఆసుపత్రికి పంపించింది. బెయిలు దరఖాస్తుపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ట్రయల్‌ కోర్టుకే వదిలేయాలని ప్రభుత్వం చేసిన వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించడమే కాకుండా రఘుకు బెయిలు మంజూరు చేసింది.


అంటే రాష్ట్ర ప్రభుత్వ వాదన వీగిపోయినట్టే కదా! ఈ వాస్తవాలను మరుగుపరచడానికి ప్రయత్నించే వారితో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ వంటి వారు కూడా శ్రుతి కలపడం ఆశ్చర్యంగా ఉంది. రఘుపై నమోదు చేసిన రాజద్రోహం కేసులో ‘ఏబీఎన్‌ చానల్‌’తో పాటు మరో చానల్‌ను కూడా సహ కుట్రదారులుగా చేర్చడంపై స్పందిస్తూ, ఆ రెండు చానల్స్‌ తెలుగుదేశం పార్టీ అనుకూల చానల్స్‌ అని నాగేశ్వర్‌ చెప్పుకొచ్చారు. మేం ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి విధానాలను విమర్శిస్తున్న మాట వాస్తవం. ఆయన ప్రభుత్వం అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నందునే న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జగన్‌ రెడ్డి తప్పులను ఎత్తి చూపితే తెలుగుదేశం అనుకూలత అని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ భావిస్తే మేం చేయగలిగింది ఏమీ లేదు. అలా అయితే సీపీఎం సానుభూతిపరుడైన నాగేశ్వర్‌ తటస్థవాది ఎలా అవుతారు? ఆయన మమ్మల్ని నిందించినట్టుగా మేం ఆయనను ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పక్షపాతి అంటే అంగీకరిస్తారా? ఆయన అంగీకరిస్తే మేం కూడా అంగీకరిస్తాం. జగన్‌ అండ్‌ కో చేస్తున్న దుష్ప్రచారానికి మేధావులం అని చెప్పుకునే కొంతమంది వంతపాడడం వల్లనే ప్రజలు పక్కదారి పడుతున్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపితే గుండెపోటుతో చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేసింది జగన్‌ అండ్‌ కో కాదా? రఘురామరాజు విషయమే తీసుకుందాం, సీఐడీ పోలీసులు తనను హింసించారని సీఐడీ కోర్టుకు ఆయన ఫిర్యాదు చేసిన సందర్భంగా ఆయన కమిలిన పాదాల ఫొటోలు విడుదలయ్యాయి. వాటిని చూసిన వారెవరికైనా లాఠీలతో ఆయన అరికాళ్లపై కొట్టారనే అనిపిస్తుంది. అయితే జగన్‌ అండ్‌ కో చేసిన ప్రచారం ఏమిటి? రఘుకు సొరియాసిస్‌ వ్యాధి ఉందని, గోక్కోవడం వల్ల అరికాళ్లు అలా కనిపిస్తున్నాయని ప్రచారం చేశారు. ఆ తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆయనకు అయిన గాయాలు, కొట్టడం వల్ల అని చెప్పలేమని పేర్కొనడంతో.. ‘‘చూశారా! పోలీసులు ఆయనను కొట్టలేదు!’’ అంటూ ప్రచారం చేశారు. ఆర్మీ ఆసుపత్రి నివేదికలో రఘు కాళ్లు వాచి ఉన్నాయని పేర్కొనడంతో ఆయనకు ఎడిమా వ్యాధి ఉందని ప్రచారం మొదలుపెట్టారు. ఎడిమా అనేది ఒక వ్యాధి కాదని ఈ అజ్ఞానులకు ఎవరు చెప్పాలి? వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వారిలో కాళ్ల చీలమండల దగ్గర నీరు చేరుతుంది. దానినే ఎడిమా అంటారు. సుప్రీంకోర్టులో వాదన సందర్భంగా రఘు తన కాళ్లను తానే గాయపరుచుకున్నారేమోనని సరికొత్త వాదన చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు అనుచితంగా ప్రవర్తించడం వల్లనే రఘుకు గాయాలయ్యాయని ఆర్మీ ఆసుపత్రి నివేదిక ప్రకారం ప్రాథమికంగా అంచనాకు వచ్చామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆటలు సాగలేదు. లాఠీలతో కొడితే సొరియాసిస్‌ వస్తుందని చెప్పగల తెంపరితనం జగన్‌ అండ్‌ కో సొంతం మరి! కస్టడీలో రఘును హింసించిన విషయాన్ని మరుగుపరచడానికై అసాధారణ బెయిలు షరతులు విధించినట్టుగా గోబెల్స్‌ ప్రచారం మొదలెట్టారు. రఘును ఎవరు కొట్టారు? వారిపై ఏ చర్యలు తీసుకోబోతున్నారు? అసంబద్ధ నివేదిక ఇచ్చిన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకునే విషయంలో కూడా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవ్యవస్థ పనితీరు గురించి చాలా మందిలో అవగాహన ఉండదు కనుక రఘు కేసు ఇక ముగిసినట్టేనన్న అభిప్రాయం పలువురిలో ఏర్పడింది. నిజానికి ముందున్నది ముసళ్ల పండుగ! హింసించిన వారెవరో నిర్ధారించి శిక్షింపజేయడానికి సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ రఘు తరఫున ఆయన కుమారుడు భరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ వచ్చే మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. రఘుకు బెయిలు ఇచ్చే విషయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేష్‌ రెడ్డి ముందుగా సీఐడీ కోర్టుకు వెళ్లాలని ఆదేశించడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ట్రయల్‌ కోర్టుతో పాటు హైకోర్టుకు నేరుగా వచ్చినవారికి కూడా బెయిలు ఇవ్వవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదేమైనా జగన్‌ అండ్‌ కో ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ రఘురాజు దాఖలు చేసుకున్న పిటిషన్లు సుప్రీంకోర్టు ముందు ఉన్నందున ఈ వ్యవహారంలో తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరు.


ఒత్తిడి.. ముమ్మాటికీ నిజం!

అధికారులు తమ పరిధి మరిచి రాజకీయ బాస్‌ల అడుగులకు మడుగులొత్తితే ఏమి జరుగుతుందో రఘు కేసు ఉదాహరణగా నిలవబోతున్నది. సీఐడీ పోలీసులు తనను అరెస్టు చేయడానికి వచ్చినప్పుడే రఘురాజు తన శరీరాన్ని పరిశీలించి గాయాలు ఉన్నదీ లేనిదీ స్పష్టం చేస్తూ ధ్రువపత్రం ఇవ్వవలసిందిగా కోరిఉంటే ఇంత డ్రామాకు కూడా అవకాశం ఉండేది కాదు. తన శరీరాన్ని పరిశీలించి గాయాలకు సంబంధించిన ధ్రువపత్రం ఇచ్చిన తర్వాతే తనను అదుపులోకి తీసుకోవాలని పట్టుబట్టే హక్కు చట్టప్రకారం పౌరులకు ఉంటుంది. స్వాతంత్య్ర పోరాట యోధులను జైళ్లకు పరిమితం చేయాలన్న దుష్ట తలంపుతో బ్రిటిష్‌ సామ్రాజ్యవాద శక్తులు తీసుకు వచ్చిన చట్టాలలో సెక్షన్‌ 124–ఏ ఒకటి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటింది. ప్రజాస్వామ్యంలో ఉన్న మనం వలస పాలకుల చట్టాలను కొనసాగించడం ఏమిటి? ఈ కారణంగానే తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే సెక్షన్‌ 124–ఏ ను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ గత ఎన్నికల సందర్భంగా తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉంటాయి. రాజులు ఉండరు. అలాంటప్పుడు రాజద్రోహం ఏమిటి? జగన్‌ రెడ్డి తనను తాను ముఖ్యమంత్రిగా కాకుండా ప్రజాసేవకుడిగా భావిస్తుంటారని సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు. అలాంటప్పుడు ప్రజాసేవకుడిని విమర్శిస్తే రాజద్రోహం ఎలా అవుతుంది? రఘు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాలను ప్రసారం చేసిన రెండు చానళ్లు సహకుట్రదారులుగా సీఐడీ అధికారులకు ఎలా కనిపించాయి? రఘురాజు అధికార పార్టీలో రెబల్‌ ఎంపీ. ఒక ఎంపీతో చానళ్లు చర్చలు పెట్టకూడదా? అసలు సదరు విలేకరుల సమావేశాలను కవర్‌ చేయకుండా మిగతా న్యూస్‌ చానళ్లను కట్టడి చేస్తున్నది ఎవరు? రఘురాజు కాళ్లకు అయిన గాయాలను ప్రేక్షకులకు చూపించకుండా దాచిపెట్టిన టీవీ9, సాక్షి, ఎన్టీవీ వంటి చానళ్లను కట్టడి చేస్తున్నది ఎవరు? ఇలాంటి జర్నలిజాన్ని ఏమనాలి? అధికార పార్టీ తప్పులను, అరాచకాలను దాచిపెట్టడమే నిఖార్సయిన జర్నలిజమని పిచ్చి వాదన చేస్తున్న వారిని ఇక నుంచి నీలి మూక అని పిలుచుకోవచ్చు. ఈ మూక కోరుకుంటున్న జర్నలిజం మెరుగైన సమాజానికి ఉపయోగపడదని అధికారానికి లొంగిపోయిన చానల్స్‌ గుర్తించాలి. ‘రఘురాజు విషయంలో ఏ సందర్భంలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని, తనను వ్యక్తిగతంగా దూషించిన వాళ్లు వాళ్ల పాపాన వాళ్లే పోతారు, అన్నీ దేవుడే చూసుకుంటాడు.. వదిలేద్దామనే గొప్ప మనసున్న వ్యక్తి జగన్‌ రెడ్డి’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రవచించారు. సీఐడీ అధికారులు తమంతట తామే కేసు నమోదు చేశారని కూడా తేల్చి చెప్పారు. అంటే, సజ్జల ముందు జాగ్రత్తలు తీసుకున్నారన్న మాట! ఇప్పుడు సీఐడీ అదనపు డీజీ సునీల్‌ కుమార్‌ విషయానికి వద్దాం. ముఖ్యమంత్రిని ఎవరో విమర్శిస్తే సునీల్‌ కుమార్‌కు ఎందుకు బాధనిపించిందో తేలాల్సి ఉంది.


శాసనసభలో రఘురాజును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోసిన అధికార పార్టీ సభ్యుడు జోగి రమేష్‌కు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి థ్యాంక్స్‌ చెప్పారు. తన పట్ల ఉన్న ఆప్యాయత వల్ల బాధతో జోగి అలా అని ఉంటారని కూడా జగన్‌ చెప్పుకొచ్చారు. ఈ చర్య వల్ల జోగి రమేష్‌ పట్ల తనకున్న అభిమానం మరింత పెరుగుతుందని కూడా ఆయన సెలవిచ్చారు. అంటే, తన ప్రత్యర్థులను తిట్టిపోసే వారి పట్ల ముఖ్యమంత్రిలో ప్రేమాభిమానాలు పొంగిపొర్లుతాయన్న మాట. దీన్నిబట్టి కస్టడీలో రఘురాజును హింసించిన సీఐడీ అధికారులపై ముఖ్యమంత్రికి ఇంకెంత ప్రేమాభిమానాలు పొంగిపొర్లుతాయో చూడాలి. రఘు విషయంలో ముఖ్యమంత్రి అంతులేని సహనం ప్రదర్శించారని సజ్జల అంటుంటే, సహనానికి కూడా హద్దు ఉంటుందని అధికార పార్టీ ఎంపీలు తేల్చిపారేశారు. ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి ఆ పార్టీతో విభేదించే పక్షంలో పార్టీకి రాజీనామా చేయడం సరైన విధానం. అయితే ఇలాంటి ఉదాత్త విలువలు ఇప్పటి రాజకీయాల్లో మచ్చుకు కూడా కనిపించవు. తాను ఏ పార్టీ తరఫున గెలిచాడో అదే పార్టీకి చెందిన అధినేత జగన్‌ రెడ్డిని ఎంపీ రఘురాజు దూషించడం ఏమిటి? అని దీర్ఘాలు తీస్తున్నవారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ ప్రతిపక్ష నేత చంద్రబాబును అంతే దారుణంగా తిట్టారు కదా? అది సమర్థనీయమైతే రఘురాజు చేసింది కూడా సమర్థనీయమే! అసెంబ్లీలో జోగి రమేష్‌ చేసిన విమర్శలు, వాడిన భాష ఏ కోవలోకి వస్తాయో చెప్పాలి. కస్టడీలో రఘు పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నట్టు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల వల్ల ఈ ఉదంతంపై విచారణ జరిగితే అత్యుత్సాహం ప్రదర్శించిన సీఐడీ అధికారులకు మూడినట్టే. ముఖ్యమంత్రి పట్ల తన ఆప్యాయతను మరొకరిని దుర్భాషలాడటం ద్వారా జోగి రమేష్‌ ప్రదర్శించినట్టుగానే రఘును కస్టడీలో హింసించడం ద్వారా ముఖ్యమంత్రిపై తమకు ఉన్న అభిమానాన్ని, ఆప్యాయతను సీఐడీ అధికారులు ప్రదర్శించి ఉంటారు. ఈ కేసులో ఏ స్థాయిలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్న మాటలు ఏ మాత్రం నమ్మశక్యం కావు. రఘురాజుపై దాడి చేసిన పోలీసులను రక్షించడం కోసం, వైద్య నివేదికను అనుకూలంగా ఇవ్వవలసిందిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు మా వద్ద ఉన్నాయి. నా మీద గానీ, ‘ఏబీఎన్‌’ మీద గానీ ఇంకో కేసు పెట్టుకోవచ్చు.


రాజకీయాలలో కక్ష సాధింపులు హద్దులు మీరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక ఎంపీ అని కూడా చూడకుండా రఘురాజును కస్టడీలో కొట్టారు. మాజీ ఎంపీ, రఘురాజు వియ్యంకుడు డాక్టర్‌ కెవిపి రామచంద్రరావుపై అమెరికాలో ఒక కేసు దాఖలైనప్పుడు, అప్పటి తెలుగుదేశం ఎంపీలు కొందరు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును కలిసి కేవీపీ ‘చిక్కాడు’ అని సంబరపడగా, ఆ కేసు ఏమిటో మనకు తెలియదు, కేవీపీ మన ప్రత్యర్థి కావచ్చు కానీ ముందుగా తెలుగువాడు కనుక ఆయనను ఏదో చేయాలని ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోండని చంద్రబాబు అన్నారట. కొంతకాలం క్రితం రఘురాజు ఈ విషయాన్ని తన మిత్రుడికి చెప్పారు. అధికారంలో ఉన్నందున మొత్తం పోలీసు వ్యవస్థ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ముందు మోకరిల్లవచ్చు. అధికారం పోయినప్పుడు కానిస్టేబుల్‌ కూడా తిరగబడతాడు. ఈ సూక్ష్మం తెలిసినవాళ్లు కనుకే ఇంతకుముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్లు లక్ష్మణరేఖ దాటలేదు. ఇప్పుడు జగన్‌ రెడ్డి అన్ని లక్ష్మణరేఖలను చెరిపేసుకున్నారు. భవిష్యత్తులో పరిస్థితులు తిరగబడితే ఆయనను ఓదార్చడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలరు. ఒక చెడ్డవాడు మంచివాడుగా మారితే వాడి మంచితనం భరించలేనంతగా ఉంటుంది. మంచోడిని చెడ్డవాడిగా మార్చితే వాడి చెడును కూడా భరించలేమని చెబుతారు. జగన్‌ రెడ్డిని గుడ్డిగా సమర్థించేవారు ఈ సత్యాన్ని గ్రహించాలి. రఘురాజు అత్యున్నత విలువలు కలిగిన సంఘ సంస్కర్తేమీ కాదు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కూడా అంతే. అలా అని ముఖ్యమంత్రిని తిట్టినందుకు రాజద్రోహం కేసు పెడతారా? అలా అయితే జగన్‌ రెడ్డిపైనా ఆయన ఆధ్వర్యంలోని నీలిమీడియా పైనా ఎన్నిసార్లు రాజద్రోహం కేసులు పెట్టాలి? ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అధికారానికి గులాంలుగా మారిన, మారుతున్న అధికారులందరికీ ఇది ఒక హెచ్చరిక. ఎమర్జెన్సీ కాలంలో ఇలాగే పరిధులు దాటి అధికార పార్టీ పక్షాన రెచ్చిపోయిన అధికారులు, అటు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏర్పాటు చేసిన షా కమిషన్ విచారణలో దోషులుగా తేలి శిక్ష అనుభవించిన చరిత్రను మరచిపోకూడదు. వారు ఇప్పటికీ కళ్లు తెరవకపోతే వారిని ఆ దేవుడే రక్షించాలి. ఖలీల్‌ జిబ్రాన్‌ ఆవేదన చెందినట్టుగా ‘అహో ఆంధ్రదేశమా ఏమిటీ దుస్థితి!’ అని రోదించే పరిస్థితి రాకూడదని కోరుకుందాం!

ఆర్కే

ప్రజాద్రోహంలో మీరే ఫస్ట్‌!

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.