బొడ్డపాడులో అగ్నికీలలు

ABN , First Publish Date - 2021-01-19T05:36:57+05:30 IST

బొడ్డపాడులో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 16 పూరిళ్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.25 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. కోనేటి కాంతమ్మ, జయలక్ష్మి, బలగ సూరమ్మ, గొల్లంగి లచ్చమ్మ, శ్రీకాకుళం ఆదిలక్ష్మి, అంపోలు లక్ష్మి, దాలమ్మ, సరోజనమ్మ, పుణ్యవతి, దువ్వారపు అప్పలనర్సమ్మ, రాములమ్మ, గౌరమ్మ, రాజలు, కరువమ్మ, అప్పమ్మ, లచ్చుమమ్మల ఇళ్లు కాలి బూడిదయ్యాయి. బాధితులంతా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు.

బొడ్డపాడులో అగ్నికీలలు
బొడ్డపాడులో దగ్ధమవుతున్న ఇళ్లు

- విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం

-  16 పూరిళ్లు దగ్ధం  

- రూ.25 లక్షల ఆస్తి నష్టం 

బొడ్డపాడు (జలుమూరు), జనవరి 18 : బొడ్డపాడులో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 16 పూరిళ్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.25 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. కోనేటి కాంతమ్మ, జయలక్ష్మి, బలగ సూరమ్మ, గొల్లంగి లచ్చమ్మ, శ్రీకాకుళం ఆదిలక్ష్మి, అంపోలు లక్ష్మి, దాలమ్మ, సరోజనమ్మ, పుణ్యవతి, దువ్వారపు అప్పలనర్సమ్మ, రాములమ్మ, గౌరమ్మ, రాజలు, కరువమ్మ, అప్పమ్మ, లచ్చుమమ్మల ఇళ్లు కాలి బూడిదయ్యాయి. బాధితులంతా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. సమాచారం తెలుసుకున్న కోటబొమ్మాళి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేసినా.. ప్రయోజనం లేకపోయింది. బియ్యం, నగదు, బంగారం, చేపలు, వలలు, దుస్తులు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయని బాధితులంతా ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ.. అగ్నిప్రమాదం సంభవించడంతో జాగ్రత్త పడేందుకు కూడా వీలులేకపోయిందని వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తహసీల్దారు జామి ఈశ్వరమ్మ, రెవెన్యూ పరిశీలకులు చిన్నారావు, వీఆర్వో చక్రధరరావులు సోమవారం బాధితులను పరామర్శించారు. భోజన సదుపాయాలు కల్పించారు. ఒక్కో బాధిత కుటుంబానికి ప్రభుత్వ సాయంగా పది కేజీల బియ్యం, రూ.5వేల నగదు అందజేశారు. జనసేన నాయకులు కూడా ఒక్కో కుటుంబానికి 25 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. స్థానిక వైసీపీ నాయకుడు అంపోలు తిరుపతిరావు..  ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2వేలు చొప్పున ఆర్థిక సాయం చేశారు. పదిరోజుల పాటు వారికి భోజన సదుపాయాలు కల్పించనున్నట్టు రెవెన్యూ అధికారులకు తెలిపారు. వైసీపీ యువనాయకుడు ధర్మాన రామలింగన్నాయుడు ఒక్కో కుటుంబానికి రూ.5వేల నగదు, 10 కేజీల బియ్యం అందజేశారు. ప్రమాద విషయాన్ని డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ దృష్టికి తీసుకెళ్లి.. ప్రభుత్వం నుంచి బాధితులకు ఆర్థిక సాయం అందజేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


పునరావాసం కల్పించండి


బాధితులకు భోజన సదుపాయంతో పాటు పునరావాసం కల్పించాలని టెక్కలి సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం బాధితులను ఆయన పరామర్శించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. 


బాధితులను ఆదుకోవాలి


అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. బాధితులను సోమవారం ఆయన పరామర్శించారు. దుప్పట్లు, చీరలు, వంటపాత్రలతో పాటు 5 కేజీల చొప్పున బియ్యం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బాధితులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలి’ అని కోరారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు, భవానీ చారిటబుల్‌ ట్రస్టు సభ్యులతో కూడా ఫోన్‌లో మాట్లాడి.. బాధితులకు సాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బగ్గు గోవిందరావు, బైరి భాస్కరరావు, పంచిరెడ్డి రామచంద్రరావు, తర్ర బలరాం, పొన్నాడ దాలయ్య, బాలకృష్ణ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-19T05:36:57+05:30 IST