పరిశ్రమల వ్యర్థాలకు నిప్పు

ABN , First Publish Date - 2022-01-18T04:37:22+05:30 IST

ఈ- బోనంగి రెవెన్యూ పరిధి ఇండస్ట్రీయల్‌ పార్కులోని ఖాళీ ప్రదేశంలో గుట్టు చప్పుడు కాకుండా పరిశ్రమల వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో సోమవారం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది.

పరిశ్రమల వ్యర్థాలకు నిప్పు
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

దట్టంగా ఎగసిన పొగ

ఆందోళన చెందిన స్థానికులు

పరవాడ, జనవరి 17: ఈ- బోనంగి రెవెన్యూ పరిధి ఇండస్ట్రీయల్‌ పార్కులోని ఖాళీ ప్రదేశంలో గుట్టు చప్పుడు కాకుండా పరిశ్రమల వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో సోమవారం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది.  ఉదయం 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థాలకు నిప్పు పెట్టి అక్కడ నుంచి పరారయ్యారు. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పాటు నల్లటి దట్టమైన పొగ కమ్మేసింది. దీనికి తోడు భరించలేని దుర్వాసన వెదజల్లింది. విషతుల్యమైన ప్లాస్టిక్‌ వ్యర్థాలను దగ్ధం చేయడంతో వాసన భరించలేక పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న రాంకీ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఏపీఐఐసీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు వ్యర్థాలను తరచూ ఇక్కడే పడవేసి నిప్పు పెట్టిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. వ్యర్థాలను ఇష్టానుసారంగా పడవేసి కాలుష్యానికి కారణమవుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని సీటూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాఽధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు.


Updated Date - 2022-01-18T04:37:22+05:30 IST