శ్రీరామ నవమి ఉత్సవాల్లో అపశ్రుతి

ABN , First Publish Date - 2021-04-22T06:23:01+05:30 IST

గంగాబౌలి ఆకాశ్‌పురి హనుమాన్‌ ఆలయం వద్ద నిర్వహించిన శ్రీరామ నవమి ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది.

శ్రీరామ నవమి ఉత్సవాల్లో అపశ్రుతి
ఆలయం వద్ద కమ్ముకున్న పొగ

ఎమ్మెల్యే రాజాసింగ్‌ నిర్వహించిన వేడుకల్లో అగ్నిప్రమాదం

మంగళ్‌హాట్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): గంగాబౌలి ఆకాశ్‌పురి హనుమాన్‌ ఆలయం వద్ద నిర్వహించిన శ్రీరామ నవమి ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో అగ్నిప్రమాదం జరగడంతో ఉరుకులు, పరుగులు పెట్టారు. ఏటా రాజాసింగ్‌ ఆధ్వర్యంలో గంగాబౌలిలోని ఆకాశ్‌పురి హనుమాన్‌ ఆలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.  బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే టపాసులు కాల్చారు. బీజేపీ కార్యకర్తలు, రాజాసింగ్‌ అభిమానులు పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చడంతో ఆలయం సమీపంలోని చెత్త, దేవాలయానికి ఆనుకొని ఉన్న సామగ్రికి మంటలు అంటుకొని దట్టమైన పొగ వ్యాపించింది. స్థానికులు, బీజేపీ కార్యకర్తలు ఫైర్‌ స్టేషన్‌, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కొద్ది పాటి ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. 


Updated Date - 2021-04-22T06:23:01+05:30 IST