తెల్ల కాగితం మోసుకొచ్చిన పావురంపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-04-21T18:26:13+05:30 IST

పంజాబ్‌లోని పాకిస్థాన్ సరిహద్దుల్లో ఓ అనుమానాస్పద పావురంపై కేసు

తెల్ల కాగితం మోసుకొచ్చిన పావురంపై కేసు నమోదు

న్యూఢిల్లీ : పంజాబ్‌లోని పాకిస్థాన్ సరిహద్దుల్లో ఓ అనుమానాస్పద పావురంపై కేసు నమోదైంది. ఆ పావురం కాళ్ళకు ఓ కాగితం ఉంది. పాకిస్థాన్ సరిహద్దులకు కేవలం 500 మీటర్ల దూరంలోని గస్తీ స్థావరం రోరన్‌వాలాకు ఈ పావురం ఏప్రిల్ 17 సాయంత్రం వచ్చింది. క్యాంప్ గార్డ్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ నీరజ్ కుమార్ భుజంపై వాలింది. 


నీరజ్ కుమార్ వెంటనే ఈ విషయాన్ని స్థావరం కమాండర్ ఓంపాల్ సింగ్‌కు తెలిపారు. ఆ పావురాన్ని ఓంపాల్ సింగ్ పరీక్షించారు. దాని కాలికి ఓ తెల్ల కాగితం అంటించి ఉన్నట్లు, దానిపై ఓ నంబరు రాసి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ పావురంపై అమృత్‌సర్‌లోని కహగఢ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 


పాకిస్థాన్‌లో పావురాలకు గూఢచర్యంలో శిక్షణ ఇచ్చి, మన దేశంలోకి పంపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది మే నెలలో జమ్మూ-కశ్మీరులోని కథువా జిల్లాకు ఇటువంటి పావురమే వచ్చింది. 


Updated Date - 2021-04-21T18:26:13+05:30 IST