ఎలమందకు ఆర్థిక ఆసరా

ABN , First Publish Date - 2020-07-06T10:59:36+05:30 IST

మాంసం వినియోగంలో దేశంలో తెలంగాణది అగ్రస్థానం. ఈ అంశాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, జీవాల సంపదను

ఎలమందకు ఆర్థిక ఆసరా

మూడేళ్లలో రూ.198కోట్లు ఆర్జించిన గొల్ల, కుర్మలు

యూనిట్ల పంపిణీలో రాష్ట్రంలో జిల్లాకు ప్రథమస్థానం


నల్లగొండ, జూలై 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాంసం వినియోగంలో దేశంలో తెలంగాణది అగ్రస్థానం. ఈ అంశాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, జీవాల సంపదను పెంచేందుకు, గొల్ల, కురుమలకు ఆర్థిక ప్రోత్సాహం కల్పించేందుకు గొర్రెల పంపిణీ కార్యక్రమానికి 2017లో శ్రీకారం చుట్టింది. 20 మేకలు, ఒక గొర్రె పొట్టేలు యూనిట్‌గా, రూ.1.25 లక్షలు వ్యయంతో పంపిణీ చేసింది. అందులో 75శాతం ప్రభుత్వం, 25శాతం లబ్ధిదారుడు భరించేలా పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వం వాటాగా రూ.93,750 ఇస్తే, లబ్ధిదారుడు రూ.32,250 చెల్లించాలి. కాగా, ఈ పథకం అమలులో రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది.


మూడేళ్లలో రూ.198 కోట్ల ఆర్జన

గొర్రెల పంపిణీ పథకం 2017 జూన్‌ 2న ప్రారంభమైంది. ఈ పథకానికి ముందు నల్లగొండ జిల్లాలో 11లక్షల గొర్రెలు ఉన్నాయి. పథకంలో భాగంగా 24,500 యూనిట్లు నల్లగొండ జిల్లాలో పంపిణీ చేశారు. యూనిట్‌కు 21 చొప్పున మొత్తం 4.50లక్షల గొర్రెలు ఇచ్చారు. అయితే మూడేళ్ల తరువాత 3.50లక్షల గొర్రెలు ఉత్పత్తి అయ్యాయి. ఈ పథకం తీరుపై గత కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ వెయ్యి కుటుంబాలపై సర్వే చేయించారు. ఎదిగిన, ముదిరిన గొర్రెలను కాపరులు ఎప్పటికప్పుడు విక్రయించారు. ఇలా 60శాతం గొర్రెలను విక్రయించగా, 40శాతం సందపను కాపరులు భవిష్యత్తు ఉత్పత్తి కోసం ఉంచుకున్నారు. ఒక్కో గొర్రెను సగటున రూ.4,200లకు విక్రయించారు. గొర్రె సంతతిని విక్రయించడం ద్వారా రూ.150కోట్లు, గొర్రె పొట్టెలు విక్రయించడం ద్వారా రూ.150 కోట్లను కాపారులు ఆర్జించినట్టు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు నిర్వహించిన సర్వేలో తేలింది.


దుర్వినియోగంపై 170 కేసులు నమోదు

ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు దుర్వినియోగం కాకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను కొందరు వెంటనే విక్రయించారు. ఇలా జిల్లాలో 500 యూనిట్లు విక్రయించగా, 170 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. జిల్లాలో ఇంకా 25వేల యూనిట్లు గొల్ల, కురుమలకు పంపిణీ చేయాల్సి ఉంది. వాటికోసం లబ్ధిదారులు డీడీలు కట్టి ఎదురుచూస్తున్నారు.


21 గొర్రెలు ఇస్తే 72 అయ్యాయి..పంతమోని నర్సయ్య, రేకులగడ్డ, చందంపేట మండలం

సర్కారోళ్లు గొర్రెలు ఇయ్యక ముందు నా దగ్గర ఏడు జీవాలు ఉండే. వాళ్లు 21 ఇచ్చారు. అవి 72 అయ్యాయి. రోగాలు వచ్చి కొన్ని, ముసలివి కొన్ని మొత్తం 12 వరకు మృతిచెందాయి. అవి పోగా నా దగ్గర ప్రస్తుతం 60 గొర్రెలు మిగిలాయి. సర్కారు సాయం రాక ముందు నా భార్య కూలీ నాలి చేసేది. నేను ఉన్న కొన్ని గొర్లు కాసుకునేది. ప్రస్తుం 60 గొర్రెలతో నాకు ఓ జీవనాధారం లభించింది.


కుటుంబాలకు ఆర్థిక పరిపుష్ఠి

చందంపేట: జిల్లాలో మారుమూల మండలం చందంపేటలో 10 పాత పంచాయతీలు ఉన్నాయి. వీటిలో తొమ్మిది పంచాయతీల్లో యాదవ కుటుంబాలకు ప్రభుత్వం 579యూనిట్ల గొర్రెలు పంపిణీ చేసింది. ముడుదండ్ల గ్రామానికి 32 యూనిట్లు, మురుపునూతలకు 72, పోలేపల్లికి 107, చంద ంపేటకు 70, గాగిళ్లపూర్‌కు 81, రేకులగడ్డకు 49, పొగిళ్లకు 50, పెద్దమూలకు 53, చీత్రియాలకు 65యూనిట్ల చొప్పున గొర్రెలు పంపిణీ చేశారు. అవి ఇప్పుడు మూడు రెట్లయ్యాయి. రేకులగడ్డ గ్రామంలో గతంలో 500 గొర్రెలు ఉండేవి. వాటిపై 49 గొల్ల, కుర్మ కుటుంబాలు జీవించేవి. వీరికి గొర్రెల పంపిణీ పథకం ప్రారంభంలో 2017లో 1029 గొర్రెలు పంపిణీ చేశారు. అవి ఏటా వెయ్యి చొప్పున అదనంగా 3వేల గొర్రెలు ఉత్పత్తి అయ్యాయి. దీంతో యాదవుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి.

Updated Date - 2020-07-06T10:59:36+05:30 IST