Abn logo
Apr 22 2020 @ 00:46AM

ఆర్థిక ఆరోగ్యమే అందరి ఆలోచన

కరోనా సంక్షోభంతో కుదేలయిపోయిన రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు అవసరమయిన సహాయం కోసం కేంద్రం వైపు చూస్తున్నాయి. ధాన్యాన్ని భారత ఆహార సంస్థ కొనుగోలు చేయడం, జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అన్వయించడం తదితర విషయాలలో చేపట్టవలసిన అనేక చర్యల్ని పలు రాష్ట్రాలు సూచించాయి. రిజర్వు బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన వడ్డీని రద్దు చేయాలని, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులను సడలించి రుణాలు చేసుకునేందుకు వివిధ రుణ సంస్థలనుంచి వీలు కల్పించాలని రాష్ట్రాలు గట్టిగా కోరుతున్నాయి.


‘ఈదేశ విత్త విధానం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా పటిష్ఠం చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉన్నది. తక్షణం చర్యలు తీసుకోండి.. ఇంక తాత్సారం చేయవద్దు’ అని ఇటీవల ఒక ముఖ్యమంత్రి విలేఖరుల సమావేశంలో కేంద్రానికి ఘంటాపథంగా చెప్పారు. ప్రధానమంత్రి మోదీ ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకునే వ్యక్తి. రాష్ట్రాలు కాదు, పరిశ్రమలు కూడా ఆయన ఏం చర్యలు తీసుకుంటారా అని ఎదురు చూస్తున్నాయి. మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను కుదుపు కుదిపే చర్యలు తీసుకోవడం పూర్తిగా మోదీ చేతుల్లోనే ఉన్నది. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత గరీబ్ కల్యాణ్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1.70లక్షల కోట్ల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక ఉపశమన చర్యగానే భావిస్తున్నాయి కాని ఒక బలమైన ఆర్థిక చర్యగా భావించడం లేదు. కానీ ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం తాను ప్రకటించిన ప్యాకేజీ గురించి ప్రచారం చేసుకోవడంలోనే నిమగ్నమైంది.


కరోనా వైరస్ మన ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని గురించి అంచనా వేయడంలోనే మోదీ ప్రభుత్వం ఇంకా తర్జనభర్జనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  చిన్న, పెద్ద పరిశ్రమలు, వ్యాపారం నుంచి వైమానిక రంగం వరకు పూర్తిగా స్తంభించిపోయాయి. ఒక్క మాటలో మొత్తం ఆర్థిక కార్యకలాపాలే కుదేలైపోయాయి. సకాలంలో ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసే ప్యాకేజీని ప్రకటించకపోతే పరిస్థితిని నియంత్రించలేమని రాష్ట్ర ప్రభుత్వాధినేతలనుంచి వ్యాపారవేత్తల వరకూ చెబు తున్నారు. అరవింద్ సుబ్రహ్మణ్యం వంటి ఆర్థికవేత్తలు కనీసం రూ.10లక్షల కోట్ల మేరకు భారీ ప్యాకేజీని ప్రకటిస్తేకాని పరిస్థితిలో మార్పు రాదని అంటున్నారు.


కాని భారత ప్రభుత్వం ఈ ప్యాకేజీని ప్రకటించే పరిస్థితిలో ఉన్నదా అన్నది చర్చనీయాంశం. నిజానికి ప్రధానమంత్రి మోదీ మే 3వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రకటన చేసేటప్పుడు అన్యమనస్కంగానే కనపడ్డారు. అప్పటి వరకూ కరోనాపై పోరుకు దేశాధినేతగా తానే నాయకత్వం వహిస్తున్నట్లు  కనపడ్డ ప్రధానమంత్రి లాక్‌డౌన్ విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు కనిపించ లేదు. ఎందుకంటే లాక్‌డౌన్ గురించి కానీ, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యల గురించి కానీ ప్రధానమంత్రి ఎన్ని ప్రకటనలు చేసినా దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత, కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉన్నదని ఆయనకు తెలుసు.


నిజానికి కరోనాపై పోరాటానికి నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకున్నా దాన్ని విజయవంతం చేయడం పూర్తిగా మోదీ చేతుల్లో లేదు. ఆరోగ్య సంరక్షణ విషయంలో మొత్తం దేశానికి మార్గదర్శకంగా నిలిచే సూచనలు చేయగలిగిన నాయకత్వం కేంద్రంలో ఉన్నదా అన్న విషయం కూడా చర్చనీయాంశం. ఎందు కంటే ఇవాళ మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత ప్రధానమంత్రి స్వంత రాష్ట్రమైన గుజరాత్ కూడా కరోనాను తీవ్రంగా ఎదుర్కొంటున్నది. తాజా లెక్కల ప్రకారం కరోనా పీడితుల కేసులు గుజరాత్‌లో 2వేలు దాటాయి. మంగళవారం ఒక్క రోజే 200మంది అదనంగా కరోనా వాతపడ్డారు. ఒక్క అహ్మదాబాద్‌లోనే దాదాపు 400కు పైగా కరోనా కేసులున్నాయి. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గుజరాత్‌ను ఎంతో అభివృద్ది చేశారు కదా.. దేశానికే అభివృద్ధి నమూనాగా చెప్పుకుంటున్న గుజరాత్‌లో కరోనా ఎందుకు తీవ్రస్థాయిలో ఉన్నదని ప్రశ్నిస్తే చాలామంది అధికారుల వద్ద సరైన సమాధానం ఉండదు. గుజరాత్‌లో ఎక్కువగా వృద్ధులు ఉన్నందువల్ల వారు కరోనా వాత ఎక్కువ పడుతున్నారు.. అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకున్నారు కాని అందులో వాస్తవికత కనిపించడం లేదు. నిజానికి ఆ రాష్ట్రంలో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఆరోగ్య వ్యవస్థను నిర్లక్ష్యం చేశారన్న వాదనకు ఎన్నో తార్కాణాలున్నాయి. ఒకప్పుడు ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుగా ఉన్న రఘురామరాజన్ సమర్పించిన నివేదిక ప్రకారమే ఆనేక మానవ అభివృద్ధి సూచికల్లో గుజరాత్ వెనుకబడి ఉన్నదని తేలింది.


2016లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ప్రకారం ఆ రాష్ట్ర ప్రజారోగ్య వ్యవస్థలు దాదాపు కుప్పకూలిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యనిపుణుల కొరత 77శాతం, సాధారణ డాక్టర్ల కొరత 69శాతం, నర్సుల కొరత 72శాతం, పారా మెడికల్ సిబ్బంది కొరత 41శాతం, ఆసుపత్రుల్లో పడకల కొరత 73శాతం ఉన్నాయని, మందులు కొనేందుకు మంజూరు చేసిన నిధులు ఉపయోగించలేదని, అత్యవసరమైన మందులు రోగులకు లభ్యం కావడం లేదని, పేషంట్లకు చవకబారు మందులు అందిస్తున్నారని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, ఎమర్జెన్సీ సర్వీసులు నాణ్యంగా లేవని, గైనకాలజిస్టుల కొరత వల్ల మాతృశిశుమరణాలు ఎక్కువైపోయాయని రఘురామరాజన్ నివేదిక స్పష్టంగా పేర్కొంది. ఈ నివేదిక వెలువడేనాటికి మోదీ ప్రధానమంత్రిగా వున్నారు. పోనీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గడచిన ఆరేళ్లలో వైద్య, మౌలిక సదుపాయాల రంగాలలో ఆయన చేపట్టిన చర్యల సత్ఫలితాలు ప్రజల అనుభవంలోకి వచ్చిన దాఖలాలు కూడా లేవు.


ప్రధానమంత్రి నేతృత్వంలోని నీతీ ఆయోగ్ గత ఏడాది సమర్పించిన నివేదిక ప్రకారమే మొత్తం ఆరోగ్య సూచికల్లో ఉత్తమ పనితీరు కనపరచిన రాష్ట్రంలో అగ్ర స్థానం కేరళకు దక్కితే బిజెపి పాలిత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌కు అన్నిటికన్నా తక్కువ స్థానం దక్కింది. ఈ నివేదిక కూడా గుజరాత్‌ను, ఆరోగ్య వ్యవస్థ కొద్దిగా మెరుగుపడిన రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ల తర్వాత చేర్చింది. తాజా గణాంక వివరాలను బట్టి చూసినా బిజెపి అధికారంలో లేని కేరళ, రాజస్థాన్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే కరోనాను కట్టుదిట్టంగా ఎదుర్కొంటున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్ కేసులు తారాస్థాయికి చేరుకున్న కేరళలో కరోనా పీడితుల కేసులు, మరణాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. అక్కడ ప్రభుత్వం జనవరి నుంచే కరోనాపై పోరు ప్రారంభించి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కూడా వార్తాకథనాలు రాస్తున్నది. ముఖ్యంగా ప్రజా ఆరోగ్య వ్యవస్థ, స్థానిక పాలనా వ్యవస్థ అక్కడ బలంగా ఉండడం, విద్యాధికులైన ప్రజలు సామాజిక చైతన్యంతో కరోనాపై పోరుకు సహకరించడం, వీటన్నిటికితోడు నాయకత్వం సకాలంలో సమర్థమైన చర్యలు తీసుకోవడం  ప్రధాన కారణాలని అంటున్నారు.


ఇవాళ దేశంలో చాలా రాష్ట్రాలు తమ ప్రజల ఆరోగ్య సంరక్షణ విషయంలో తామే స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వలస కార్మికులను ఆదుకోవడం, పిపిఇ కిట్‌లు నుంచి మాస్క్‌ల కొనుగోలు వరకు క్రమక్రమంగా తామే నిర్ణయాలు తీసుకోక తప్పదని, కేంద్రం మార్గదర్శక సూత్రాలకోసం చూస్తే పుణ్య కాలం గడిచిపోతుందని వారికి అర్థమయింది. నిజానికి కరోనా వైరస్ గురించి కేరళలాగా తామే ముందు మేలుకున్నట్లయితే ఈ పాటికి దాన్ని నియంత్రించేవాళ్లమని ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్ర నేత అన్నారు. వైద్య సంరక్షణ విషయంలోనే కాదు, రైతులనుంచి ధాన్యం కొనుగోలు, ఎరువుల సరఫరా, ప్రజలకు నిత్యావసర వస్తువుల సరఫరా, లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయడం, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం వంటి అనేక నిర్ణయాలను రాష్ట్రాలే అమలు చేస్తున్నాయి. మరి కేంద్రం ఏమి చేయాలి? ప్రజలకు సందేశాలు పంపడం, రాష్ట్రాలకు వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా లేఖలు రాయించడం సాధారణంగా ఎవరైనా చేస్తారు. కానీ ఇవాళ రాష్ట్రాలు తమను ఆర్థికంగా బలో పేతం చేయడం కోసం కేంద్రం వైపు చూస్తున్నాయి. ధాన్యాన్ని ఎఫ్‌సిఐ కొనుగోలు చేయడం, జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అన్వయించడం విషయంలో చేపట్టవలసిన అనేక చర్యల్ని పలు రాష్ట్రాలు సూచించాయి.


చాలా రాష్ట్రాలు, రిజర్వు బ్యాంకు ద్వారా రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నగదు బదిలీలు జరగాలని ఆశిస్తున్నాయి. ఇలాంటి కష్ట కాలంలో కాకపోతే రిజర్వు బ్యాంకు ఉండి ప్రయోజనమేమిటి అని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ, తమ ఖర్చును బాగా తగ్గించుకున్నప్పటికీ కేంద్రం తోడ్పడకపోతే మాత్రం కోలుకోలేవు. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలంటే రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు పటిష్ఠంగా ఉండాలి. రాష్ట్రాలనుంచి ఆదాయాలు రాకపోతే కేంద్ర ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా మారలేదు. రాష్ట్రాలు ఏమీ కేంద్రాన్ని నిధులు గాలిలో సృష్టించి తమకు ఇవ్వమనడం లేదు. రిజర్వు బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన వడ్డీని రద్దు చేయాలని, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులను సడలించి రుణాలు చేసుకునేందుకు వివిధ రుణ సంస్థలనుంచి వీలు కల్పించాలని కోరుతున్నాయి. తాము చెల్లించాల్సిన రుణాలు, వడ్డీల కాలపరిమితిని వాయిదా వేయాలని కోరుతున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం లక్ష కోట్ల గ్రాంట్ కావాలని కోరితే, పశ్చిమ బెంగాల్ రు.25వేల కోట్ల గ్రాంట్ కావాలని కోరింది. జీఎస్టీ క్రింద బకాయీ ఉన్న నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని కూడా పలు రాష్ట్రాలు కోరుతున్నాయి.


ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వ్యవస్థ పటిష్ఠీకరణతో పాటు కేంద్రాన్ని అడగాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు గత 36రోజులుగా పడిపోతుండగా, మన దేశంలో మాత్రం వాటి రిటైల్ ధరలు ఎందుకు పడిపోవడం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భారత దేశంలో పెట్రోలియం నిల్వల  సామర్థ్యం కూడా పదిరోజులకు మించి లేదని చెబుతున్నారు. విచిత్రమేమంటే ఐఎంఎఫ్ సలహాదారుగా ఉన్న రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ రాజన్ వంటి ఆర్థిక వేత్తలు ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు తగిన సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నప్పటికీ ఇక్కడ పట్టించుకునే నాథుడు లేడు. ఇవాళ భారత దేశానికి ప్రతిపక్షాలతో పాటు అన్ని వర్గాలనుంచి ఆర్థిక నిపుణులతో సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని రఘురామరాజన్ పదిరోజుల క్రితమే ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బహుశా మోదీ సర్కార్‌కు ప్రశంసకులనుంచే కాని విమర్శకులనుంచి సలహాలు స్వీకరించగల సంయమన శక్తి లేకపోవడమే అలాంటి వారిని విస్మరించడానికి కారణం కావచ్చు. విచిత్రమేమంటే కరోనా వ్యాప్తిని అరికట్టే విషయంలో పర్యవేక్షణకు కేంద్ర టీమ్‌ను పశ్చిమ బెంగాల్‌కు పంపాలని నిర్ణయించిన మోదీ ప్రభుత్వం కరోనా పీడిత రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉన్న గుజరాత్‌కు ఎందుకు పంపలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కష్ట కాలంలోనూ రాజకీయాలను పట్టించుకోకపోతే తమకు మనుగడ లేదని భారత రాజకీయ నాయకులకు తెలిసినంత మరెవరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Advertisement
Advertisement
Advertisement