ఆదాయం వచ్చే దారేది?

ABN , First Publish Date - 2021-10-24T06:02:47+05:30 IST

ఏఎంసీలు వైభవాన్ని కోల్పోతున్నాయి. ఆదాయం తగ్గుముఖం పట్టడంతో వాటి నిర్వహణ కష్టతరంగా మారుతోంది. జిల్లాలో ఇచ్ఛాపురం, కంచిలి, పలాస, కోటబొమ్మాళి, జలుమూరు, నరసన్నపేట, శ్రీకాకుళం, పాతపట్నం, హిరమండలం, పాలకొండ, రాజాం, ఆమదాలవలస, పొందూరు, ఎచ్చెర్లలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి.

ఆదాయం వచ్చే దారేది?
రాజాం మార్కెట్‌ కమిటీ కార్యాలయం




 ఏఎంసీలకు ఆర్ఘిక కష్టాలు

- యార్డుల్లో పెట్రోల్‌ బంకులు

- మూడుచోట్ల ఏర్పాటుకు సిద్ధం

- త్వరలో మరో ఐదుచోట్ల

- సన్నాహాలు ప్రారంభించిన చమురు సంస్థలు

- సేవలకు స్వస్తి..మనుగడకు పాట్లు

- నిధుల కొరతలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు

(రాజాం)

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఆదాయ అన్వేషణలో పడ్డాయి. ప్రభుత్వం నుంచి నిధులు రాక... ఆదాయం లేక ఏఎంసీలు సతమతమవుతున్నాయి. మౌలిక వసతులకుగాను స్థానిక సంస్థలకు నిధులు అందించడంతో పాటు సీజన్ల వారీగా పశువైద్య శిబిరాలు నిర్వహించేవి. ఉచితంగా ముందులు అందించేవి. అటువంటిది ప్రస్తుతం సిబ్బంది జీతాలు, యార్డుల నిర్వహణకే నిధులు సరిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆదాయం పెంచుకునేందుకు మార్కెటింగ్‌ శాఖ యోచిస్తోంది. అందులో భాగంగా యార్డు ప్రాంగణల్లో పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. కోటబొమ్మాళి, ఆమదాలవలస, రాజాంలలో బంకుల ఏర్పాటుకు నిర్ణయించింది. హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ సంస్థలు బంకుల నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించాయి.

ఏఎంసీలు వైభవాన్ని కోల్పోతున్నాయి. ఆదాయం తగ్గుముఖం పట్టడంతో వాటి నిర్వహణ కష్టతరంగా మారుతోంది. జిల్లాలో ఇచ్ఛాపురం, కంచిలి, పలాస, కోటబొమ్మాళి, జలుమూరు, నరసన్నపేట, శ్రీకాకుళం, పాతపట్నం, హిరమండలం, పాలకొండ, రాజాం, ఆమదాలవలస, పొందూరు, ఎచ్చెర్లలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏఎంసీల పరిధిలో 100 బంకులు ఏర్పాటు చేయడానికి మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా జిల్లాలో 14 ఏఎంసీలకుగాను ఏడు చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కోటబొమ్మాళి, ఆమదాలవలసలో హెచ్‌పీసీఎల్‌, రాజాంలో ఐవోసీ సంస్థ ఫిల్లింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారి చెంతనే ఉన్న ఎచ్చెర్ల, నరసన్నపేట, పలాస, కంచిలి, ఇచ్ఛాపురంతో పాటు పొందూరులో పెట్రోల్‌ బంకులు ఏర్పాటుచేసే అవకాశముంది.

 ఆదాయం అంతంతమాత్రం

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు ఆదాయం అంతంతమాత్రంగా ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సమయంలో చెక్‌పొస్టుల వద్ద వసూలు చేసే పన్నులే ప్రధాన ఆదాయం. గోదాంలలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలకు కొంత మొత్తం అద్దె రూపంలో ఆదాయం వస్తోంది. కానీ గత ఏడాది కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఒకే మార్కెట్‌ విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో చెక్‌పోస్టులు మూతపడ్డాయి. ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఏఎంసీల మనుగడే ప్రశ్నార్థకమైంది. కొన్ని ఏఎంసీలు జీతాలు ఇచ్చుకోలేని స్థితిలోకి వెళ్లాయి. అటువైపు ప్రభుత్వం కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. ఈ పరిస్థితుల్లో కొత్త ఆదాయ మార్గాల వైపు అధికారులు దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఈ-పర్మిట్‌ విధానం, తాజాగా పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు నిర్ణయించారు. 

 నాటి సేవలేవీ?

మౌలిక వసతుల కల్పనకు స్థానిక సంస్థలకు ఏఎంసీలు నిధులు కేటాయించేవి. గ్రామాల్లో సీసీ రోడ్లు, బీటీ రహదారులు, కాలువల ఏర్పాటుకు నిధులను ఖర్చు చేసేవారు. కానీ గత పదేళ్లుగా నిధులు నిలిచిపోయాయి. అప్పట్లో ఏఎంసీ నిధుల కోసం సర్పంచ్‌లు ఎదురుచూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాగే ఏటా సీజన్ల వారీగా ఏఎంసీలు గ్రామాల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించేవి. ఉచితంగా మందులు అందించేవి. పాడిరైతులకు ప్రయోజనకరంగా నిలిచేది. ఈ సేవలకు కూడా ఏఎంసీలు మంగళం పాడాయి. మనుగడకే నానా పాట్లు పడుతున్నాయి. 

  మూడుచోట్ల ఏర్పాటు

జిల్లాలో ఆమదాలవలస, రాజాం, కోటబొమ్మాళి ఏఎంసీల పరిధిలో పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు నిర్ణయించారు. రాష్ట్రస్థాయిలోనే చమురు సంస్థల కంపెనీల ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మరో నాలుగు చోట్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రాజాంలో జేడీ సుధాకర్‌ స్థల పరిశీలన చేశారు. 

- బి.శ్రీనివాసరావు, ఏడీ, మార్కెటింగ్‌ శాఖ, శ్రీకాకుళం




111111111111111111111111111111

Updated Date - 2021-10-24T06:02:47+05:30 IST