Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎట్టకేలకు!

సీతమ్మధార ఉపఖజానా అక్రమాలపై కదిలిన యంత్రాంగం 

ఖజానా రాష్ట్ర డైరెక్టర్‌ నేతృత్వంలో విచారణ ప్రారంభం 

మహారాణిపేట, డిసెంబరు 2: సీతమ్మధార ఉపఖజానాలో మూడేళ్ల క్రితం జరిగిన నిధుల గల్లంతు, ఇతర అక్రమాలపై ఎట్టకేలకు గురువారం కలెక్టరేట్‌లోని జిల్లా ఖజానాకార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. నిధుల గల్లంతుపై ఆశాఖ అధికారులు కొందరు విచారణ చేపట్టకుండా అనేక కారణాలు చెబుతూ తప్పించుకున్నారు. చివరకు ఖజానా రాష్ట్ర డైరెక్టర్‌ ఎస్‌ఆర్కే గణేష్‌ విచారణ చేయాలని నిర్ణయించుకుని రంగంలోకి దిగారు. విజయనగరం జిల్లా సహాయ ఖజానా అధికారి ఆర్‌ఏఎస్‌ కుమార్‌తో కలిసి  గురువారం జిల్లా ఖజానా కార్యాలయానికి వచ్చి విచారణ ప్రారంభించారు.  2018 అక్టోబరులో సీతమ్మధార ఉపఖజానా కార్యాలయంలో సుమారు రూ.1.5 కోట్లు గల్లంతయ్యాయి. ఆ సమయంలో ఉపఖజానా అఽధికారిగా వెంకటేశ్వరావు పనిచేశారు. కొంతమంది పింఛన్‌దారుల ఖాతాల్లోకి రూ.లక్షలు జమకావడంతో గుర్తించిన బ్యాంక్‌ అధికారులు ఖజానా శాఖ ఉన్నతాధికారులకు, విజిలెన్స్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారించారు. ఉపఖజానా నుంచి ిపింఛన్‌దారుల ఖాతాల్లోకి సుమారు రూ.1.5 కోట్లు జమయినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని అధికారంగా ఖజానా ఉన్నతాధికారులు ప్రకటించినా తరువాత దారి మళ్లిన సొమ్ము రూ.2.5 కోట్లు ఉంటుందనే ప్రచారం సాగింది.  విచారణలో ఉపఖజానా అధికారి కోస్టు వెంకటేశ్వరావుతో పాటు మరో ముగ్గురు ఉద్యోగుల ‘పాసువర్డు’తో కొత్తగా ఉద్యోగంలో చేరి ప్రోబేషనరీ కాలపరితిలో ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ వెంకటనరసింహం ద్వారా ిపింఛన్‌ దారుల ఖాతాల్లోని నిధులు మళ్లినట్టు విచారణలో తేలింది. దీంతో జూనియర్‌ అసిస్టెంట్‌ వెంకటనరసింహం, ఎస్టీవో వెంకటేశ్వరావు, మరో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూనియర్‌ అసిస్టెంట్‌ వెంకట నరసింహంను అరెస్టు చేసి అతని నుంచి సుమారు రూ.90 లక్షలు రికవరీ చేసినట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. మిగిలిన సొమ్ముపై  ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈఘటనపై పూర్తి విచారణ చేయాలని ప్రభుత్వం, ట్రెజరీ ఉన్నతాధికారి ఎం.సాబ్‌జాన్‌ ఆధ్వర్యంలో కమిటి వేసింది. ఏం జరిగిందో కానీ సాబ్‌జాన్‌ విచారణ చేపట్టలేదు. ఘటన జరిగి మూడేళ్లయినా విచారణ నివేదిక సమర్పించకపోవటంతో సాబ్‌జాన్‌ నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. ఈ ఏడాది జూన్‌ రెండో తేదీన నోటీసు ఇచ్చింది. 


ఆది నుంచీ అనుమానాలే...

 నిధుల గల్లంతు వ్యవహారంలో నిజానిజాలను వెలుగులోకి రానివ్వకుండా ఖజానా అధికారులు  ఆది నుంచీ మోకాలడ్డుతున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై విచారించి, నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించినా విచారణ జరపకపోవడం వెనుక సొంత శాఖ అధికారులే సిబ్బందిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదులు వెళ్లాయి. సాబ్‌జాన్‌ తరువాత కాకినాడ, నెల్లూరు జిల్లాల ట్రెజరీ అధికారులు ఈ కుంభకోణంపై విచారణకు నిరాకరించడం గమనార్హం. ఘటన జరిగి మూడేళ్లయినా విచారణ కొలిక్కి రాకపోవడంతో ప్రభుత్వ ఆదేశాలతో ఖజానా విభాగాధిపతి రంగంలోకి దిగారు. నిధుల గల్లంతులో జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి రికవరీ చేసిన సొమ్ము కాకుండా ఇంకా ఎంత సొమ్ము రికవరీ చేయాలి? గతంలో అధికారులు ప్రకటించిన రూ. కోటిన్నర కాకుండా ఎక్కువగా ఉందా? అనే దిశగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది.  మూడేళ్లలో విచారణ చేయడానికి నిరాకరించిన అధికారులపై ఎవరు ఒత్తిడి తీసుకువచ్చారనేది కూడా తేలాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఇద్దరు ఉద్యోగులు పదవీ విరమణ చేయడం విశేషం.


Advertisement
Advertisement