Kashmir Filesలాంటి సినిమాలు రాకుండా చూడాలి: ఫరూఖ్ అబ్దుల్లా

ABN , First Publish Date - 2022-05-17T01:27:55+05:30 IST

ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివేక్ అగ్నిహోత్రి సినిమా కశ్మీర్ ఫైల్స్‌పై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి

Kashmir Filesలాంటి సినిమాలు రాకుండా చూడాలి: ఫరూఖ్ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్: ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివేక్ అగ్నిహోత్రి సినిమా కశ్మీర్ ఫైల్స్‌పై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సినిమాలు దేశంలో విద్వేషాన్ని నింపుతున్నాయని, వీటిని ఆపాలని అన్నారు. 1990లలో కశ్మీర్ లోయ నుంచి కశ్మీరీ పండిట్ల వలసలను ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. 


జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు హత్య చేసిన నేపథ్యంలో ఫరూఖ్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలిసిన కలిసిన మాజీ సీఎం జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ ఫైల్స్ సినిమా దేశంలో విద్వేషాన్ని నింపిందని గవర్నర్‌తో చెప్పినట్టు తెలిపారు. ఆ సినిమాలో హిందూ వ్యక్తిని చంపిన ముస్లిం ఆ రక్తాన్ని అన్నంలో కలిపి అతడి భార్యను అడుగుతాడని, నిజంగా అలా జరుగుతుందా? అని ప్రశ్నించారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్వేషాలను పెంచే మీడియాను కూడా నియంత్రించాలని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. దేశంలోని ముస్లింలపై ద్వేషపూరిత వాతావరణం కాశ్మీర్‌లోని ముస్లిం యువతలో ఆగ్రహాన్ని పెంచుతోందని అన్నారు. 


రాహుల్ భట్ హత్యను నిరసిస్తూ కశ్మీరీ పండిట్లు చేసిన ఆందోళనలను పోలీసులు అణచివేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. దీనిపై ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. వారేమీ రాళ్లు విసర లేదని, తమకు భద్రత కావాలని మాత్రమే వారు అడుగుతున్నారని అన్నారు. కశ్మీరీ పండిట్లు రాళ్లు విసరగా తాను ఇప్పటి వరకు చూడలేదన్నారు. 


బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు తాను బుద్గాం వెళ్తుంటే అధికారులు తనను అడ్డుకున్నారని అబ్దుల్లా ఆరోపించారు. అలా అడ్డుకుంటే ఒకరికొకరం ఎలా దగ్గరవుతామని ప్రశ్నించారు. విద్వేషానికి తప్పకుండా ముగింపు పలకాలని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. 

Updated Date - 2022-05-17T01:27:55+05:30 IST