పోరు‘బాట’!

ABN , First Publish Date - 2020-12-06T05:20:00+05:30 IST

రహదారుల అధ్వాన దుస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ నేతలు పోరుబాట పట్టారు. పాడైన రోడ్లను బాగు చేయాలని కోరుతూ శనివారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రహదారులపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

పోరు‘బాట’!
రణస్థలం : కమ్మసిగడాం జంక్షన్‌ వద్ద ఎన్‌ఈఆర్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలు

 

రోడ్డెక్కిన బీజేపీ నేతలు

పాడైయిన రోడ్లను బాగు చేయాలని డిమాండ్‌

జిల్లావ్యాప్తంగా నిరసనలు

రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు

గుజరాతీపేట/రణస్థలం, డిసెంబరు 5: రహదారుల అధ్వాన దుస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ నేతలు పోరుబాట పట్టారు. పాడైన రోడ్లను బాగు చేయాలని కోరుతూ శనివారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రహదారులపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అట్టాడ రవిబాబ్జీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం- ఆమదాలవలస రహదారిపై ధర్నా చేశారు. బుచ్చిపేట, రాగోలు వద్ద రహదారిపై బైఠాయించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు  చేపట్టడం లేదని విమర్శించారు.  గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న 14వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం  ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తోందని ఆరోపించారు. శ్రీకాకుళం- ఆమదాలవలస రోడ్డు దారుణంగా తయారైందన్నారు. ఈ మార్గంలో నిత్యం స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌లు ప్రయాణిస్తున్నా రహదారిని మాత్రం బాగు చేయడం లేదన్నారు. ఈ రోడ్డు అధ్వానంగా ఉండడంతో ఇటీవల స్పీకర్‌ సీతారాం కారు ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా జిల్లాలోని రహదారులను బాగు చేయాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, జాతీయ ఓబీసీ కార్యవర్గ సభ్యుడు దుప్పల రవీంద్రబాబు,  పార్టీ  రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం, కార్యదర్శి శవ్వాన ఉమామహేశ్వరి, యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి పూడి బాలాదిత్య, తదితరులు పాల్గొన్నారు. 

- రణస్థలంలో ఎచ్చెర్ల నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి నడుకుదిటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో కమ్మసిగడాం జంక్షన్‌-దేవరాపల్లి రహదారిపై ధర్నా చేశారు.  కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు లంక అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-06T05:20:00+05:30 IST