మొన్నలా.. నే‘డీలా’

ABN , First Publish Date - 2021-04-10T06:25:26+05:30 IST

జిల్లాలో పంచాయతీ, జడ్పీ ఎన్నికల మధ్య ఓటర్ల మనోగతంలో వచ్చిన మార్పు ఇప్పుడు రాజకీయ పార్టీలకు కునుకు పట్టనీయడం లేదు. స్వల్ప వ్యవధిలో జరిగిన ఈ రెండు పోలింగ్‌ల్లో ఓటింగ్‌ వ్యత్యాసం భారీగా ఉండడంతో అసలెందుకిలా జరిగిందనేదానిపై వేటికవే విశ్లేషణలు జరుపుతున్నాయి.

మొన్నలా.. నే‘డీలా’
ముమ్మిడివరం మండలం క్రాపచింతలపూడిపాలెంలో గురువారం ఓటర్లు లేక వెలవెలబోతున్న పోలింగ్‌ కేంద్రం

  • జడ్పీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 10.77 లక్షల మంది ఓటింగ్‌కు దూరం
  • 29,97,485 లక్షల మందికి 19,19,961 మందే ఓటు హక్కు సద్వినియోగం
  • పురుషుల్లో 9,73,653 మంది, మహిళల్లో 9,46,304 లక్షల మంది ఓటేసిన వైనం
  • అత్యధికంగా రాజమహేంద్రవరం డివిజన్‌ పరిధిలో 68.85 శాతం పోలింగ్‌ నమోదు
  • అత్యల్పంగా రంపచోడవరం డివిజన్‌లో 53.41శాతమే ఓటింగ్‌
  • జిల్లా మొత్తం మీద మామిడికుదురు మండలంలో అత్యధికంగా 75.16 శాతం పోలింగ్‌
  • తొండంగి మండలంలో అత్యల్పంగా 41.38 శాతమే ఓటింగ్‌
  • పంచాయతీ ఎన్నికల్లో ప్రతి డివిజన్‌లో పోలింగ్‌ 80 శాతం కాగా, ఇప్పుడు 60 శాతమే

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పంచాయతీ, జడ్పీ ఎన్నికల మధ్య ఓటర్ల మనోగతంలో వచ్చిన మార్పు ఇప్పుడు రాజకీయ పార్టీలకు కునుకు పట్టనీయడం లేదు. స్వల్ప వ్యవధిలో జరిగిన ఈ రెండు పోలింగ్‌ల్లో ఓటింగ్‌ వ్యత్యాసం భారీగా ఉండడంతో అసలెందుకిలా జరిగిందనేదానిపై వేటికవే విశ్లేషణలు జరుపుతున్నాయి. పంచాయతీ ఎన్నికలకు పల్లె ఓటర్లంతా పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తితే... యాభై ఏడు రోజుల తర్వాత జరిగిన జడ్పీ ఎన్నికలకు అదే పల్లె ఓటర్లు పోలింగ్‌కు భారీగా దూరమయ్యారు. దీంతో ఇంతతక్కువ వ్యవధిలో ఓటింగ్‌ శాతంలో అంత తేడా ఎందుకు వచ్చిందనేది అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. మొన్న ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా అన్ని డివిజన్లలో కలిపి మొత్తం 81.37 శాతం పోలింగ్‌ నమోదైతే గురువారం జరిగిన జడ్పీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం 64.05 శాతానికి పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే జడ్పీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 10.77 లక్షల మది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. గురువారం జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా ఎక్కడ ఎంత శాతం పోలింగ్‌ నమోదైందనేది అధికారులు అతికష్టంపై లెక్కలు తేల్చారు. వాస్తవానికి గురువారం అర్ధరాత్రికి ఈ వివరాలు ప్రకటించాల్సి ఉండగా, పలుచోట్ల రాత్రి వరకు కొనసాగిన పోలింగ్‌ నేపథ్యంలో వివరాల వెల్లడి ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు శుక్రవారం వీటిని అధికారికంగా వెల్లడించారు. దీని ప్రకారం జిల్లావ్యాప్తంగా 29,97,485 లక్షల మందికిగాను 19,19,961 మందే ఓటుహక్కు వినియోగించుకున్నట్టు తేల్చారు. పురుషుల్లో 9,73,653 మంది, మహిళల్లో 9,46,304 లక్షల మంది ఓటు హక్కు సద్వినియోగం చేసుకోగా, 10.77 లక్షల మంది అసలు ఓటు హక్కుకు వినియోగించుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో పంచాయతీ ఎన్నికలతో పోల్చితే గణనీయంగా పోలింగ్‌ శాతం ఎందుకు పడిపోయిందనేదానిపై పార్టీలు వేటికవే లెక్కలు వేసుకుంటున్నాయి. అటు జడ్పీ ఎన్నికల్లో రెవెన్యూ డివిజన్ల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా రాజమహేంద్రవరం డివిజన్‌ పరిధిలో 68.85 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ మిగిలిన డివిజన్‌ల కంటే పరిషత్‌ ఎన్నికలకు ఓటర్లు ఎక్కు వగా ముందుకు వచ్చారు. అమలాపురం డివిజన్‌లో 66.33 శాతం, కాకినాడ 62.99 శాతం, పెద్దాపురం 61.16 శాతం, రామచంద్రపురం 65.81 శాతం, రంపచోడవరం 53.41 శాతం, ఎటపాక 60.79 శాతం చొప్పున పోలింగ్‌ నమోదైంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 64.05 శాతం పోలింగ్‌ జరిగింది. అటు జిల్లావ్యాప్తంగా మండలాల వారీగా పరిశీలిస్తే అత్య ధికంగా మామిడికుదురు మండలంలో 75.16 శాతం పోలింగ్‌ జరిగింది. ఈ మండలంలో 52,776 మంది ఓట ర్లకు 39,667 మంది ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. అత్యల్పంగా తొండంగి మండలంలో 41.38 శాతం పోలింగ్‌ జరిగింది. ఇక్కడ 70,817 మంది ఓటర్లుండగా, కేవలం 29,302 మంది మాత్రమే ఓటు వేశారు. ఇలా యాభై శాతంలోపు పోలింగ్‌ జరిగిన మండలాలు మూడు ఉన్నాయి. అయితే దాదాపు అన్ని డివిజన్లలోను ఈసారి పోలింగ్‌ శాతం సరాసరి 60 నుంచి 64 శాతం వరకే వచ్చి ఆగిపోయింది. అయితే వరుసగా ఎన్నికల్లో ఓట్లు వేయడం, వేసవి, కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండడం, అన్నింటికిమించి జడ్పీ ఎన్నికల్లో టీడీపీ బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేయడంతో అనేకమంది ఓటింగ్‌ విషయంలో అనాసక్తి ప్రదర్శించారు. మొన్న ఫిబ్రవరి 9 నుంచి 21 వరకు నాలుగు దశల్లో జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత యాభై ఏడు రోజులకు గురువారం జడ్పీ ఎన్నికలు జరిగాయి. కానీ ఇంత తక్కు వ వ్యవధిలో ఓటర్ల మనోగతంలో వచ్చిన తేడా ఇప్పుడు పార్టీలను నివ్వెరపరుస్తోంది. అప్పటి పంచాయతీ ఎన్నిక ల్లో దాదాపు ప్రతి ఒక్కరు కదిలివచ్చారు. పోలింగ్‌ కేం ద్రాల వద్ద సాయంత్రం అయిదు తర్వాత కూడా బారులు తీరారు. కానీ పరిషత్‌ ఎన్నిక దీనికి భిన్నంగా జరిగింది. పోలింగ్‌ కేంద్రాల వద్దకు రావడానికి ఓటర్లు అనాసక్తి ప్రదర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఏకంగా 83.29 శాతం మంది ఓట్లు వేస్తే.. ఇప్పుడు జడ్పీ ఎన్నికలకు వచ్చేసరికి 14.44 శాతం ఓటింగ్‌ పడిపోయింది. కాకినాడ డివిజన్‌లో పం చాయతీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం 82.47 శాతం కాగా, ఇప్పుడు పరిషత్‌లో 62.99 శాతం నమోదైంది. అంటే 19.48 శాతం ఓటింగ్‌ జరగలేదు. అమలాపురం డివిజన్‌ లో పంచాయతీలకు 80.29 శాతం ఓటింగ్‌ జరిగితే.. పరిషత్‌ ఎన్నికలకు వచ్చేసరికి 66.33 శాతం వద్దే ఆగిపోయింది. 13.96 శాతం మంది ఓటు హక్కుకు దూరంగా ఉన్నారు. రంపచోడవరం డివిజన్‌లో అయితే అత్యధికంగా 18.41 శాతం ఓట్లు జడ్పీ ఎన్నికల్లో పడలేదు.

Updated Date - 2021-04-10T06:25:26+05:30 IST