రేపటి నుంచి ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2021-05-14T05:39:40+05:30 IST

కరోనా వైరస్‌ సంక్ర మణ గొలుసు(చైన్‌)ను తెగ్గొట్టే చర్యల్లో భాగంగా తాజాగా మరో దఫా ఆరు విడతల ఫీవర్‌ సర్వేలను చేపట్టాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

రేపటి నుంచి ఫీవర్‌ సర్వే

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 13 : కరోనా వైరస్‌ సంక్ర మణ గొలుసు(చైన్‌)ను తెగ్గొట్టే చర్యల్లో భాగంగా తాజాగా మరో దఫా ఆరు విడతల ఫీవర్‌ సర్వేలను చేపట్టాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొ విడతలో మూడు రోజులు చొప్పున ఈనెల 15 నుంచి జూన్‌ ఒకటవ తేదీ వరకు ఆరు విడతల్లో ఫీవర్‌ సర్వేలు నిర్వహించేలా మార్గదర్శకాలు విడుదల చేశారు. ఆశావర్కర్‌, గ్రామ/వార్డు సచివాలయ వలంటీర్లు తమ పరిధిలోని నివాస గృహాలకు వెళ్ళి ఫీవర్‌ సర్వే నిర్వహించాలి. జ్వరంతో ఎవరైనా వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు గమనిస్తే వెంటనే ఆ వివరాలను సచివాలయ ఎఎన్‌ఎంకు ఆశావర్కర్‌ తెలియజేస్తారు. వైరస్‌ సోకిన లక్షణాలు గల వ్యక్తికి వెంటనే చికిత్సకు సంబంధించిన కిట్లను ఏఎన్‌ఎం అందచేసి ట్రీట్‌మెంట్‌ ప్రారంభిస్తారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను స్థానిక పీహెచ్‌సీ /యూపీ హెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ నిర్వహిస్తారు. టెస్ట్‌ ఫలితాలను 24 గంటల్లోగా వెల్లడించి పాజిటివ్‌ అని నిర్ధారణ అయితే ఆ వ్యక్తిని హోం ఐసోలేషన్‌/కొవిడ్‌ కేర్‌ సెంటర్‌/ ఆసు పత్రికి రిఫర్‌ చేసే విషయంపై మెడికల్‌ ఆఫీసర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆసుపత్రి లేదా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో కరోనా బాధితుడు ఉంటే పర్యవేక్ష బాధ్యత లను మెడికల్‌ ఆఫీసర్‌, హోం ఐసోలేషన్‌లో ఉంటే ఏఎన్‌ఎం తీసుకుంటారు. కొవిడ్‌ లక్షణాలు లేని ప్రైమరీ కాంట్రాక్టులను హోం క్వారంటైన్‌లోనే ఉంచి ప్రతీరోజూ ఆశావర్కర్‌, ఎఎన్‌ఎంలు పర్యవేక్షిస్తారు. నిర్దేశిత మార్గదర్శకాలను పాటించని ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, మెడికల్‌ ఆఫీసర్లపై కఠిన చర్యలు ఉంటాయని ఉన్న తాధికారులు హెచ్చరించారు. ఈనెల 15 నుంచి 17 వరకు, 18–20 తేదీల్లోను, 21–23 తేదీలు, 24–26 తేదీలు, 27–29 తేదీలు, 30–జూన్‌ 1వ తేదీ వరకు మొత్తం ఆరు విడతల్లో ఫీవర్‌ సర్వే చేపట్టాలని ఆదేశించారు.


Updated Date - 2021-05-14T05:39:40+05:30 IST