జ్వరాల.. పంజా

ABN , First Publish Date - 2021-09-14T04:57:36+05:30 IST

వర్షాలు కురిశాయి.. పారిశుధ్యం లోపించింది... దోమల ఉధృతి పెరిగింది.. దీంతో ఇదే అదనుగా కాచుకొని కూర్చున్న సీజనల్‌ వైరస్‌లు తిరిగి విస్తృతమవుతున్నాయి.

జ్వరాల.. పంజా

జిల్లాలో పెరుగుతున్న జ్వరపీడితులు

జ్వరం, దగ్గు, జలుబుతో సతమతం

విజృంభిస్తున్న ఇన్‌ఫ్లుయోంజా వైరస్‌

దీనికి తోడుగా డెంగీ టైప్‌-2 దాడి

కరోనాకు తోడు సీజనల్‌ వ్యాధులు..

ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్న సామాన్యులు 

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు 

 

జిల్లావాసులపై సీజనల్‌ వైరస్‌లు దాడి చేస్తున్నాయి. జలుబు, ముక్కు నుంచి నీరుకారడం, దగ్గు, జ్వరం.. ఈ లక్షణాలు వేధిస్తున్నాయి. ఏ ఇంటిలో చూసినా జ్వరపీడితులు ఉన్నారు. ఏ జ్వరమో అర్ధం కాక.. ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నవారు.. కొందరైతే, భయంతో పెద్ద ఆస్పత్రులకు వెళ్లి లక్షలు చెల్లించుకుంటున్నవారు మరికొందరు.. ఇది కరోనా ఏమో అని గజగజ వణుకుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, లోపించిన పారిశుధ్యం జ్వరాలకు కారణమవుతున్నాయి. 


గుంటూరు (మెడికల్‌), సెప్టెంబరు 13: వర్షాలు కురిశాయి.. పారిశుధ్యం లోపించింది... దోమల ఉధృతి పెరిగింది.. దీంతో ఇదే అదనుగా కాచుకొని కూర్చున్న సీజనల్‌ వైరస్‌లు తిరిగి విస్తృతమవుతున్నాయి. కరోనా వైరస్‌ను మించి ఇవి తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో జిల్లావాసులపై ఇన్‌ఫ్లూయోంజా వైరస్‌లు దాడి చేస్తున్నాయి. జలుబు, ముక్కు నుంచి నీరు కారడం, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్‌ భయంతో వణికిపోతున్న జిల్లావాసులకు ఇన్‌ఫ్లూయోంజా మరింత ఆదోళనకు గురి చేస్తోంది. మరో పక్క జిల్లాలో సీజనల్‌ వ్యాధులైన డెంగ్యూ, చికెన్‌గన్యా, మలేరియా, వైరల్‌ ఫీవర్లు దాడి చేస్తున్నాయి. ఈ రోగ లక్షణాలన్నీ కొవిడ్‌-19ని పోలి ఉండటంతో ఇవి కరోనా అనే బెంగ రోగులను వేధిస్తోంది. ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా ఫలితం వస్తోంది. ఇతర వైరల్‌ మార్కర్‌ పరీక్షల్లో ఇవి డెంగ్యూ, మలేరియా, ఇన్‌ఫ్లూయోంజా, చికున్‌గన్యా వ్యాధులుగా తేలుతోంది. ఇప్పటికే జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో జ్వర పీడితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జిల్లాలో ప్రబలుతోంది ఇన్‌ఫ్లూయోంజా ఏ సబ్‌టైప్‌ వైరస్‌గా వైద్యనిపుణులు చెబుతున్నారు.  తుమ్ములు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో రోగులను ఈ వైరస్‌ వణికిస్తోంది. ఇంట్లో ఒకరికి సోకితే ఇంటిల్లిపాదీకి ఈ వైరస్‌ సులువుగా వ్యాపిస్తోంది. 


టైప్‌-2 డెంగ్యూ వైరస్‌ విజృంభణ..

డెంగ్యూ వైరస్‌ మరోసారి జిల్లాపై విరుచుకుపడుతోంది. నాలుగేళ్లకు ఒకసారి డెంగ్యూ ఫీవర్లు విజృంభించడం ఆనవాయితీ. 2017లో జిల్లావాసులను వణికించిన డెంగ్యూ మరోసారి ఈ సీజన్‌లో పంజా విసురుతోంది. ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫీల్డ్‌ సర్వేలో మన జిల్లాలో డెంగ్యూ టైప్‌-2 వైరస్‌ చెలామణిలో ఉన్నట్లు స్పష్టమైంది. ఇది ప్రమాదకరమైన వైరస్‌గా వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇది సోకిన వారు అప్రమత్తంగా ఉండాల్సిందే. వైద్యనిపుణుల పర్యవేక్షణ లేకుండా సొంత వైద్యం పొందటం ప్రమాదంగా మారతుంది. ముఖ్యంగా హెమరేజిక్‌ ఫీవర్‌, షాక్‌ సిండ్రోమ్‌ బారినపడే అవకాశం ఉంటుంది. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సైతం జిల్లాలో డెంగ్యూ జ్వరాలు అధికంగా ఉన్నట్లు అంగీకరించారు. జ్వరాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.. కాగా జిల్లాలో డెంగ్యూ కేసుల సంఖ్య 300 దాటినట్లు సమాచారం. కొంతమంది కరోనా రోగుల్లో సైతం డెంగ్యూ లక్షణాలు కనిపిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ కారణంగా రోగులు సొంత వైద్యం మానుకొని ఆసుపత్రికి వెళ్లాలని వారు సూచిస్తున్నారు. 


30 శాతం పెరిగిన మందుల విక్రయాలు..

జిల్లాలో జ్వరాల తీవ్రత పెరగడంతో బహిరంగ ఔషధ మార్కెట్‌లో ఎజిత్రోమైసిన్‌, డాక్సీస్లైకిన్‌ వంటి యాంటీ బయోటిక్‌  మందులు, యాంటీ ఎలర్జీ, దగ్గు టానిక్కులు, పారా సిటమాల్‌ వంటి జ్వరాల మందుల విక్రయాలు పెరిగాయి. కొవిడ్‌-19 కేసులు స్వల్పంగా తగ్గడంతో గతంలో జోరుగా సాగిన విటమిన్‌ ట్యాబ్లెట్లు, నొప్పుల మాత్రలు, యాంటీ వైరల్‌ మందుల విక్రయాలు తగ్గాయని వ్యాపారవర్గాలు తెలిపాయి. అయితే డెంగీలో ప్లేట్‌లెట్లు తగ్గి రక్తస్రావం అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు ఎటువంటి పెయిన్‌ కిల్లర్‌ మాత్రలు సొంతగా వాడవద్దని, జ్వరానికి మాత్రం పారా సిటమాల్‌ వాడవచ్చని వైద్యనిపుణులు సూచిస్తునానరు. 

 

ఈ దోమలతో రోగాలు

అనాఫిలిస్‌ దోమ : మంచినీటి నిల్వలలో పెరిగి మలేరియా వ్యాధిని వ్యాప్తి చేస్తుంది.

క్యూలెక్స్‌ : మురుగు నీటి నిల్వలలో పెరిగి మెదడు వాపు, బోద కాలు వ్యాధులను వ్యాప్తి చేస్తుంది.

ఏడీస్‌ : ఇంటి పరిసరాలలోని చిన్న చిన్న నీటి నిల్వలలో పెరిగి చికున్‌ గున్యా, డెంగ్యూ వ్యాధులను వ్యాప్తి చేస్తుంది.

మాన్సోనియా : మెక్కలున్న నీటి నిల్వలలో పెరిగి బోద వ్యాధిని వ్యాప్తి చేస్తుంది.

అర్మిజరిన్‌ : సెప్టిక్‌ ట్యాంక్‌లు, పారిశ్రామిక వ్యర్థాలలో పెరుగుతాయి. ఈ దోమలతో ఎలాంటి వ్యాధులు వ్యాప్తి చెందనప్పటికీ, ఇవి పీల్చే రక్తం ఎక్కువ మోతాదులో ఉండడంతో శరీరం బలహీనంగా మారుతుంది.

 

ఇలా చేయండి..

- పనికి రాని గుంతలు, లోతట్టు ప్రదేశాలు, వినియోగంలేని బావులను పూడ్చి నీరు నిల్వవుండకుండా చూడాలి.

- మురుగు నీటి కాలువలలో చెత్త, చెదారం వేయకుండా, చేరకుండా చూడాలి. మురుగు నీరు కాలువలలో సజావుగా పారేట్టు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

- కంప చెట్లు, పిచ్చి మెక్కలు, పెంటకుప్పలు, చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి.

- చెరువులు, బావులు, కాలువలు, ఇతర నీటి మడుగులలో పెరిగే గుర్రపు డెక్క, తూటు కాడలతో పాటు ఇతర మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి.

- అన్ని రకాల నీటి నిల్వలలో వారానికి ఒకసారి దోమ పిల్లల నియంత్రణ మందులు చల్లాలి.

- ఫాగింగ్‌ యంత్రంతో వారానికి ఒకమారు సాయంత్రం పొగను వదలాలి.

- దోమతెరలు, దోమలను పారదోలే పరికరాలు ఉపయోగించడం మంచిది.


మలేరియా

చలి, వణుకుతో కూడిన విపరీతమైన జ్వరం వస్తుంది. ప్రారంభంలో సరైన చికిత్స లేకపోతే ఈ వ్యాధి నెలల తరబడి బాధిస్తుంది. అనాఫిలిస్‌ దోమలతో వ్యాప్తి చెందే ఈ వ్యాధి వర్షాకాలంలో ఎక్కువగా ప్రబలుతుంది. గర్భిణులు, చిన్న పిల్లలకు ఈ వ్యాధి సోకితే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చలితో జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకొని వ్యాధిని నిర్ధారించుకోవాలి. మలేరియా రకాన్ని బట్టి పూర్తి స్థాయిలో చికిత్స పొందాలి. మందుల వాడకంలో నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 

డెంగ్యూ

అకస్మాత్తుగా ఎముకలు, కండరాలు, కీళ్ల నొప్పులతో కూడిన జ్వరం వస్తుంది. తగ్గినట్టుగా అనిపించి వారం, పది రోజులలో మళ్లీ తిరగబడుతుంది. ఏడీస్‌ దోమతో ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. కళ్ల నొప్పి, శరీరంపై చిన్నపాటి దుద్దుర్లు వస్తాయి. డెంగ్యూ, చికున్‌ గున్యా వ్యాధుల లక్షణాలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. చిన్నచిన్న కీళ్ల వద్ద నొప్పులు విపరీతంగా వస్తాయి. నెలల తరబడి ఈ నొప్పులు బాధిస్తాయి. దోమల పెరుగుదలను అరికట్టేందుకు నీటి నిల్వలను తొలగించాలి. వ్యాధి పట్ల సరైన అవగాహన పెంచుకొని తగిన చికిత్స పొందాలి.

Updated Date - 2021-09-14T04:57:36+05:30 IST