భయాందోళనలు వద్దు

ABN , First Publish Date - 2021-10-28T05:36:45+05:30 IST

కొవ్వూరు శ్రీరామ కాలనీలో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది.

భయాందోళనలు వద్దు
అనారోగ్యానికి గురైన వృద్ధురాలిని చేయి పట్టుకుని ఆసుపత్రికి తీసుకువస్తున్న మంత్రి తానేటి వనిత

మరో ఏడుగురికి జ్వరాలు

కొవ్వూరు వాసులకు మంత్రి వనిత విజ్ఞప్తి

అవి వైరల్‌ జ్వరాలే : కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

బాధితులకు భరోసా.. వైద్యుల నియామకం  కొనసాగుతున్న వైద్య పరీక్షలు

పాలు, కూరగాయల శాంపిల్స్‌ సేకరణ


కొవ్వూరు, అక్టోబరు 27 : కొవ్వూరు శ్రీరామ కాలనీలో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం 40 మందికి వైద్య పరీక్షలు చేయగా ఏడుగురికి జ్వర లక్షణాలు ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా కాలనీతోపాటు ఆసుపత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వార్డులో పారిశుధ్య పనులను పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య సేవలందించి, ప్రజలను కాపాడతామని, ఎవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని మంత్రి వనిత భరోసా కల్పించారు. ప్రతి ఇంటికి వెళ్లి బాధితు లతో మాట్లాడారు. ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా వెంటనే అధికారులకు తెలియజేస్తే వారు తక్షణం సహాయ సహకారాలందించే విధంగా చర్యలు తీసుకున్నామని భరోసా కల్పించారు. ఆమె వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి, డిప్యూటీ డీఎంహెచ్‌వో తాడి రామ గుర్రెడ్డి, వైద్యులు ఎం.ధర్మరాజు, బి.శ్రీనివాస్‌, పి.దేశాయ్‌నాద్‌వర్మ తదితరులు ఉన్నారు. 


ధైర్యం చెప్పిన కలెక్టర్‌ 


కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా శ్రీరామ కాలనీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇవన్నీ సాధారణ వైరల్‌ జ్వరాలేనని చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలోనే మెరుగైన వైద్యసేవలందించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. తాత్కాలికంగా జనరల్‌ ఫిజీషియన్‌, పిల్లల వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రతి కేసును పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఇవి డెంగ్యూ, మలేరియా కాదని, వైరల్‌ జ్వరాలేనని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలిపారు. కొవ్వూరు ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో మరోసారి ఫీవర్‌ సర్వే, రోజుకు రెండుసార్లు ప్రత్యేక శానిటేషన్‌ చేపట్టాలని ఆదేశించామన్నారు. బాధితుల రక్త నమూనాలు, ప్రతి ఇంటి నుంచి తాగునీరు, పాలు, కూరగాయలు శ్యాంపిల్స్‌, కాలనీ పక్కనున్న పంట పొలాల్లోని శాంపిల్స్‌ సేకరించి టెస్టింగ్‌ కోసం ల్యాబ్‌కు పంపిస్తున్నామన్నారు. జ్వరాలు తగ్గే వరకు వైద్యశిబిరం కొనసాగుతుందన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.రవి, డీసీహెచ్‌ఎస్‌ ఏవీఆర్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 


సూపర్‌ శానిటేషన్‌ చేయించాలి  


‘తాగునీరు కలుషితం కావడం, దోమల వల్ల వ్యాధులు విజృంభిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తక్షణం పట్టణంలో సూపర్‌ శానిటేషన్‌ చేయించాలి’ అని బుధవారం జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్‌ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్‌(చిన్ని), బొండాడ సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. గతంలో అంతుచిక్కని వ్యాధి అల్లాడిపోయిన ఏలూరు పరిస్థితే ఇక్కడ కూడా వస్తుందేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అదనపు పారిశుధ్య సిబ్బందిని తీసుకుని 23 వార్డులలో సూపర్‌ శానిటేషన్‌ చేయించాలని అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు.



Updated Date - 2021-10-28T05:36:45+05:30 IST