సంబరాల సంక్రాంతి

ABN , First Publish Date - 2022-01-15T05:27:41+05:30 IST

డీజేలు, డీటీఎస్‌ సౌండ్‌ సిస్టమ్స్‌ పెట్టుకొని.. కెవ్వుకేక.. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సరదాలు తెచ్చిందే తుమ్మెద.. అంటూ యువత జోరుగా పాటలు పడుతూ, నృత్యాలు చేస్తూ పతంగులు ఎగురవేస్తూ ఉషారుగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.

సంబరాల సంక్రాంతి
రంగులు కొనుగోలు చేస్తున్న మహిళలు

- ఊపందుకున్న పతంగుల అమ్మకాలు

- ఆసక్తి చూపుతున్న యువకులు 

- శుక్రవారం ఘనంగా బోగి పండుగలు

- పోటాపోటీగా ముగ్గుల పోటీలు

- నేడు సంక్రాంతి పండుగ


కామారెడ్డి టౌన్‌, జనవరి 14: డీజేలు, డీటీఎస్‌ సౌండ్‌ సిస్టమ్స్‌ పెట్టుకొని.. కెవ్వుకేక.. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సరదాలు తెచ్చిందే తుమ్మెద.. అంటూ యువత జోరుగా పాటలు పడుతూ, నృత్యాలు చేస్తూ పతంగులు ఎగురవేస్తూ ఉషారుగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. పండుగ వచ్చిందంటే ఇళ్ల ముందు సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, పతంగుల ఆటలు ఇవే కనిపిస్తుంటాయి. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ ఎంతో విశిష్ఠతను చాటుకుంటుంది. మొదటి రోజు భోగి పండుగను శుక్రవారం నిర్వహించారు. ఇంటి గడపపై రేగు పండ్లు, జీడి పండ్లు, పేడ, గరక పోసలు పెట్టి బోట్లతో అలంకరణ చేశారు. రెండో రోజు శనివారం సంక్రాంతి పండుగను జరుపుకోనుండగా మూడో రోజు కనుమ పండుగను నిర్వహిస్తారు. ఆడపడుచులకు బ్లౌజులు పెట్టి కట్నాలను సమర్పిస్తారు. బోగితో సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమై సంక్రాంతి కాంతులు మొదలయ్యాయి. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో చిన్నా పెద్ద తేడా లేకుండా పతంగులు కొనుగోలు చేసి ఎగుర వేస్తున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా ఇదే సందడి నెలకొంది.  మైదానాలు, రోడ్లు, భవంతులపై అంతటా పోటీపడి యువకులు  చిన్నారులు ఉత్సాహంగా పతంగులను ఎగుర వేస్తున్నారు. వివిధ రంగుల్లో, వివిధ రూపాల్లో పట్టణాల్లో పాటు పల్లెల్లో పతంగులు అమ్మడంతో అందరి మదిని దోచేస్తున్నాయి. చరిత్రక కట్టడాలు, కార్టున్లు సినీ హిరోలు, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌, ముఖ చిత్రాలతో అందమైన పతంగులు మార్కెట్‌లోకి వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన పతంగులు, మాంజాల వ్యాపారులు జోరుగా అమ్ముతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌, పాత బస్టాండ్‌, సుభాష్‌ రోడ్డు, స్టేషన్‌ రోడ్డు, సిరిసిల్లా రోడ్డు, తిలక్‌ రోడ్డు, మాయాబజార్‌ ప్రాంతాల్లో ప్రత్యేక దుకాణాలు వెలిసాయి.  ఏ దుకాణంలో చూసినా చిన్నారులు, యువకుల సందడి కనిపిస్తోంది.

పోటాపోటీగా ముగ్గుల పోటీలు 

సంక్రాంతి పండుగ అంటేనే మొదట గుర్తుకు వచ్చేది ముగ్గులు. మూడు రోజుల పాటు జరిగే పండుగ ఉత్సవాలలో ఇంటి ఆడపడుచులు వాకిళ్లను శుభ్రంగా ఊడ్చి కళ్లాపు చల్లి అందమైన ముగ్గులు వేసి రంగులు అద్దుతారు. పండుగ జరిగే మూడు రోజులతో పాటు వారం రోజులు ఇళ్ల ముందు రకరకాల రంగుల ముగ్గులు వేయడం అనవాయితీ. మహిళలు ముగ్గులు వేయడంలో ఎంతో అసక్తి చూపిస్తారు. దీనికి తోడు పట్టణంలో ఆయా సంస్థల ఆధ్వర్యంలో పోటా పోటీగా ముగ్గుల పోటీలను నిర్వహిస్తూ బహుమతులను అందజేస్తున్నారు.


కొన్ని జాగ్రత్తలతో పండుగను ఆనందంగా జరుపుకోవాలి

- ముఖ్యంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు తినుబండరాలను ఇచ్చిపుచ్చుకోవడంపై జాగ్రత్తలు వహిస్తే మంచిది.

- రోడ్లపై పతంగులు ఎగురవేయొద్దు. వాటి కోసం పరుగులు పెట్టొద్దు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. 

- ఇళ్లకు దగ్గరగా ఉండే విద్యుత్‌ తీగల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలి. 

- విద్యుత్‌ స్తంభాలు, చె ట్లకు వేళాడుతున్న పతంగులు తీయవద్దు వాటి పరిసరాలకు వెళ్లవద్దు.

- భవనాల మీద ఎగుర వేస్తున్నప్పుడు సైడ్‌వాల్‌ ఉందో లేదో చూసుకోవాలి. సైడ్‌వాల్‌ లేని ఇళ్లపై నుంచి ఎగురవేయొద్దు.

- ఎక్కువ గా మైదాన ప్రాంతాల్లోనే పతంగులను ఎగురవేయాలి. 

Updated Date - 2022-01-15T05:27:41+05:30 IST