కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్లు.. పొంచి ఉన్న ప్రమాదాలు

ABN , First Publish Date - 2022-06-12T07:08:19+05:30 IST

కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్లు.. పొంచి ఉన్న ప్రమాదాలు

కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్లు.. పొంచి ఉన్న ప్రమాదాలు
పోచారంలో ఫెన్సింగ్‌లేని ట్రాన్స్‌ఫార్మర్లు

  • పల్లె ప్రగతిలోనైనా మరమ్మతులు జరిగేనా?
  • భయంతో కాలం వెళ్లదీస్తున్న ప్రజలు

ఇబ్రహీంపట్నం రూరల్‌, జూన్‌ 11: ప్రమాదం జరిగే వరకు విద్యుత్‌ అధికారులు స్పందించేలా లేరు. చాలా గ్రామాల్లో కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్లతో ప్రజలు భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. మండలంలోని ఉప్పరిగూడ, ఎలిమినేడు, చెర్లపటేల్‌గూడ, పోచారం గ్రామాల్లో కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. మరికొన్ని ఇళ్ల మధ్యలో తక్కువ ఎత్తులో, సరిగా గద్దెలు సైతం లేక ఓపెన్‌ వైరింగ్‌ సిస్టం సరిగా లేక గ్రామస్తులకు షాకిచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల పశువులు, వీధి కుక్కలు కరెంట్‌ షాక్‌తో మృతిచెందాకి కూడా. పిల్లలకు అందే ఎత్తులో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుతో ప్రమాదకరంగా పరిణమించింది. ట్రాన్స్‌పార్మర్లకు తగిన ఫెన్సింగ్‌ వేయడంతో పాటు వాటి ఫ్యూజ్‌ బాక్సులను ఎత్తులో పెట్టాలని, గద్దెల ఎత్తు పెంచాలని, ఎర్తింగ్‌ రాకుండా చూడాలని ప్రజలు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడంలేదు. ప్రజాప్రతినిధులు, ట్రాన్స్‌కో అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్లకు కంచెలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


  • ఐదో విడత పల్లె ప్రగతిలో మోక్షం కలిగేనా

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతిలోనైనా ఈ సమస్యను తీర్చుతారా? అని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. నిజానికి ప్రతీ వానకాలం ప్రారంభంలో విద్యుత్‌ శాఖ ‘ప్రీ మాన్సూన్‌’ పేరుతో లైనింగ్‌ సమస్యలు, స్తంభాలు పాతడం, లూజుగా ఉన్న వైర్లను టైట్‌ చేయడం, ఫెన్సింగ్‌ లేని ట్రాన్స్‌ఫార్మర్లకు దానిని ఏర్పాటు వంటివి చేయాలి. కానీ అధికారులు కేవలం వైర్ల కింద ఉన్న చెట్ల కొమ్మలు నకివేయడంతోనే సరిపెడుతున్నారు. ప్రధాన సమస్యలను పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో అయినా విద్యుత్‌ సమ్యలు తీర్చాలని ప్రజలంటున్నారు.


  • ప్రమాదకరంగా ఉన్నా పట్టించుకునేవారు లేరు : పి.జంగయ్య, పోచారం

గ్రామంలో రోడ్డు పక్కనే ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. దానికి ఫెన్సింగ్‌ లేదు. ఫ్యూజ్‌ వైర్లన్నీ కిందికే ఉన్నాయి. రోడ్డు మీద వెళ్లే వాహనదారులు ఈ ట్రాన్స్‌ఫార్మర్‌తో ప్రమాదం పొంచి ఉంది. చుట్టూ తీగజాతి మొక్కలు పెరిగి ట్రాన్స్‌ఫార్మర్‌కు అల్లుకున్నాయి. వర్షం పడితే రెండు మూడు గజాల దూరం వరకు ఎలక్ర్టిక్‌ షాక్‌ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఇళ్ల మధ్య ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను దూరంగా తరలించాలి. 


  • వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తా : శ్రీనివా్‌సరావు, ట్రాన్స్‌కో ఏఈ, ఇబ్రహీంపట్నం

పోచారంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రమాదకరంగా ఉందని గ్రామస్తులు మాకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల్లో ఆ సమస్యను పరిష్కరిస్తాం. గద్దె ఎత్తు పెంచడంతో పాటు వైర్లు పైకి పడతాం. ఇంకా ఏయే గ్రామాల్లో ఇలాంటి సమస్యలున్నా మాకు తెలియజేయాలి. వర్షాలు పడకముందే ఇలాంటి విద్యుత్‌ మరమ్మతులన్నీ పూర్తిచేస్తాం.

Updated Date - 2022-06-12T07:08:19+05:30 IST