Advertisement
Advertisement
Abn logo
Advertisement

9 నెలలుగా ఆచూకీ లేని మహిళా కానిస్టేబుల్... అలా కనిపించేసరికి అంతా షాక్!

లక్నో: సుమారు తొమ్మిది నెలలుగా కనిపించని ఛత్తీస్‌గఢ్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ అంజనా సహిస్... యూపీలోని బృందావన్‌లో పూలు విక్రయిస్తూ కనిపించారు. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులతో పాటు, పోలీసు అధికారులు, ఆమెతో పాటు పనిచేసిన సిబ్బంది షాకయ్యారు. 

ఛత్తీస్‌గడ్ పోలీస్ టీమ్ ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు రాగా, ఆమె వారితో వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో రాయ్‌పూర్ పోలీసులు నిరాశగా వెనుదిరగాల్సివచ్చింది. వివరాల్లోకి వెళితే రాయపూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న అంజనా సహిస్‌ను పోలీసు కేంద్ర కార్యాలయంలోని సీఈఓ విభాగానికి పంపించారు. ఇది జరిగిన ఒకరోజు తరువాత ఆమె అదృశ్యమయ్యారు. పోలీసులు, కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఆమె జాడ తెలియలేదు. దీంతో ఆమె కుమార్తె తన తల్లి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అంజనా సహిస్ తన ఫోను స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో, పోలీసులు కూడా ఆమె ఆచూకీ తెలుసుకోలేకపోయారు. అయితే ఆమె తన ఏటీఎం  కార్డును వినియోగించిన లొకేషన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె యూపీలోని బృందావన్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ ఆమె కృష్ణమందిరం బయట పూలు విక్రయిస్తూ వారికి కనిపించింది. ఆ స్థితిలో ఆమెను చూసిన పోలీసు సిబ్బంది షాక్ తిన్నారు. తరువాత ఆమెను తమతో పాటు రావాలని కోరారు. ఇందుకు ఆమె నిరాకరించారు. అలాగే తాను తన ఇంటికి కూడా వెళ్లేదిలేదని తెగేసి చెప్పారు. తనకు ఇకపై ఎవరితోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆమెను పోలీసు ఉన్నతాధికారులు వేధింపులుకు గురిచేసి ఉంటారని, అందుకే ఆమె ఇటువంటి నిర్ణయం తీసుకుందని ఆమెతో పాటు పనిచేస్తున్న సిబ్బంది భావిస్తున్నారు. ఇదేవిధంగా ఆమెకు ఇంటిలో కూడా ఏవో సమస్యలు ఉండి ఉంటాయని అనుకుంటున్నారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement