వెంటాడిన అకాల వర్షం దెబ్బ

ABN , First Publish Date - 2021-04-17T05:16:55+05:30 IST

పశ్చిమ ప్రాంతంలో బుధ, గురువారాల్లో ఈదురుగాలులతో అకాల వర్షం సృష్టించిన బీభత్సం తాలూకు దెబ్బ వెంటాడింది. అనేక గ్రామాల పరిధిలో విద్యుత్‌ స్తంభాలు విరిగి తీగలు తెగి పొలాల్లో పడ్డాయి. అయితే తీగలకు కరెంటు సరఫరా అవుతూనే ఉంది. శుక్రవారం రెండు మండలాల్లో పొలాలకు వెళ్లిన గొర్రెలతోపాటు పశువు కరెంటు షాకుతో మృతి చెందాయి.

వెంటాడిన అకాల వర్షం దెబ్బ
ఈదురుగాలులకు తెగిన విద్యుత్‌ తీగలు తగిలి మృతి చెందిన పాడి గేదె

నిన్నమొన్న ఈదురుగాలులతో కూడిన వర్షానికి 

కూలిన విద్యుత్‌ స్తంభాలు

వేర్వేరు చోట్ల కరెంటు తీగలు తగిలి                           

జీవాలు, గేదె, దూడ మృత్యువాత

మనుషులకు తగిలితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్న ప్రజలు


పశ్చిమ ప్రాంతంలో బుధ, గురువారాల్లో ఈదురుగాలులతో అకాల వర్షం సృష్టించిన బీభత్సం తాలూకు దెబ్బ వెంటాడింది. అనేక గ్రామాల పరిధిలో విద్యుత్‌ స్తంభాలు విరిగి తీగలు తెగి పొలాల్లో పడ్డాయి. అయితే తీగలకు కరెంటు సరఫరా అవుతూనే ఉంది. శుక్రవారం రెండు మండలాల్లో పొలాలకు వెళ్లిన గొర్రెలతోపాటు పశువు కరెంటు షాకుతో మృతి చెందాయి. అదే మనుషులకు తగిలితే నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారు. 


రాచర్ల, ఏప్రిల్‌ 16 : మండలంలోని రాచర్ల గ్రామంలో శుక్రవారం ఉదయం విద్యుత్‌ షాక్‌తో మూడు గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన వేల్పుల ఈశ్వరయ్య గొర్రెలను తీసుకుని శుక్రవారం ఉదయం పొలాల్లోకి వెళ్లారు. ఇటీవల కురిసిన ఈదురు గాలులకు పొలంలో విద్యుత్‌ తీగలు తెగిపడడంతో మూడు గొర్రెలకు విద్యుత్‌ సరఫరా అయ్యి అక్కడికక్కడే మృతిచెందాయి. రూ. 35వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.

చిన్నగుడిపాడులో..

పెద్దదోర్నాల : విద్యుదాఘాతంతో శుక్రవారం మండలంలోని చిన్నగుడిపాడు గ్రామంలో వల్లపునేని పాపులమ్మకు చెందిన పాడిగేదె, దూడ చనిపోయాయి. బాధితురాలి కథనం ప్రకారం.. మేతకు పొలాల్లోకి గేదె, దూడ వెళ్లాయి. గురువారం కురిసిన గాలి వానకు మోటార్లకు ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగ తెగిపడింది. ఆ తీగను తాకి షాకుకు గురై గేదె, దూడ సంఘటనా స్థలంలోనేమృతి చెందాయి. పాడిగేదె రూ.70 వేలు విలువ చేస్తుందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు.

Updated Date - 2021-04-17T05:16:55+05:30 IST