నాకొద్దు.. నా భార్యకు కూడా వ్యాక్సిన్ వేయొద్దు.. ఆధార్ కార్డుతో సహా చెట్టెక్కిన భర్త!
ABN , First Publish Date - 2021-06-26T20:33:04+05:30 IST
వ్యాక్సిన్ వద్దు బాబోయ్ అంటూ ఆధార్ కార్డు పట్టుకుని చెట్టెక్కేశాడు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి.
`నాకు, నా భార్యకు వ్యాక్సిన్ వద్దు బాబోయ్` అంటూ ఆధార్ కార్డు పట్టుకుని చెట్టెక్కేశాడు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి. టీకా వేయించుకోవడానికి భయపడడమే దానికి కారణం. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో పతంకాలన్ గ్రామంలో తాజాగా కోవిడ్ టీకా శిబిరం నిర్వహించారు. అందరూ శిబిరానికి రావాలని కోరారు. అదే గ్రామానికి చెందిన కన్వర్‌లాల్ కూడా టీకా కేంద్రానికి వచ్చాడు. కానీ, అక్కడ వ్యాక్సిన్ వేయడం చూసి భయపడి పోయాడు.
వ్యాక్సిన్ నుంచి తప్పించుకునేందుకు చెట్టెక్కి కూర్చున్నాడు. ఆయన భార్య మాత్రం టీకా తీసుకోవడానికి అంగీకరించింది. అయితే అతడు ఆమె ఆధార్ కార్డు కూడా తనతో పాటు చెట్టు పైకి తీసుకెళ్లాడు. దీంతో ఆమె కూడా కరోనా టీకా వేయించుకోలేకపోయింది. ఈ విషయం తెలిసి ఖుజ్నర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజీవ్.. కన్వర్‌లాల్‌తో మాట్లాడారు. దీంతో కన్వర్‌లాల్‌కు టీకా అంటే భయం తగ్గింది. మరోసారి గ్రామంలో శిబిరం జరిగినప్పుడు టీకా తీసుకుంటామని చెప్పాడు.