రైతుల్లో గుబులు

ABN , First Publish Date - 2022-05-16T05:25:55+05:30 IST

మబ్బులు కమ్ముకుని, ఉరుములు, మెరుపులతో విరుచుకుపడుతున్న మొగులను చూస్తే అన్నదాతల్లో గుబులు పుడుతున్నది. గడిచిన వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నది.

రైతుల్లో గుబులు

కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం కుప్పలు

నిత్యం వణుకుపుట్టిస్తున్న వర్షం

ఇప్పటికే పలుచోట్ల తడిసిన ధాన్యం

కొనుగోళ్లలో జాప్యం.. చెల్లింపులు ఆలస్యం

ప్రణాళిక లేకుంటే మరిన్ని సవాళ్లు


ఆంరఽధజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 15: మబ్బులు కమ్ముకుని, ఉరుములు, మెరుపులతో విరుచుకుపడుతున్న మొగులను చూస్తే అన్నదాతల్లో గుబులు పుడుతున్నది. గడిచిన వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నది. రాత్రయ్యిందంటేనే వర్ష సూచనతో దిగులు  చెందుతున్నారు. ఇప్పటికే పలుమార్లు కురిసిన వానలకు నష్టపోయారు. వర్షాకాలం కూడా సమీపించడం..  ధాన్యం కుప్పలన్నీ కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉండడంతో అకాల వర్షాలపై ఆందోళన తప్పడం లేదు. 

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 2.62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు 6లక్షల టన్నుల పైచిలుకు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ధాన్యం కొనుగోలు చేయడానికి వ్యవసాయ మార్కెట్లు, పీఏసీఎస్‌, ఐకేపీల పరిధిలో 412 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 


నెమ్మదిగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్లు 

6 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా ఇప్పటి వరకు 50వేల టన్నులకు మించి ధాన్యం కొనుగోలు చేయకపోవడం గమనార్హం. దాదాపు 50 శాతం ధాన్యం కేంద్రాలకు వచ్చి చేరింది. కానీ రకరకాల సమస్యలు, అనేక కారణాలతో కొనుగోళ్లు జాప్యం చేస్తున్నారు. ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు, గోనె సంచుల సమస్యతోపాటు మిల్లుల్లో అన్‌లోడింగ్‌ ఇబ్బందులను తెరమీదకు తెస్తున్నారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావు స్వయంగా కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి అధికారులకు పలు సూచనలు చేశారు. కానీ పరిస్థితిలో అంతంతమాత్రంగానే మార్పు కనిపిస్తున్నది. కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు కూడా ఆలస్యంగా జమ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 


తడిసిముద్దవుతున్న ధాన్యం

ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు అకాల వర్షాల బెడద పట్టుకున్నది. ఇప్పటికే మూడు దఫాలుగా వర్షం ముంచెత్తింది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యానికే ఈ ప్రమాదం పొంచి ఉంది. శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి సిద్దిపేట, దుబ్బాక, తొగుట ప్రాంతాల్లో ధాన్యం నీళ్లపాలైంది. వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆదివారం కూడా వాతావరణం చల్లబడింది. వర్షాల సీజన్‌ మొదలు కావడంతో ఏ క్షణాన వానలు కురుస్తాయోననే భయం పట్టుకుంది. ఇప్పటికి కేవలం 50 టన్నులు మాత్రమే కొనుగోలు చేయగా.. మిగతా 5.50లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలంటే సవాళ్లతో కూడుకున్న విషయమే. ఇందుకు పక్కా ప్రణాళిక ఉంటేనే సాధ్యమవుతుందే తప్ప ఇలాగే నిర్లక్ష్యం చేస్తే వేలాది టన్నుల ధాన్యం వర్షానికి నీళ్లపాలు కావడం నిస్సందేహమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


ధాన్యం కొట్టుకుపోయింది

నేను కష్టపడి పండించిన ధాన్యాన్ని తొగుట మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చిన. టైముకు కొనుగోలు చేయలేదు. అకాల వర్షం రావడంతో రెండు ట్రాక్టర్ల ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. ఇప్పుడు మాకు దిక్కెవరు. వాళ్ల తప్పిదం వల్లనే అన్యాయం జరిగింది. మాకు నష్టపరిహారం చెల్లించాలి. 

- పయ్యావుల రమేశ్‌, రైతు, తొగుట


కేంద్రంలో పరదాల సమస్య

కల్లం వద్దనే వడ్లు ఎండబోసి కేంద్రానికి తెచ్చిన. తాలు లేకుండా వడ్లు పట్టిన. తొందరగా కాంటా పెట్టాలని కోరుతున్నా. వర్షమొస్తే వడ్లపై కప్పేందుకు సరిగ్గా పరదాలు కూడా లేకుండా ఉన్నాయి. వడ్లు తడిస్తే చానా ఇబ్బంది అవుతుంది. మా కష్టమంతా నీళ్లపాలవుతుంది. 

- చంద్రశేఖర్‌, రైతు, మద్దూరు 


20 రోజులైనా కొంటలేరు 

ధాన్యం కొంటుండ్రంటే చేర్యాల మార్కెట్‌కు 20రోజులకింద వడ్లు తీసుకువచ్చిన.. ఎండలు మస్తు గొడుతుండటంతో మంచిగనే ఆరి నయ్‌.. కొనుమని ఎన్నిసార్లు పోయి అడిగినా తూర్పార పట్టుముని చెప్తుండ్రు.. కానీ ఇక్కడ ప్లాడీ క్లీనర్లు సరిగా లేవు. కరెంటు కూడా సక్కగ ఉండకపోవడంతో ఇబ్బందులుపడుతున్నాం. వర్షం  వస్తుందని గుబులుంది.

- మల్లేశం, రైతు, ముస్త్యాల


నీళ్లపాలు కాకుండా చూడండి

నాకున్న మూడు ఎకరాల పొలంలో వరి సాగు చేసి వారం కిందట వడ్లను ఐకేపీ కేంద్రానికి తెచ్చాను. అనేక కారణాలు చెప్పి కొనుగోలు ఆలస్యం చేశారు. అకాల వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన ధాన్యం నీళ్లపాలు కాకుండా చూడండి. త్వరగా కొనుగోలు చేయండి. వర్షం వచ్చిందంటే చానా ఇబ్బంది పడతాం. 

- కోహెడ సంతో్‌షరెడ్డి, రైతు, ఇర్కోడు


ఇంకెన్ని రోజులుండాలే

కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి ఇరవై రోజులైతాంది. ఓ దిక్కు మొగులు పెట్టి వర్షాలు పడి ధాన్యం తడుస్తుందని రైతులమంతా ఆగమైతున్నం. చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి. పండించిన పంటంతా తడిసిపోయేలా ఉంది. తొందరగా కొనుగోలు చేయాలని వేడుకుంటున్నా. 

- చొప్పరి కనకయ్య, రైతు, గోపులాపూర్‌


వడ్ల కాడనే పడిగాపులు

15 రోజుల కిందట వడ్లు కేంద్రానికి తెచ్చిన . మొదట్ల మ్యాచర్‌ రాలేదన్నరు. ఇప్పడు మ్యాచర్‌ వచ్చి నాలుగు దినాలైంది. అయినా సీరియల్‌ లెక్కన కొంటమంటున్నరు. దినామ్‌ మొగులు అవ్వడంతో వడ్లు నానుతయని దిగులు పట్టుకుంది. నా భార్య, నేను ఇక్కనే పడిగాపులు పడుతున్నాం. 

- కనకయ్య, రైతు, పెద్దకోడూరు

Updated Date - 2022-05-16T05:25:55+05:30 IST