Abn logo
Jun 23 2021 @ 00:16AM

భయమూ ధైర్యమూ

విపత్తుకు, భయానికి దగ్గరి సంబంధం ఉంటుంది. విపత్తు వస్తుందేమోనని ముందే భయపడడం వేరు. విపత్తు వర్తమానంలోకి వచ్చినప్పుడు, దాన్ని అనుభవిస్తున్నప్పుడు కలిగే భయం ప్రాణాంతకంగా ఉంటుంది. పాముకాటు చిన్న ఉదాహరణ కావచ్చును కానీ, ఆపదకూ భయానికీ ఉండే సంబంధాన్ని సరిగ్గా చెబుతుంది. విషసర్పం కాకపోయినా, పాము కరిచినందున కలిగే భయం ప్రాణం తీస్తుందని, దేశంలో పాముకాటు మరణాలు అనేకం ఇట్లానే జరుగుతాయని చెబుతారు. కానీ, ముప్పు కలిగించే పరిస్థితి వచ్చినప్పుడు మనుషులు భయపడకుండా ఎట్లా ఉండగలరు? భయపడుతూనే ప్రాణరక్షణ కోసం ప్రయత్నించవలసి రావడంలోనే పెద్ద కష్టం ఉంటుంది. కళ్లెదుట మృత్యువు తాండవిస్తున్నా, నిబ్బరంగా ఉండగలగడం గొప్ప విషయమే. అటువంటివారినే మనం వీరులనీ శూరులనీ అంటాము. వాళ్లు తమతో పాటు పదిమందిని రక్షించగలుగుతారు. సామాన్యులు కూడా మృత్యువుకు తమను తాము అప్పగించుకుని ఊరుకోరు. నిబ్బరమో ధైర్యమో తగినంత లేకపోయినా ప్రాణాలు అరచేత పట్టుకుని బలహీనంగా ఎదిరించడం ప్రాణులన్నీ చేస్తాయి. 


భయమూ ధైర్యమూ కూడా కేవలం వ్యక్తిగత స్వభావాలు కావు. ఎవరో సాహసశూరుడు పరిస్థితిని విజయవంతంగా  ఎదుర్కొంటూ ఉంటే తక్కినవారికి ఆశ కలుగుతుంది. పాలకుడో అధికారో మేమున్నాము భయం వద్దని చెబితే ధైర్యంగా ఉంటుంది. అండా దండా ఉంటే, రక్షకులు నమ్మకంగా కనిపిస్తే, ఎవరు ఎంతగా దడిపించినా దడుచుకోరు. మీడియానో, రాజకీయ నాయకులో భయపెడుతున్నారని రాజకీయనాయకులు వాపోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. ధైర్యం ఇవ్వవలసింది తాము కదా, అది లోపించడం వల్లనే కదా, ఈ భయోత్పాతం!


పిల్లలకైతే కష్టం తీవ్రత తెలియవద్దని, పసిమనసుల మీద భయం ముద్ర దారుణంగా ఉంటుందని పెద్దలు మభ్యపెడుతుంటారు. బహుశా అది అవసరం. పాలకులు తాము ప్రజలను ఎంత కన్నబిడ్డలుగా చూస్తున్నామని అనుకున్నప్పటికీ, ప్రజలను మభ్యపెట్టడం మంచిది కాదు. ప్రమాదం అనే బూచిని తరిమేశాను, ఇక నిద్రపొమ్మని ప్రజలను జోకొట్టడం కుదరదు. ఎందుకంటే, వారు మభ్యపడితే, ప్రమాదాలన్నీ హుష్ కాకీ అయ్యాయని అనుకుంటే జాగ్రత్తలన్నీ బలాదూర్ చేస్తారు. మరొకసారి ముంచుకువచ్చే ముప్పు ముందు నిస్సహాయంగా నిలబడతారు. కాబట్టి ప్రజలకు వాస్తవ పరిస్థితి గురించిన అవగాహనా అవసరం, ముందు ముందు ఆపద వస్తే ధైర్యంగా ఎదుర్కొనగలిగే నిబ్బరమూ అవసరమే. ధైర్యం చెప్పడం అంటే, ప్రమాదాన్ని ఉత్తుత్తి ప్రమాదంగా వ్యాఖ్యానించడం కాదు. 


కొవిడ్ కాలంలో సమాచార సాధనాలు తమంతట తాము ఏదో సంచలనం సృష్టించి భయపెట్టడం లేదు. వైద్య ఆరోగ్య రంగ సంస్థలు, నిపుణులు, అనేక అధ్యయనాలు చెబుతున్న మాటలనే పాఠకులకు, శ్రోతలకు అందిస్తున్నాయి. వ్యాధి వ్యాప్తి, టీకాకరణ ఒకేసారి జరుగుతున్న సన్నివేశం బహుశా ఇదే మొదటిసారి. ఈ మహమ్మారిని అర్థం చేసుకుని వేగంగా అరికట్టడం కోసం వైరస్ గమనాన్ని వెంటవెంటనే అధ్యయనం చేయవలసి రావడమూ ఇదే మొదటిసారి. ఉత్పరివర్తనాలో, వైరస్ విరూపాలో, వ్యాధితో పాటే పెరుగుతాయి. వాటి శక్తి మునుపటి రూపాల కంటె అధికంగా ఉండవచ్చు. అందువల్ల, శాస్త్రజ్ఞులు హెచ్చరించవలసి వస్తుంది. వైరస్ సోకినవారి లెక్కలను, మరణించిన వారి లెక్కలను ప్రభుత్వాలు మాయచేసినట్టుగా శాస్త్రజ్ఞులు, ప్రజారోగ్య నిపుణులు చేయరు. ప్రమాదావకాశాలున్నాయని వారికి ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ లేశమాత్రం ఆస్కారమున్నట్టు తోచినా వారు హెచ్చరికలు చేస్తారు. అటువంటి హెచ్చరికల కారణంగా ప్రజలలో సహజంగానే ఆందోళన కలుగుతుంది. ఆ ఆందోళనను ఉపశమింపజేసి, తామున్నా మన్న భరోసాను ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానిది. 


పాలకులకు ప్రజలలో బలం ఉండవచ్చును కానీ, అది వారిని సర్వజ్ఞులను చేయదు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఒక ఉపద్రవాన్ని తేలిక చేసి మాట్లాడడం బాధ్యత కలిగిన నాయకులు చేయవలసిన పని కాదు. ఉద్రిక్త, భయోత్పాత వాతావరణాన్ని తేలికపరచడం వేరు, వాస్తవ ప్రమాదాన్ని తేలిక చేయడం వేరు. మునుపు వచ్చిన రెండు విడతల కొవిడ్‌ను అయినా, రేపు వస్తుందని హెచ్చరికలు వింటున్న మూడో విడత కానీ, తేలికగా తీసిపారేయవలసిన ప్రమాదాలు కావు, లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న మృత్యు ప్రభంజనాలు. నాయకులు, వారి ఆధ్వర్యంలో విపత్తును ఎంత వాస్తవికంగా పరిగణిస్తున్నారన్నది వారి చర్యల ద్వారా, మాటల ద్వారా వ్యక్తం అవుతుంది. ప్రస్తుత వ్యాప్తి తగ్గుముఖంలో ఉండవచ్చు, కానీ, రేపటి గురించి ఆందోళన ఆవరించినప్పుడు ఒక్కసారిగా అన్ని తాళాలూ తెరిచి, పగ్గాలు వదిలేస్తే, అది ఏ వైఖరిని సూచిస్తుంది? ఇక సడలిస్తారు అనుకున్నపుడు ప్రభుత్వాలు కొనసాగించిన సందర్భాలున్నాయి కానీ, సమాజం మరికొంతకాలం ఏదో రకమైన నియంత్రణ కొనసాగుతుందని అనుకుంటున్నప్పుడు అందుకు విరుద్ధంగా జరిగితే, అది విశ్వాసాన్ని ధైర్యాన్ని ఇస్తుందా? మాజీ ఆరోగ్యమంత్రులూ, ఆరోగ్యబాధ్యతలు నిర్వహిస్తున్న మహామంత్రులూ తామే జనసమ్మర్దాలను ప్రోత్సహించడం బాధ్యత అవుతుందా? 


జీవనక్రియలు స్తంభించిపోవడం ఎవరికీ బాగుండదు. ముఖ్యంగా, కష్టజీవులకు, మందభాగ్యులకు అది మరింత క్లేశాన్ని కలిగిస్తుంది. భయాన్నీ ధైర్యాన్నీ నిర్వహించవలసినది ఏలికలూ ప్రభుత్వాలే. అట్లాగే, సందడికి కళ్లెం వేస్తూనే అభాగ్యులకు అండగా నిలబడడం చేయవలసిందీ వాళ్లే. కత్తిమీద సామే, అయినా ఇందుకు కాకపోతే, వాళ్లెందుకు మరి?