ఎఫ్‌డీ డబ్బూ మాయం

ABN , First Publish Date - 2021-04-11T06:48:05+05:30 IST

మన బ్యాంకు ఖాతా వివరాలే కాదు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వివరాలు కూడా సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతున్నాయి.

ఎఫ్‌డీ డబ్బూ మాయం

సైబర్‌నేరగాళ్ల సరికొత్త స్ర్టాటజీ..

మొబైల్‌ బ్యాంకింగ్‌ సేఫ్‌ కాదంటున్న పోలీసులు

మన బ్యాంకు ఖాతా వివరాలే కాదు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వివరాలు కూడా సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతున్నాయి. అదెలా జరుగుతుందో పోలీసులకూ అంతు చిక్కడం లేదు. అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం ఎఫ్‌డీ డబ్బులు కూడా మాయం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 

హిమాయత్‌నగర్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): సేవింగ్‌ ఖాతాలనే ఇన్నాళ్లూ టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కూడా దృష్టి పెట్టినట్లు ఇటీవల హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌కు వచ్చిన ఫిర్యాదులను బట్టి స్పష్టమవుతోంది. తమ పిక్స్‌డ్‌ సొమ్ము గల్లంతైందని నగరానికి చెందిన పలువురు ఫిర్యాదులు చేసినట్లు సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం.ప్రసాద్‌ తెలిపారు. అదెలా సాధ్యమనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 


మోసాలు చేసే వైనం..

బ్యాంకులలో దీర్ఘకాలం నగదు దాచుకోవాలనుకునే వారు కొంత కాల పరిమితితో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తుంటారు. అలాంటి ఎఫ్‌డీల వివరాల డేటాను (ఎఫ్‌డీలు చేసిన కష్టమర్ల వివరాలు) సేకరిస్తున్న సైబర్‌ నేరగాళ్లు సదరు ఖాతాదారుల రిజిస్టర్‌ ఫోన్‌ నెంబర్‌ను స్పూఫ్‌ చేసి, ఆ నెంబర్‌ ద్వారా బ్యాంకుకు ఫోన్‌ చేసి ఎఫ్‌డీలను క్యాన్సిల్‌ చేయిస్తున్నారు. ఆ డబ్బును ఖాతాదారుడి ఖాతాకు జమ చేయిస్తున్నారు. ఇదంతా సదరు ఖాతాదారుడికి తెలియకుండానే జరిగిపోతుంది. ఆ డబ్బులు ఖాతాలోకి జమ చేయించిన వెంటనే ఖాతాదారుడిని ట్రాప్‌ చేస్తున్నారు. బ్యాంకు అధికారి మాదిరిగా ఖాతాదారుడికి కాల్‌ చేసి ఓటీపీ వివరాలు సేకరించి ఖాతాలో ఉన్న డబ్బులే కాకుండా, ఎఫ్‌డీ ద్వారా ఖాతాలోకి జమ అయిన డబ్బులను కూడా దోచేస్తున్నారు. సైబర్‌క్రైమ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ బాధితుడు మాట్లాడుతూ ‘ఎఫ్‌డీ క్యాన్సిల్‌ అయి ఆ డబ్బులు ఖాతాలో పడ్డ విషయం నాకు తెలియదు. బ్యాంకుకు వెళ్లి అడిగితే మీ రిజిస్టర్‌ ఫోన్‌ నెంబర్‌ నుంచి కాల్‌ వచ్చిందని, నెంబర్‌ నిర్ధారించుకున్న తర్వాతనే రిక్వెస్ట్‌ ప్రకారం ఎఫ్‌డీని క్యాన్సిల్‌ చేసి డబ్బును సేవింగ్‌ ఖాతాలోకి జమ చేశామని చెబుతున్నారు. ఇదంతా ఎలా జరిగిందో తెలియడం లేదు’ అని పోలీసుల ముందు వాపోయాడు. 


అదే కారణమా

సాధారణంగా సేవింగ్‌ ఖాతాలో డబ్బులు ఉంటే వాటిని ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా మార్చుకునే అవకాశముంది. అలాగే ఎఫ్‌డీని క్యాన్సిల్‌ చేసి ఆ మొత్తాన్ని ఖాతాలోకి జమ చేసుకోవచ్చు కూడా. వీటికి ఎలాంటి వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌(ఓటీపీ) అవసరం లేదు. దీన్నే సైబర్‌ నేరగాళ్లు అనుకూలంగా మార్చుకుంటున్నారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఫోన్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా ఎఫ్‌డీ చేయడం, క్యాన్సిల్‌ చేయడం వంటి సౌకర్యాలను బ్యాంకులు కల్పించడంతో కస్టమర్‌ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను స్పూఫ్‌ చేస్తున్న నేరగాళ్లు నేరుగా బ్యాంకుకు ఫోన్‌ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి 


బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్న వాళ్లు ఫోన్‌ బ్యాంకింగ్‌ను వాడకపోవడమే మంచిది. ఫోన్‌ బ్యాంకింగ్‌ లేకుంటే సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ నెంబర్‌ను స్పూఫ్‌ చేసినా ఎఫ్‌డీని క్యాన్సిల్‌ చేయలేరు. ఓటీపీ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ పంచుకోవద్దు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఎఫ్‌డీలు చేసిన కస్టమర్ల వివరాలు కూడా సైబర్‌నేరగాళ్లకు ఎలా చేరుతున్నాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నాం. మనకు తెలియకుండా సిమ్‌ కార్డు బ్లాక్‌ అయితే వెంటనే ఆ నెట్‌వర్క్‌ సంస్థ కార్యాలయానికి వెళ్లి వేరే సిమ్‌ తీసుకోవాలి. అలాగే, ఇతరులెవరైనా  తెలియకుండా తన పేరుపై సిమ్‌కార్డు తీసుకున్నారా అనే విషయం ఆరా తీయాలి. అప్రమత్తత తప్ప వేరే  ఈ సమస్యకు పరిష్కారం  లేదు.

- సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌

Updated Date - 2021-04-11T06:48:05+05:30 IST