`నాన్నా.. నేను నీ కూతురిని.. నన్ను క్షమించి వదిలెయ్.. నా మీద దయ చూపించు.. నన్ను ఇలా కొట్టి చంపొద్దు.. చాలా నొప్పిగా ఉంది.. విషం ఇచ్చి చంపెయ్`.. తనను చంపడానికి ప్రయత్నిస్తున్న తండ్రికి కూతురు చేసిన విన్నపం ఇది. అయినా ఆ కసాయి తండ్రి మనసు కరగలేదు. కన్న కూతురిని దారుణంగా చంపేసి ఊరి చివరన ఉన్న చెరువులో పడేశాడు. తర్వాతి రోజు ఏమీ తెలియనట్టు కూతురి కోసం వెతికాడు. అయితే తండ్రి తనను హింసిస్తున్నప్పుడు రికార్డు చేసిన ఆడియోను బాధితురాలు తన అక్కకు పంపించింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.
బీహార్‌లోని దర్బంగాకు చెందిన అఫ్రీన్ అనే 20 ఏళ్ల యువతి ఇటీవల ఉన్నట్టుండి అదృశ్యమైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాతి రోజు ఆమె మృతదేహం ఊరి చివర దొరికింది. ప్రమాదవశాత్తూ అఫ్రీన్ చెరువులో మునిగి చనిపోయిందనుకున్నారు. అయితే చనిపోయే ముందు ఆమె తన అక్కకు పంపిన ఆరు నిమిషాల ఆడియోతో అసలు విషయం బయటపడింది. తండ్రి మహ్మద్ ఉస్మాన్ చేతిలోనే అఫ్రీన్ హత్యకు గురైందని తేలింది. అఫ్రీన్ సోదరి, తల్లి ఆ ఆడియో రికార్డింగ్‌ను పోలీసులకు అందజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఉస్మాన్ ఇటీవల తన కూతురు అఫ్రీన్‌కు ఓ పెళ్లి సంబంధం చూశాడు. అయితే వరుడు వయసు 50 సంవత్సరాలకు పైగానే ఉంటుంది. తన కంటె రెట్టింపు వయసు కలిగిన అతడిని పెళ్లి చేసుకునేది లేదని అఫ్రీన్ తేల్చి చెప్పింది. తనకు ఇంకా చదువుకోవాలని ఉందని చెప్పింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఉస్మాన్ కూతురిని కర్కశంగా చంపేసి మృతదేహాన్ని చెరువులో పారేశాడు.
ఇవి కూడా చదవండి