పండుగకు పస్తులేనా?

ABN , First Publish Date - 2022-01-11T07:00:40+05:30 IST

సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చి నా, 10వ తేదీ దాటినా జిల్లాలో చాలామంది లబ్ధిదారులకు నేటికీ రేషన్‌ బియ్యం అందలేదు. ఈనెల 14, 15 తేదీల్లో సంక్రాంతి పండుగ ఉంది.

పండుగకు పస్తులేనా?

రేషన్‌ దుకాణాలకు అరకొరగా బియ్యం సరఫరా

10వ తేదీ దాటిన లబ్ధిదారులకు అందని బియ్యం

రేషన్‌ దుకాణాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు


మోత్కూరు, జనవరి 10: సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చి నా, 10వ తేదీ దాటినా జిల్లాలో చాలామంది లబ్ధిదారులకు నేటికీ రేషన్‌ బియ్యం అందలేదు. ఈనెల 14, 15 తేదీల్లో సంక్రాంతి పండుగ ఉంది. సాధారణంగా ఈ పండుగకు పిండి వంటలు చేస్తుంటారు. అందుకు దొడ్డు బియ్యాన్నే అధికంగా వాడుతుంటారు. కాగా, రేషన్‌ బియ్యం రాకపోవడంతో ప్రైవేటు దుకాణాల్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), గుండాల తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో నేటికీ బియ్యం పంపిణీ చేయలేదు. ఇదేంటని లబ్ధిదారులు డీలర్లను ప్రశ్నిస్తే బియ్యం సరఫరా కాలేదని సమాధానమిస్తున్నారు.


అరకొరగా బియ్యం సరఫరా

మోత్కూరు బియ్యం గోదాం పరిధిలో మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), గుండాల మండలాలతో పాటు మోటకొండూరు మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నా యి. గత ఏడాది డిసెంబరులో ఒక్కొక్కరికి 5కిలోల బియ్యమే ఇచ్చారు. అయితే కరోనా నేపథ్యంలో 5కిలోలు ఇవ్వాలా, లేక 10కిలోలు ఇవ్వాలా అనే నిర్ణయం తీసుకోవడంలో కొంత సమయం పట్టిందని, దీంతో గోదాంకు ఆలస్యంగా బియ్యం వచ్చాయని గోదాం అధికారులు చెబుతున్నారు. గత నెల 22 నుంచి 30లోపు రేషన్‌ దుకాణాలకు గోదాం నుంచి బియ్యం సరఫరా కావాల్సి ఉండగా రాలేదు. ఈనెల 5వ తేదీ నుంచి దుకాణాల కు బియ్యం పంపడం ప్రారంభించారు. గోదాం పరిధిలో సుమారు 90 రేషన్‌ దుకాణాలు ఉండగా, బియ్యం కోటా ఆలస్యంగా రావడంతో 30 దుకాణాల వరకు నేటికీ బియ్యం సరఫరా కాలేదు. సరఫరా చేసిన దుకాణాలకు కూడా సగం కోటానే ఇచ్చారు. దీంతో పలు దుకాణాల్లో లబ్ధిదారులకు నేటికీ బియ్యం పంపిణీ ప్రారంభించకపోగా, పంపిణీ చేస్తున్న దుకాణాల్లో అందరికీ అందడం లేదు. ప్రతీ నెల 15వ తేదీ వరకే బయోమెట్రిక్‌ పనిచేస్తుంది.ఆతర్వాత ఇస్తారో లేదోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బియ్యం తీసుకున్న వారు పండుగ చేసుకుంటుండగా, దొరకని వారు పస్తుండాలా అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అన్ని దుకాణాలకు బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నారు.


10వ తేదీ గడిచినా రేషన్‌ ఇవ్వడం లేదు : జి.కృష్ణ, లబ్ధిదారుడు, కొండాపురం, మోత్కూరు మునిసిపాలిటీ

నేను 5వ తేదీ నుంచి రోజూ రేషన్‌ దుకాణానికి బియ్యం కోసం వెళ్లివస్తున్నా. గోదాం నుంచి ఇంకా బియ్యం రాలేదని డీలర్‌ చెబుతున్నాడు. 10వతేదీ దాటినా బియ్యం రాలేదు. 14న పండుగ ఉంది. ఈమరో రెండు రోజుల్లో బియ్యం వచ్చినా డీలర్‌ మాత్రం అందరికీ ఒకేసారిఎలా పంపణీ చేయగలుగుతారు.పండుగ సమయాల్లో బియ్యం ఇవ్వకుంటే ఎలా?


రెండు రోజుల్లో అన్ని దుకాణాలకు బియ్యం : జుబేరుద్దీన్‌, మోత్కూరు గోదాం ఇన్‌చార్జి

ఈనెల 5కిలోలు ఇవ్వాలా, 10కిలోలు ఇవ్వాలా అన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైంది. దీంతో కోటా అలాట్‌లో జాప్యం చోటుచేసుకుంది. ఈ నెల 5వ తేదీ నుంచి దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తున్నాం. మరో రెండు రోజుల్లో అన్ని దుకాణాలకు అందిస్తాం. ప్రభుత్వం ఈ నెల ఒక్కొక్కరికి 10కిలోల బియ్యం ఇచ్చేందుకు నిర్ణయించింది.          

Updated Date - 2022-01-11T07:00:40+05:30 IST