త్వరలో ఫాస్టాగ్‌ కనుమరుగు!

ABN , First Publish Date - 2022-05-02T10:04:14+05:30 IST

టోల్‌ప్లాజా.. కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి, నగదు చెల్లింపులతో ముందుగు సాగే వాహనదారులకు ఫాస్టాగ్‌ ఆగమనంతో సమయాభావం తప్పింది.

త్వరలో ఫాస్టాగ్‌ కనుమరుగు!

  • ఇక ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ..
  • ప్రయాణించిన దూరానికే టోల్‌ చెల్లింపు


టోల్‌ప్లాజా.. కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి, నగదు చెల్లింపులతో ముందుగు సాగే వాహనదారులకు ఫాస్టాగ్‌ ఆగమనంతో సమయాభావం తప్పింది. టోల్‌ప్లాజాల వద్ద బారులు తీరే పరిస్థితి దూరమైంది. అయితే.. ఫాస్టాగ్‌ విధానం త్వరలో కనుమరుగు కానుంది. దాని స్థానంలో ఉపగ్రహ ఆధారిత టోల్‌ వసూలు వ్యవస్థను పరిచయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్ప టికే ఐరోపా దేశాల్లో ఉపగ్రహ ఆధారిత గ్లోబల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం(జీఎన్‌ఎస్ఎస్) అందుబాటులో ఉంది.


ఈ వ్యవస్థ వల్ల వాహనదారుల కూ వెసులుబాటు కలగనుంది. ప్రస్తుతం టోల్‌ప్లాజాల వద్ద సంబంధిత నిర్వహణ సంస్థ టోల్‌ రోడ్‌ ప్రారంభం నుంచి ముగింపు దాకా కిలోమీటర్లను లెక్కగట్టి ట్యాక్స్‌ను వసూలు చేస్తున్నారు. అంటే.. వాహనదారులు టోల్‌ రోడ్‌ను 10 కిలోమీటర్లే వినియోగించుకున్నా మొత్తం ట్యాక్స్‌ చెల్లిస్తున్నారు. జీపీఎస్‌ ఆధారంగా పనిచేసే జీఎన్‌ఎస్‌ఎస్‌లో వాహనదారుడు టోల్‌ రోడ్‌పై ప్రయాణించిన దూ రానికే టోల్‌ట్యాక్స్‌ చెల్లించాలి.


ఉదాహరణకు యాదాద్రి-భువనగిరి జిల్లా బీబీనగర్‌ వద్ద ఉన్న టోల్‌ప్లాజా పరిధి హైదరాబాద్‌ వైపు.. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అన్నోజిగూడ వరకు ఉంది. భువనగిరికి చెందిన ఓ వాహనదారుడు కొండమడుగు మెట్టు వరకు మాత్రమే టోల్‌రోడ్డును వాడుకున్నా 25.5 కిలోమీటర్ల లెక్కన మొత్తం ఫీజు చెల్లిస్తున్నాడు. జీఎన్‌ఎస్‌ఎస్‌ విధానం అమల్లోకి వస్తే భువనగిరి నుంచి కొండమడుగు మెట్టుకు మధ్య దూరం 14 కిలోమీటర్లకే టోల్‌ వసూలు చేస్తారు. అంటే టోల్‌ రోడ్డుపై తక్కువ దూరం ప్రయాణిస్తే తక్కువ ట్యాక్స్‌.. ఎంత ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఎక్కువ టోల్‌ఫీజు ఉంటుందన్నమాట. గత నెల 18న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ విషయాన్ని పార్లమెంట్‌లో తెలిపారు. 


విదేశాల్లో ఇదే పద్ధతి

ఐరోపా దేశాల్లో జీఎన్‌ఎస్‌ఎస్‌ విధానం అమలవుతోంది. జర్మనీలో 98.8% వాహనాలు ఈ వ్యవస్థ పరిధిలో ఉన్నాయి. జీఎన్‌ఎస్‌ఎస్‌ పరికరం ఉన్న వాహనం టోల్‌ రోడ్డుపైకి రాగానే ప్రయాణ టైమ్‌-లైన్‌ ప్రారంభమవుతుంది. ఆ వాహనం టోల్‌ రోడ్డు నుంచి దిగాక లేదా టోల్‌ రోడ్డు ముగిశాక టైమ్‌-లైన్‌ పూర్తవుతుంది. ప్రయాణించిన కిలోమీటర్ల లెక్కన వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచి టోల్‌ట్యాక్స్‌ బదిలీ అవుతుంది.

Updated Date - 2022-05-02T10:04:14+05:30 IST