Presidential Polls : ప్రతిపక్షాల ఆఫర్‌ను తిరస్కరించిన ఫరూఖ్ అబ్దుల్లా

ABN , First Publish Date - 2022-06-18T22:14:42+05:30 IST

నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్

Presidential Polls : ప్రతిపక్షాల ఆఫర్‌ను తిరస్కరించిన ఫరూఖ్ అబ్దుల్లా

న్యూఢిల్లీ : నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాను రాష్ట్రపతి ఎన్నికల గోదాలోకి దించేందుకు ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని, జమ్మూ-కశ్మీరుకు సేవ చేయడానికి తాను ఇష్టపడతానని ఆయన ప్రకటించారు. తన పేరును ప్రతిపాదించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీకి ధన్యవాదాలు తెలిపారు. 


రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మమత బెనర్జీ నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఆమె ఈ నెల 15న న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌‌లో ప్రతిపక్ష నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, శివసేన సహా 17 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌ పేరును వీరు ప్రతిపాదించినప్పటికీ, ఆయన సున్నితంగా తిరస్కరించారు. అనంతరం ఫరూఖ్ అబ్దుల్లా పేరును ప్రతిపాదించారు. 


ఈ నేపథ్యంలో ఫరూఖ్ అబ్దుల్లా శనివారం విడుదల చేసిన ప్రకటనలో, తనను రాష్ట్రపతి పదవికి ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ప్రతిపాదించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాను జమ్మూ-కశ్మీరుకు సేవ చేయడానికి ఇష్టపడతానని చెప్పారు. 


మమత బెనర్జీ తన పేరును ప్రతిపాదించిన తర్వాత తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ అనేక మంది నేతలు తనకు ఫోన్ చేశారని చెప్పారు. ఈ అనూహ్య పరిణామం నేపథ్యంలో తాను తన కుటుంబ సభ్యులతోనూ, సీనియర్ సహచరులతోనూ చర్చించానని చెప్పారు. దేశంలో అత్యున్నత స్థాయి పదవి కోసం తన పేరును పరిశీలించడం తనకు లభించిన గౌరవమని తెలిపారు. తనకు లభించిన మద్దతు తన మనసును హత్తుకుందని చెప్పారు. 


ప్రస్తుతం జమ్మూ-కశ్మీరు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని తాను భావిస్తున్నానని తెలిపారు. ఈ అనిశ్చిత పరిస్థితుల నుంచి బయట పడటానికి తన కృషి చాలా అవసరమని చెప్పారు. భవిష్యత్తులో మరింత క్రియాశీలక రాజకీయాల్లో తాను పాల్గొనవలసి ఉందన్నారు. జమ్మూ-కశ్మీరుకు, దేశానికి మరింత సకారాత్మకంగా తాను  సేవ చేయవలసి ఉందని చెప్పారు. 


ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం జరుగుతున్న పరిశీలన నుంచి తాను గౌరవప్రదంగా ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతిస్తానని తెలిపారు. తన పేరును ప్రతిపాదించినందుకు మమత బెనర్జీకి ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. తనకు మద్దతిచ్చిన సీనియర్ నేతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2022-06-18T22:14:42+05:30 IST