సాగుకు ‘ఉపాధి’ ఏదీ?

ABN , First Publish Date - 2022-06-26T05:26:43+05:30 IST

ఉపాధిహామీ పనులను వ్యవసాయ పనులకు అనుసంధానిస్తామంటూ ప్రభుత్వం పేర్కొంటున్నా, అమలుకు మాత్రం నోచుకోవడంలేదు. సాగు ఖర్చులు పెరిగి.. కూలీల కొరత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సాగు పనులకు ఉపాధిహామీని పూర్తిస్థాయిలో అనుసంధానించాలని నీతి అయోగ్‌ 2018 ఏప్రిల్‌లోనే కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈజీఎస్‌ ద్వారా చేపట్టే

సాగుకు ‘ఉపాధి’ ఏదీ?
చెరువులో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

వ్యవసాయానికి అనుసంధానంపై నీలినీడలు

2018లోనే కేంద్రానికి నీతి అయోగ్‌ సూచన

ఇప్పటికీ అమలకు నోచుకోని వైనం

తీవ్ర నిరాశ చెందుతున్న రైతులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

ఉపాధిహామీ పనులను వ్యవసాయ పనులకు అనుసంధానిస్తామంటూ ప్రభుత్వం పేర్కొంటున్నా, అమలుకు మాత్రం నోచుకోవడంలేదు. సాగు ఖర్చులు పెరిగి.. కూలీల కొరత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సాగు పనులకు ఉపాధిహామీని పూర్తిస్థాయిలో అనుసంధానించాలని నీతి అయోగ్‌ 2018 ఏప్రిల్‌లోనే కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈజీఎస్‌ ద్వారా చేపట్టే పొలంపనుల్లో 75 శాతం రైతులు భరించేలా, 25 శాతం ప్రభుత్వం చెల్లించేలా వ్యవసాయ పనులను చేపట్టాలని సూచించింది. రాష్ట్రాలు కూడా తమవంతుగా పథకాన్ని అమలు చేయవచ్చని స్పష్టం చేసింది. కానీ ఇప్పటివరకు సాగు పనులకు ఉపాధిహామీ ఊతమందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిరకాల యంత్రాలు వచ్చినా కూలీల కొరత నానాటికీ తీవ్రమవుతుండటం సాగుకు ప్రతిబంధకంగా మారింది. ఈ నేపథ్యంలో వరినాట్లు, కలుపు నివారణ, నూర్పిడులు తదితరాలకు ఉపాధిహామీ ద్వారా సాయం అందించాలని రైతులు కోరుతున్నారు.

కొన్నింటికే పరిమితం 

జిల్లాలో 5,05,760 జాబ్‌కారులు ఉన్నాయి. వాటిలో 10,02,210 మంది సభ్యులుగా ఉన్నారు. ప్రతీ రోజు 7105 మేట్ల ద్వారా 2.51 లక్షల మంది వేతనదారులు పనులకు వెళుతున్నారు. వ్యవసాయానికి ఊతమిచ్చేలా బావుల తవ్వకం, పూడికతీత, ఫీడర్‌ఛానళ్లు, కందకాల తవ్వకం, వర్మికంపోస్టు తవ్వకం, ఇంకుడు గుంతలు, పంటకుంటల నిర్మాణం, గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు పరిచేలా డంపింగ్‌ యార్డుల నిర్మాణాలను చేపడుతున్నారు. అనుంబంధ సాయం పూర్తిగా ప్రభుత్వం మంజూరు చేసే నిధులతోనే సాగుతుంది. చాలా గ్రామాల్లో కూలీల కొరత ఉన్నందున వ్యవసాయ పనులు కొనసాగే రోజుల్లో ఉపాధిహామీ పనులను నిలిపివేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి ఉపాధిహామీ పనులను అనుసంధానిస్తే రైతులకు కూలీల కొరతతీరి ఆర్థికంగానూ కలిసివస్తుంది. కూలీలకూ ఏడాది పాటు పనులు లభిస్తాయి. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.  


ఆదేశాలు లేవు  

ఉపాధిహామీ పథకం వ్యవసాయానికి అనుసంధానంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు లేవు. కానీ వ్యవసాయానికి ఊతమిచ్చే బావుల తవ్వకం, పూడికతీత, ఫీడర్‌ ఛానళ్లు, కందకాల తవ్వకం, వర్మికంపోస్టు తవ్వకం, ఇంకుడు గుంతలు, పంటకుంటలు వంటి పనులు చేపడుతున్నాం.

- ఎం.రోజారాణి, డ్వామా పీడీ




Updated Date - 2022-06-26T05:26:43+05:30 IST