రైతుల కొను‘గోడు’

ABN , First Publish Date - 2021-10-19T05:58:09+05:30 IST

జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అహర్నిశలు కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు హరిగోస పడాల్సి వస్తుంది. జిల్లావ్యాప్తంగా మొక్కజొన్న పంట చేతికొచ్చింది. ప్రస్తుతం అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.

రైతుల కొను‘గోడు’
మొక్కజొన్న పంటను ఆరబెడుతున్న రైతులు

జిల్లాలో కొనుగోలు కేంద్రాల కోసం రైతుల ఎదురుచూపు

చేతికొచ్చిన మొక్కజొన్న పంట

జిల్లావ్యాప్తంగా 92 వేల ఎకరాలలో సాగైన మక్క పంట

2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రానున్నట్లు అధికారుల అంచనా

పట్టించుకోని యంత్రాంగం

ఆందోళనలో మొక్కజొన్న రైతులు

కామారెడ్డి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అహర్నిశలు కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు హరిగోస పడాల్సి వస్తుంది. జిల్లావ్యాప్తంగా మొక్కజొన్న పంట చేతికొచ్చింది. ప్రస్తుతం అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మొక్కజొన్న పంటను ఇప్పుడిప్పుడే రైతులు మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వకపోవడం, ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే మార్కెట్‌లో ప్రైవేట్‌ వ్యక్తులు, దళారుల చేతిలో ఎక్కడ మోసపోతామోనని మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మొక్కజొన్న రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

వేల ఎకరాలలో మొక్కజొన్న సాగు

జిల్లాలో వేల ఎకరాలలో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. సదాశివనగర్‌, గాంధారి, తాడ్వాయి, రాజంపేట, బాన్స్‌వాడ, బీర్కూర్‌, నిజాంసాగర్‌, పిట్లం, పెద్దకొడప్‌గల్‌, భిక్కనూర్‌, దోమకోండతో పాటు తదితర మండలాల్లో మొక్కజొన్న పంట మాత్రమే సాగయ్యే నేలలు ఉన్నాయి. దీంతో ప్రతీ వానా కాలం, యాసంగి సీజన్‌లలో రైతులు ఎక్కువగా మొక్కజొన్ననే సాగు చేస్తుంటారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం భారీగానే రైతులు మొక్కజొన్నను సాగు చేశారు. జిల్లావ్యాప్తంగా ఈ సీజన్‌లో 47,608 మంది రైతులు మొత్తం 92,057 వేల ఎకరాలలో మొక్కజొన్నను సాగు చేశారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడం.. పైగా తెగుళ్ల బెడద లేకపోవడంతో మొక్కజొన్న దిగుబడులు వచ్చే అవకాశం ఉందని రైతులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా మొక్కజొన్న దిగుబడులు 2.20 లక్షల మెట్రిక్‌ టన్నులు వచ్చే అవకాశం ఉంది.

మార్కెట్‌లోకి మొక్కజొన్న పంట

జిల్లాలో మొక్కజొన్న పంట చేతికొచ్చింది. ఇప్పటికే పంటను కోసి రైతులు నూర్పిడికి సిద్ధం చేశారు. పలు మండలాల్లో రైతులు నూర్పిడి చేసి పంట ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. జిల్లాలో ఆయా మార్కెట్‌ యార్డులతో పాటు సహకార సంఘాల కేంద్రాల వద్దకు రైతులు తరలిస్తున్నారు. ప్రతియేటా మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వమే మొక్కజొన్నను కొనుగోలు చేస్తూ వస్తుంది. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేపడుతోంది. ప్రతియేటా జిల్లాలో 63 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది పంట మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో మొక్కజొన్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే బహిరంగా మార్కెట్‌ లో దళారులు, ప్రైవేట్‌ వ్యక్తులు తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతామని, ప్రభుత్వమే కేంద్రాలను ఏర్పాటు చేయాలని పలువురు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

గత ఏడాది రైతుల ఆందోళన

గత ఏడాది నుంచి ప్రభుత్వం మొక్కజొన్న పంటను సాగు చేయవద్దని రైతులకు ఆదేశిస్తూ వచ్చింది. వ్యవసాయశాఖ అధికారులు సైతం రైతులకు అవగాహన కల్పించారు. గత వానకాలం సీజన్‌లో మొక్కజొన్న కొనుగోళ్లపై జిల్లా రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిని దిగ్బంధించి మొక్కజొన్న పంటను రహదారిపై పారబోసి పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ఇలా  జిల్లానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కోనుగోళ్లు చేపట్టాలని రైతులు ఆందోళన చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి మార్క్‌ఫెడ్‌ ఆధ ్వర్యంలో కొనుగోలు చేపట్టింది. కేవలం ఈ వానాకాలం సీజన్‌లోనే కొనుగోళ్లు చేస్తామని, ఇక మీదట కొనుగోళ్లు చేసే ప్రసక్తే ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. అయితే మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో? లేదో? వేచి చూడాలి మరీ!!

బహిరంగ మార్కెట్లో ‘మద్దతు’ లభించేనా?

ప్రభుత్వం మొక్కజొన్న పంటను కొనుగోలు చేయకుంటే బహిరంగా మార్కెట్‌లో మద్దతుధర లభిస్తుందో? లేదో? అని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గత ఏడాది ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి క్వింటాలు మొక్కజొన్నకు రూ.1850 మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసింది. అయితే బహిరంగా మార్కెట్‌లో మాత్రం మొక్కజొన్న క్వింటాలు రూ.1900 వరకు ధర పలికింది. గత ఏడాది పంట సాగు చాలా తగ్గడంతో బహిరంగా మార్కెట్‌లో పంటకు డిమాండ్‌ వచ్చిందని రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది సుమారు లక్ష ఎకరాల వరకు పంట సాగైంది. దిగుబడులు రెండు లక్షలకు పైగా మెట్రిక్‌ టన్నుల వరకు వస్తాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో బహిరంగా మార్కెట్‌లో దళారులు, వ్యాపారులు సిండికేట్‌ అయ్యి, తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.1870 మద్దతుధరను ఇటీవల ప్రకటించింది. ఈ మద్దతుధరకే ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

వెంటనే మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలి

: సాయినాథ్‌, రైతు, అమర్లబండ, సదాశివనగర్‌

మొక్కజొన్న పంటను ప్రభుత్వమే వెంటనే కొనుగోలు చేయాలి. పండించిన పంటను కొనకుంటే ప్రభుత్వం ఎందుకు?, ఒక్కసారి వరి వద్దంటారు.. మరోసారి మొక్కజొన్న వద్దంటారు. మరీ ఇంకేం పండించాలి. పండించిన పంటను ఎక్కడ అమ్మాలి. నేను ఈయేడు గ్రామశివారులో ఐదు ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేశాను. పంట బాగుంది. ప్రభుత్వం మద్దతుధరకు కొనుగోలు చేస్తే మరింత గిట్టుబాటు అవుతుందని ఆశగా ఉంది.

ఎలాంటి ప్రభుత్వ ఆదేశాలు రాలేదు

: రంజిత్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ అధికారి

మొక్కజొన్న పంట చేతికి వచ్చిన మాట వాస్తవమే. కానీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వాలు మొక్కజొన్నకు ఈ ఏడాది క్వింటాలుకు మద్దతుధర రూ.1870 ప్రకటించింది. ప్రభుత్వం ఆదేశిస్తే గాని మొక్కజొన్న పంటను కొనుగోలు చేయలేం.

Updated Date - 2021-10-19T05:58:09+05:30 IST