గణతంత్ర పరేడ్‌ ముగిశాకే ట్రాక్టర్‌ ర్యాలీ

ABN , First Publish Date - 2021-01-25T07:40:23+05:30 IST

గణతంత్ర దినోత్సవం రోజున రైతులు జరపతలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి పోలీసులు షరతులతో అనుమతి ఇచ్చారు.

గణతంత్ర పరేడ్‌ ముగిశాకే ట్రాక్టర్‌ ర్యాలీ

అడుగడుగునా భారీ భద్రత.. 100 కిమీ దూరం సాగుతుంది: రైతులు

ఎక్కడికక్కడ ముగిసేట్లు పోలీసుల ప్లాన్‌

పంజాబ్‌ నుంచి వేలల్లో వస్తున్న ట్రాక్టర్లు


న్యూఢిల్లీ, జనవరి 24: గణతంత్ర దినోత్సవం రోజున రైతులు జరపతలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి పోలీసులు షరతులతో అనుమతి ఇచ్చారు. రాజ్‌పథ్‌లో రిపబ్లిక్‌ డే పరేడ్‌ ముగిసిన తరువాతే అంటే ఉదయం 11-30 గం టల తరువాతే ట్రాక్టర్‌ ర్యాలీ ఆరంభం కావాలి. అప్పు డే సరిహద్దుల్లోని బ్యారికేడ్లను తొలగిస్తారు. ఇక ట్రాక్ట ర్‌ ర్యాలీని మూడు సరిహద్దు పాయింట్ల నుంచి అంటే సింఘూ, టిక్రీ, గాజీపూర్‌ల వైపు నుంచి అనుమతిస్తా రు. పల్వాల్‌, షాజహాన్‌పూర్‌ అంటే రాజస్థాన్‌ వైపు నుంచి కూడా అనుమతించే అవకాశం ఉందని రైతు నాయకులు చెబుతున్నా పోలీసులు ధ్రువీకరించలేదు. ఆదివారం రైతు నేతలకు, పోలీసు అధికారులకు మధ్య 6 దఫాల చర్చల అనంతరం అనేక షరతులు పెడు తూ పోలీసులు అనుమతి ఇచ్చారు. వివరాలను పోలీసులు మీడియాకు చెప్పారు.

1) రైతులు ఢిల్లీలో ప్రవేశించవచ్చు. కానీ రాజ్‌పథ్‌ పరేడ్‌ను భగ్నం చేసే ప్రయత్నం చేయరాదు.

2) టిక్రీ నుంచి 63 కి.మీ, సిం ఘూ నుంచి 60 కి.మీ, గాజీపూర్‌ నుంచి 46 కిలోమీటర్ల దూరం ర్యాలీని అనుమతిస్తారు. ఈ మూడూ కుండ్లీ-మనేసర్‌-పల్వాల్‌ ఎక్స్‌ప్రె్‌సవే వద్ద కలుస్తాయి

3) ఢిల్లీ నగరంలోనే 100 కి.మీ మేర ఇది సాగుతుంది.

4) ఎన్ని ట్రాక్టర్లు ఏఏ పాయింట్ల నుంచి వస్తాయన్నది ముందుగానే నిర్ధారిస్తారు.

5) ఢిల్లీ నగరంలో ఎక్కడికక్కడ నిష్క్రమణ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తారు. కొన్ని కిలోమీటర్ల దూరం సాగాక ట్రాక్టర్లు ఆయా పాయింట్ల నుంచి మరలిపోవాలి.

6) ట్రాక్టర్‌ ర్యాలీకి అడుగడుగునా భద్రత కల్పిస్తారు. నిరంతర నిఘా ఉంటుంది.

7) రాజ్‌పథ్‌ పరేడ్‌కు పనిచేసే భద్రతాయంత్రాంగం.. అది ముగిశాక రైతుల ర్యాలీ వద్ద భద్రత చేపడుతుంది. వీటికి సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే రైతులు కూడా ఓ రూట్‌మ్యా్‌పను తయారుచేసి ఇచ్చారు. వారు చెబుతున్న దాని ప్రకారం..

(1) గణతంత్ర పరేడ్‌కు ఆటంకం కలిగించం, ప్రశాంతంగానే సాగిస్తాం, ఉదయం 11-30కి మొదలై సాయం త్రం 6 గంటలకు ముగిసేలా చూస్తాం.

(2) ప్రతీ నిరసన కేంద్రం వద్ద 40 మందితో ఓ వార్‌రూం ఏర్పాటు. ఇందులో డాక్టర్లు, భద్రతా యంత్రాంగం, సోషల్‌ మీడి యా మేనేజర్లు ఉంటారు.

3) 40 అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నారు.

4) 2500 మంది వలంటీర్లు ర్యాలీ వెంబడి ఉంటారు.

5) రిటైరైన సైనికోద్యోగులు ర్యాలీ వెంట సాగి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తారు. ‘కిసాన్‌ గణతంత్ర పరేడ్‌’ గా పిలిచే ఈ ట్రాక్టర్‌ ర్యాలీకి పోలీసుల నుంచి అధికారికంగా అనుమతి లభించినట్లు స్వరాజ్‌ ఇండియా చీఫ్‌ యోగేంద్ర యాదవ్‌ చెప్పారు.


ట్రాలీలు కాదు... శకటాలు!

రైతుల ర్యాలీ మామూలు రీతిలో సాగదు. రిపబ్లిక్‌ డే నాడు రాజ్‌పథ్‌ మార్చ్‌లో వివిధ రాష్ట్రాల శకటాలు సాగినట్లే రైతులు కూడా కొన్ని ట్రాక్టర్లను వివిధ ఆకృతులతో కూడిన శకటాలుగా రూపొందిస్తున్నారు. రైతు జీవనం, దేశానికి రైతు అవసరం, రైతుల దుస్థితి, సాగుచట్టాల వల్ల అనర్థాలు, మారుతున్న జీవన విధానాలు.. వీటన్నింటినీ వివిధ రూపాల్లో ప్రదర్శిస్తారు. ప్రతీ ట్రాక్టర్‌పైనా మువ్వన్నెల జెండా తప్పనిసరిగా ఉండేట్లు చర్యలు తీసుకుంటున్నారు. పంజాబ్‌లోని లూధియానా నుంచి కర్తార్‌సింగ్‌ అనే రైతు 160 కి.మీ. దూరం రివర్స్‌ గేర్‌లో ట్రాక్టర్‌ నడుపుకుంటూ ఢిల్లీ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చాడు. తన మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోదీ సాగు చట్టాలను రివర్స్‌ చేయాలని ఆయన అన్నారు. కాగా, పంజాబ్‌ నుంచి వేలాదిగా ట్రాక్టర్లు ఢిల్లీ దిశగా వెళుతున్నాయి. కాగా, ఆందోళన చేస్తున్న రైతుల ట్రాక్టర్లకు డీజిల్‌ నిరాకరించాలని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కోరింది. ఢిల్లీ దిశగా వెళ్లే ఏ ట్రాక్టర్‌కూ డీజిల్‌ అందివ్వరాదని అనేక పెట్రోల్‌ బంకులకు ప్రభుత్వాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈ విషయం రైతులకు తెలియడంతో చాలా చోట్ల బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. 


మహారాష్ట్రలో కదం తొక్కిన రైతులు

కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో వేలాది మంది  రైతులు కదం తొక్కారు. 21 జిల్లాల నుంచి ముంబైకి వచ్చారు. సోమవారం తెల్లారేదాకా రైతులు వస్తారని, ఆజాద్‌ మైదాన్‌ వద్ద ధర్నా, భారీ సభ నిర్వహిస్తామని ఆలిండియా కిసాన్‌ సభ ప్రకటించింది.

Updated Date - 2021-01-25T07:40:23+05:30 IST