మిరప సాగుకు రైతాంగం సన్నద్ధం

ABN , First Publish Date - 2022-08-07T06:44:59+05:30 IST

మండలంలోని రైతాంగం మిరప సాగుకు సన్నద్ధమవుతోంది. అధిక శాతం మంది రైతులు తమ భూముల్లోనే నారుమడులు పోసుకున్నారు.

మిరప సాగుకు రైతాంగం సన్నద్ధం
రైతులు సిద్ధం చేసుకున్న నారుమడులు

మడుల్లో సిద్ధంగా ఉన్న నారు

సరైన వర్షం కోసం ఎదురుచూపులు 

పెద్ద దోర్నాల, ఆగస్టు 6:మండలంలోని రైతాంగం మిరప సాగుకు సన్నద్ధమవుతోంది. అధిక శాతం మంది రైతులు తమ భూముల్లోనే నారుమడులు పోసుకున్నారు. అవి నాటేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వారం పది రోజుల్లో నాట్లు వేసేందుకు భూములను సిద్ధం చేస్తున్నారు. కాగా మరికొంత మంది రైతులు ఇతర ప్రాంతాల్లోని షెడ్లలో మిరప నారు ఒక్కొక్క మొక్క 80 పైసల చొప్పున కొనుగోలు చేసి నాట్లు వేస్తున్నారు. పది రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చి చిరు జల్లులు కురుస్తున్నాయి. మూడు రోజుల క్రితం పదును వాన  కురవడంతో భూములు దుక్కులు దున్ని నాటు వేసేందుకు అనుగుణంగా తయారు చేసుకున్నారు. ఒక మోస్తారు వర్షంతో వాతావరణం చల్లబడినప్పటికీ, మిరపసాగుకు సరిపడా వర్షం కురవక పోవడంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే సాగు చేసిన పత్తికి నీటి తడులు లేకపోవడంతో ఎండుముఖం పడుతోంది. పదును వానతో తిరిగి ప్రాణం పోసుకుంది.   చాలిచాలని వర్షాన్ని నమ్ముకొని మిరప నాట్లు వేస్తే తర్వాత పరిస్థితి ఏమిటని సంశయిస్తున్నారు. సరైన వర్షం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.

విస్తారంగా మిరప సాగు

మండలంలో ఈ ఏడాది మిరప సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. సుమారు 2200 హెక్టారుల్లో మిరప సాగయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మిరప కాయలకు మంచి ధర పలుకుతోంది. రకాన్ని బట్టి క్వింటాలు రూ. 22,000ల నుండి రూ.32,000ల వరకు పలుకుతోంది. 341 వెరైటీకి ప్రస్తుతం అధిక ధర ఉంది. దీంతో రైతులు తమ అప్పులన్నీ తీరాలంటే మిరప పంటతోనే సాధ్యమన్న భావనతో మిరప సాగుకు సిద్ధం అవుతున్నారు. ఎకరం మిరప సాగు చేయాలంటే సుమారు రూ.75,000ల నుంచి రూ.1,25,000ల వరకు ఖర్చవుతోంది.  వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 25 నుండి 35 క్వింటాల్ల దిగుబడి వస్తుంది. పంట చేతికందే సమయానికి  ఎంతలేదన్నా ఽక్వింటాలు రూ.18,000లు పలికినా ఖర్చులు పోను రూ3,00,000లు పొందవచ్చని రైతులు ఆశాభావంతో ఉన్నారు. అయితే రెండేళ్లుగా ధరలు ఫరవాలేదనిపించినా నివారణ కాని తెగుళ్లు పంటను తీవ్ర నష్టపరుస్తున్నాయి. కనీసం పెట్టుబడిలో సగం కూడా రాని పరిస్థితి చాలా మంది రైతులు ఎదుర్కొన్నారు.  దీనికి తోడు ఏటికేడు ఖర్చులు పెరుగుతున్నాయి. మరోవైపు వర్షాలు కురవడం లేదు. అయినా గత అనుభవాలు కళ్లముందున్నా తమ అప్పులు తీరాలన్నా యోచనతో అధిక విస్తీర్ణంలో మిరప సాగుకు మొగ్గు చూపుతున్నారు. రెండు వారాల్లో సరైన వర్షం కురవకపోతే మిరప సాగు ప్రశ్నార్ధకంగానే మిగులుతుందని రైతులు ఆందోళనలో ఉన్నారు.

Updated Date - 2022-08-07T06:44:59+05:30 IST