రైతులు పంటరుణాలు చెల్లించొద్దు

ABN , First Publish Date - 2022-05-28T05:09:10+05:30 IST

రైతులు పంటరుణాలు చెల్లించొద్దు

రైతులు పంటరుణాలు చెల్లించొద్దు
పరిగి సయ్యద్‌పల్లి రచ్చబండలో మాట్లాడుతున్న టి.రామ్మోహన్‌రెడ్డి


  • అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం
  • డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి

పరిగి,మే 27: రైతులు పంట రుణాలు చెల్లించవద్దని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న రచ్చబండలో భాగంగా శుక్రవారం ఖుదావంద్‌పూర్‌, సయ్యద్‌పల్లి గ్రామాల్లో నిర్వహించిన రైతు సభల్లో ఆయన మాట్లాడారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలు వరంగల్‌లో ప్రకటించిన డిక్లరేషన్‌లోని అంశాలను అమలు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ రైతుభరోసా ద్వారా ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సహాయం,ఽ దరణి పోర్టల్‌ రద్దు, ప్రతి ఎకరాకు సాగునీరు అందేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణాలు, పంటకు కనీస మద్దతు ధర, పంటల భీమా, అసైన్డ్‌ భూముల క్రయ, విక్రయాలకు హక్కు, రైతు కమిషన్‌ ఏర్పాటు తదితర ఆంశాలను పల్లెపల్లెలో భాగంగా ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. వరి వేస్తే ఉరి అని చెప్పిన సీఎం కేసీఆర్‌ ప్రకటనతో చాలామంది రైతులు వరి వేయకుండా నష్టపోయారని, ఇలాంటి రైతులకు ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్‌ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్‌తో సాధించుకున్న రాష్ట్రంలో ఈ మూడింటినీ కేసీఆర్‌ విస్మరించారని ఆరోపించారు. కేసీఆర్‌ దక్షిణ తెలంగాణను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. సాగునీటి విషయంలో ఉమ్మడి జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళతామని రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-05-28T05:09:10+05:30 IST