సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా

ABN , First Publish Date - 2020-11-29T06:28:30+05:30 IST

సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని నర్సాపూర్‌ గ్రామ రైతులు శనివారం ధర్నా నిర్వహించారు.

సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
లక్ష్మణచాందలో ధర్నా చేస్తున్న రైతులు

కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన జిల్లా సివిల్‌ సప్లై అధికారి తిరుపతిరెడ్డి

లక్ష్మణచాంద, నవంబరు 28 : సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని నర్సాపూర్‌ గ్రామ రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. నర్సాపూర్‌ ఎక్స్‌రోడ్‌ (222 జాతీయర రహదారిపై ) బైఠాయించి నిరసన తెలిపారు. సన్నరకం వరి ధాన్యంను వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. సన్నరకం వరి ధాన్యాన్ని ప్రైవేట్‌ దళారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ రైతులను నష్టాలపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వలన దొడ్డు రకం ధాన్యానికి వస్తున్న ధర కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలలో కనీసం బి గ్రేడ్‌ ధాన్యం క్రింద కూడా కొనుగోలు చేయకపోవటం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేయకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

‘సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేస్తాం’

ఆ ధర్నా విషయం తెలుసుకున్న డీసీసీబీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్ర రఘునందన్‌ రెడ్డి, జిల్లా సివిల్‌ సప్లై అధికారి తిరుపతిరెడ్డి, సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై వినయ్‌కుమార్‌, రాజేష్‌ సంఘటన స్థలానికి వచ్చి రైతులను సముదాయించారు. తప్పకుండా సన్నరకం వరిధాన్యంను ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీటీయూ జిల్లా కార్యదర్శి భుక్య రమేష్‌, జిల్లా సహయ అధికారి పల్లెపు పీటర్‌, భుక్య సురేందర్‌, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు. 

ఈ నెల 30వ తేదీ వరకు మొక్కజొన్నను కొనుగోలు చేస్తాం

 సన్నరకం వరి ధాన్యాన్ని ఏ గ్రేడ్‌ క్రింద రూ. 1888తో కొనుగోలు చేస్తాం

 ఎర్ర రఘునందన్‌ రెడ్డి, డీసీసీబీ జిల్లా ఉపాధ్యక్షుడు

 మొక్కజొన్నను ఈ నెల 30వ తేదీ వరకు కొనుగోలు చేస్తామని డీసీసీబీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్ర రఘునందన్‌ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. మొక్కజొన్నను రూ. 1850 మద్ధతు ధరతోను, సన్నరకం వరి ధాన్యంను ఏ గ్రేడ్‌ క్రింద రూ. 1888 మద్ధతు ధరతోను కొనుగోలు చేస్తామన్నారు. కావునా రైతులు ఆందోళన చెందకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సత్యనారాయణ రావు, వ్యవసాయ అధికారి ప్రవీణ్‌ కుమార్‌, పీఏసీఎస్‌ అసిస్టెంట్‌ సీఈవో ఉదయ్‌, ఏఈవో ఉమామహేశ్వరీ, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-11-29T06:28:30+05:30 IST