పైరు ఘనం..దిగుబడి శూన్యం!

ABN , First Publish Date - 2020-09-27T08:21:05+05:30 IST

వేరుశనగ రైతుకు ఈ ఏడాది ‘పచ్చి కరువు’ వచ్చి పడింది. కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితులు వెంటాడాయి. ఈసారి ఖరీఫ్‌ ఆరంభం నుంచి వర్షాలు కురిశాయి. దీంతో...

పైరు ఘనం..దిగుబడి శూన్యం!

పొలాలు పచ్చగా.. కాపు ఉత్తగా..

వరుస వానలతో వేరుశనగకు అపార నష్టం

కన్నీటి పర్యంతమవుతున్న అన్నదాతలు


అనంతపురం వ్యవసాయం/ గార్లదిన్నె, సెప్టెంబరు: వేరుశనగ రైతుకు ఈ ఏడాది ‘పచ్చి కరువు’ వచ్చి పడింది. కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితులు వెంటాడాయి. ఈసారి ఖరీఫ్‌ ఆరంభం నుంచి వర్షాలు కురిశాయి. దీంతో ఆశించిన స్థాయిలో పంటలు సాగయ్యాయి. జిల్లావ్యాప్తంగా మెట్ట భూముల్లో అత్యధికంగా వేరుశనగ సాగు చేశారు. జూన్‌ నెలలో సాగు చేసిన పంట పూత దశ నుంచి ఊడ దిగే సమయం వరకు వరుసగా వర్షాలు పడటంతో పైరు పచ్చగా ఏపుగా పెరిగింది. దిగుబడి మాత్రం లేదు. పలు ప్రాంతాల్లో వేరుశనగ చెట్టుకు పిందెలు పడలేదు. మరికొన్ని ప్రాంతాల్లో పిందెలు ఏర్పడినా ఆశించిన స్థాయిలో కాయలు వృద్ధి చెందలేకపోయాయి. చాలాచోట్ల వేరుశనగ చెట్టుకు రెండు, మూడు కాయలే కాశాయి. మరికొన్ని ప్రాంతాల్లో అసలు కాయలే లేవు. దీంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.


జూన్‌లో సాగైన పంట అంతే..! 

జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో 5 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగైంది. జూన్‌ నెలలో లక్ష హెక్టార్లు, మిగిలిన 4 లక్షల హెక్టార్లు జూలై, ఆగస్టు మాసాల్లో సాగైంది. జూన్‌ మాసంలో సాగు చేసిన వేరుశనగ పంట పూత దశ సమయం నుంచి ఊడలు దిగే ముందు వరకు వరుసగా వర్షాలు పడ్డాయి. దీంతో పైరు ఏపుగా పెరిగిం ది. పొలాల్లో వేరుశనగ పంట పచ్చగా కళకళలాడుతున్నా.. దిగుబడి ఏమాత్రం లేదు. సాధారణంగా మెట్టభూముల్లో ఎకరాకు 12 నుంచి 15 బస్తాలు పండితే మంచి దిగుబడి వచ్చినట్లు లెక్క. ఈ ఏడాది జూన్‌లో సాగు చేసిన పంట ఎకరాకు 2-3 బస్తాల దిగుబడి వచ్చేది కూడా కష్టంగా ఉంది. వేరుశనగ పంట విత్తు నుంచి కోత వరకు ఎకరాకు రూ.12వేల నుంచి రూ.15 వేలు పెట్టుబడి వచ్చింది. ఈ లెక్కన పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో సాగు చేసిన పంట కూడా ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే పరిస్థితి లేదని బాధిత రైతులు వాపోతున్నారు.


గుండెలు బాదుకుంటున్న అన్నదాతలు

ఎంతో ఆశతో అప్పులు చేసి, పంట సాగుచేసిన రైతుల కు నష్టాలు తప్పట్లేదు. ఈసారి ఖరీఫ్‌లో ముందస్తు వర్షాలు కురవటంతో రైతులు ఎంతో మురిసిపోయారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా బంగారం బ్యాంకుల్లో తాక ట్టు పెట్టి, వేరుశనగ పంట సాగు చేశారు. ఈ ఏడాది వానలు కురవటంతో పంట ఆశించిన స్థాయిలో పండుతుందని భావించారు. సకాలంలో వర్షం పడక నష్టం వాటిల్లింది. పొలాల్లో ఎటుచూసినా వేరుశనగ పంట పచ్చగా కనిపిస్తున్నా.. చెట్టుకు రెండు నుంచి మూడు కాయలే ఉన్నాయి.


పొలాల్లోనే తడిసిపోయిన పంట

జూన్‌లో సాగు చేసిన పంట కోతకొచ్చింది. అసలే దిగుబడి రాక రైతులు నష్టపోయారు. అరకొర దిగుబడి వచ్చిన పంటను కూడా కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు దెబ్బతీశాయి. పంట కోత కోసిన తర్వాత పొలాల్లోనే కుప్పలుగా ఆరబెట్టిన సమయంలో వర్షం పడటంతో పంటంతా తడిసి, నల్లబడిపోయింది. పలు ప్రాంతాల్లో భూమిలోనే కాయలు మొలకలు వస్తున్నాయి. దిగుబడి లేకపోయినా పైరు పచ్చగా ఉండటంతో కనీసం పశుగ్రాసానికైనా పనికొస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. నెలారంభం నుంచి పడుతున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 1611 హెక్టార్లల్లో రూ.4.63 కోట్ల విలువైన వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 1157 హెక్టార్లల్లో వేరుశనగ పంట పొలాల్లోనే తడిసిపోయినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు ప్రాథమిక అంచనా వేశాయి. క్షేత్ర స్థాయిలో అంతకంటే రెండింతలు పంట నష్టం వాటిల్లినట్లు సమాచారం.


వరుస వర్షాలతో నష్టం:

మేడాపురం రమణ, రైతు, కోటంక, గార్లదిన్నె మండలం 

వేరుశనగ పంట సాగుచేసిన ప్రతిసారి నష్టం వస్తోం ది. కొన్నేళ్లుగా వర్షాలు సక్రమంగా కురవక పంటలు పండలేదు. ఈసారి అధిక వర్షాలే కొంపముంచాయి. ఐదెకరాల సొంత పొలంతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని, వేరుశనగ సాగుచేశా. ఎకరాకు రూ.15వేలకుపైగా పెట్టుబడి పెట్టా. పైరు పైకి కళకళలాడుతోంది. దిగుబడి మాత్రం లేదు.


చెట్టుకు మూడు కాయలే:

ముత్యాలప్ప, రైతు, కోటంక గ్రామం, గార్లదిన్నె మండలం

బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి, 6 ఎకరాల్లో వేరు శనగ సాగు చేశా. ఇప్పటివరకు పంట సాగుకు రూ.లక్ష దాకా పెట్టుబడి పెట్టా. చెట్టుకు రెండు నుంచి మూడు కాయాలు మాత్రమే కాశాయి. దిగుబడి ఇంత అధ్వానంగా ఉంటే అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోవటం కష్టమే.


పెట్టుబడి కూడా దక్కదు:

సహదేవరెడ్డి, రైతు, తుమ్మల

5 ఎకరాల్లో వేరుశనగ సాగుచేశా. విత్తనం కోసం రూ.50వేలు ఖర్చు చేశా. పంట పూతకొచ్చే దశలో ఎడతెరపలేని వర్షాలు కురవటంతో పైరు పెరిగిందే తప్పా.. దిగుబడి లేదు. ప్రస్తుతం చెట్టుకు ఒకట్రెండు కాయలు కూడా లేవు. రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టా. మొత్తంగా నష్టపోయా.


పరిహారం చెల్లించాలి:

జంగాలపల్లి పెద్దన్న, రైతుసంఘం జిల్లా నేత

రైతులు అప్పులు చేసి, పంటకు లక్షల్లో పెట్టుబడి పెట్టినా దిగుబడి లేక ఈ ఏడాది కూడా రైతాంగం తీవ్రనష్టాల్లో కూరుకుపోయింది. రెండ్రోజుల క్రితం పొలాలను పరిశీలించగా.. చెట్టుకు ఒకట్రెండు కాయలే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు.. వేరుశనగ పంటను పరిశీలించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుకు పరిహారం చెల్లించాలి.



Updated Date - 2020-09-27T08:21:05+05:30 IST