రైతులను, కూలీలను ఆదుకోవచ్చిలా..!

ABN , First Publish Date - 2020-03-31T12:26:00+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకోక తప్పనిపరిస్థితి.

రైతులను, కూలీలను  ఆదుకోవచ్చిలా..!

చిత్తూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకోక తప్పనిపరిస్థితి. ఇందులో భాగంగా విధించిన నిబంధనలతో చేతికొచ్చిన పంటను అమ్ముకోలేక రైతులు, చేతినిండా పనిలేక కూలీలు అగచాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందిని ఉపయోగించుకుంటే వీరిని ఆదుకునే వీలుంది. జిల్లాలోని వ్యవసాయ శాఖలో అధికారులతో సహా 500 మంది, ఉద్యానశాఖలో 23 మంది పనిచేస్తున్నారు.


వీరితోపాటు సచివాలయాల్లో మరో వెయ్యి మంది అగ్రికల్చర్‌ , హార్టికల్చర్‌ అసిస్టెంట్లు ఉన్నారు. వీరికి క్షేత్రస్థాయిలో రైతులు పండిస్తున్న పంటలు, కూరగాయలు, ఆకుకూరల లభ్యతపై సంపూర్ణ అవగాహన ఉంటుంది. వీరి ద్వారా రైతు నుంచి ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేస్తే రైతుకు రవాణా వ్యయంతోపాటు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు తప్పుతాయి. వీటిని సేకరించి వాహనాల ద్వారా పట్టణాల్లో ఇటీవల ఏర్పాటుచేసిన రైతు బజార్లకు తరలించి నిత్యావసరాల కొరతను నివారించవచ్చు. దీంతో రైతు, రైతు కూలీలకు గిట్టుబాటు దక్కుతుంది. జిల్లాలో రైతులు, రైతు కూలీలతో ప్రత్యక్ష పరిచయాలున్న ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఈసీ, ఏపీవో తదితర ఉపాధిహామీ పథకం సిబ్బంది రెండువేల మంది ఉన్నారు. ఉపాధి కూలీలకు లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి పనులు దొరక్క తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


వీరికి ఉపాధి చూపుతూ.. వారి సేవలను వినియోగించుకోవడంలో ఉపాధి సిబ్బంది కీలకపాత్ర పోషించవచ్చు. పంచాయతీల్లో గ్రామాల స్థితిగతులపైన పూర్తి అవగాహన కల్గిన పంచాయతీ కార్యదర్శులు వెయ్యి మందికిపైగా ఉన్నారు. పర్యవేక్షణకు వీరిని వినియోగించుకుంటే సరిపోతుంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చే ఉపాధ్యాయుల సేవలను అవసరమైనచోట వినియోగించుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వారందరికీ మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచి తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. 

Updated Date - 2020-03-31T12:26:00+05:30 IST