ధాన్యం అమ్మినా జమకాని నగదు?

ABN , First Publish Date - 2021-05-17T15:46:25+05:30 IST

వ్యవసాయ సీజన్‌ పూర్తయిందంటే..

ధాన్యం అమ్మినా జమకాని నగదు?

ముదినేపల్లి: వ్యవసాయ సీజన్‌ పూర్తయిందంటే గ్రామాల్లో రైతులందరికీ ఒకటే వ్యధ. ఏ రైతును కదిపినా అదే కథ. ధాన్యం అమ్ముకుందామన్నా, అమ్మిన ధాన్యానికి సొమ్ములు పొందాలన్నా నరకం కనిపిస్తోందంటున్నారు. ప్రస్తుతం రబీ సీజన్‌లో పండించిన ధాన్యాన్ని ఎట్టకేలకు అరువుకు అమ్ముకోవటం పూర్తయినా సొమ్ములు మాత్రం చేతికందటం లేదు. ముదినేపల్లి ప్రాంతంలో వేలాది మంది రైతులకు ధాన్యం అమ్మిన సొమ్ములు నెలరోజులుగా ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాలకు జమ కాలేదు. కోట్లాది రూపాయలు రైతులకు అందాల్సి ఉంది. ప్రతి గింజా కొంటాం, సకాలంలో సొమ్ములు జమ చేస్తాం అని అధికారులు ప్రకటనలు ఇవ్వటం తప్ప ఆచరణలో అమలు కావటం లేదు. ధాన్యం అమ్మిన దశ నుంచి సొమ్ములు చేతికి వచ్చే వరకు జరిగే ప్రాసెస్‌ కూడ జాప్యానికి ఒక కారణంగా చెప్పవచ్చు. సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు అనేది ఒక ప్రహాసనంలా తయారైంది. రైతులు సరాసరి తన ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముకున్నా ఆ రైతు ఉన్న గ్రామంలోని సొసైటీకి లింకు చేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌ చేసి పౌరసరఫరాల శాఖకు పంపిన అనంతరం కొంతకాలానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాక ప్రాధాన్యతను బట్టి సంబంధిత రైతు ఖాతాకు సొమ్ము జమ అవుతుంది. ఈ తతంగం పూర్తయ్యే సరికి సుమారు నెలరోజులు పడుతోంది. నిధులు మంజూరులో జాప్యం జరిగితే మరికొంత కాలం పడుతుంది. ఈలోగా వ్యవసాయ కూలీలకు సొమ్ములు చెల్లించేందుకు వరి కోత యంత్రాలకు కిరాయి కట్టేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

Updated Date - 2021-05-17T15:46:25+05:30 IST