రైతు క్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-05-25T10:01:01+05:30 IST

రైతుల క్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. నూతన వ్యవసాయ విధానం లాభదాయకం.. అధికారులు సూచించిన పంటలనే సాగు చేసి రైతులు సహకరించాలి..

రైతు క్షేమమే ప్రభుత్వ లక్ష్యం

అధికారులు సూచించిన పంటలనే సాగుచేయాలి

జిల్లా కలెక్టర్‌ పౌసుమి, ఎమ్మెల్యేలు పట్నం, మహేష్‌రెడ్డి, యాదయ్య

ఊరూరా రైతు అవగాహన సదస్సులు


పరిగి(రూరల్‌): రైతుల క్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. నూతన వ్యవసాయ విధానం లాభదాయకం.. అధికారులు సూచించిన పంటలనే సాగు చేసి రైతులు సహకరించాలి.. అని జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, కాలే యాదయ్య తదితరులు పిలుపునిచ్చారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఆదివారం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. పరిగి మండలం రంగాపూర్‌లో నిర్వహించిన సదస్సుల్లో కలెక్టర్‌ పాల్గొని పంటల సాగుపై రైతులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారమే పంటలు సాగు చేయాలన్నారు. రైతులు పత్తి, కంది పంటల సాగుపై ప్రధానంగా దృష్టి సారించాలని అన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేసిన రైతులకు మాత్రమే రైతుబంధు అందుతుందని చెప్పారు. సదస్సులో ఎంపీపీ అరవింద్‌రావు, సర్పంచ్‌ లక్ష్మి, ఏడీఏ వీరప్ప తదితరులు పాల్గొన్నారు. 


మొక్కజొన్న వద్దే వద్దు : ఎమ్మెల్యే పట్నం

కొడంగల్‌: కొడంగల్‌ ప్రాంతంలో వరి, కంది, జొన్న, మినుము, పెసర పంటలను సాగు చేసుకోవాలని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నంనరేందర్‌రెడ్డి సూచించారు. మొక్కజొన్న పంటను సాగు చేయరాదని సూచించారు. మండల పరిధిలోని పర్సాపూర్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు ఆశించిన మేర దిగుబడులు వచ్చే పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  ప్రతీ రైతుకు తప్పనిసరిగా రైతు బంధు, రైతు బీమా, రైతురుణమాఫీని అమలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. సమావేశంలో ఎంపీపీ ముద్దప్ప, వ్యవసాయ శాఖ అధికారి వినయ్‌కుమార్‌, బస్వరాజ్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 


సాగులో సరికొత్త పద్ధతులు : ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి

పరిగి(రూరల్‌): వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే పంటల సాగులో సరికొత్త పద్ధతులు పాటిస్తున్నట్లు పరిగి ఎమ్మెల్యే కె.మహే్‌షరెడ్డి అన్నారు. రుక్కుంపల్లి, నస్కల్‌ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ సారి ఖరీ్‌పలో పత్తి, కంది, వరి పంటలు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. సదస్సులో పీఏసీఎస్‌ చైర్మన్‌ కె.శ్యాంసుందర్‌రెడ్డి, ఆర్‌.ఆంజనేయులు, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


నిర్ధేశించిన పంటలే వేయాలి : ఎమ్మెల్యే కాలె యాదయ్య 

నవాబుపేట : ప్రభుత్వం నిర్ధేశించిన పంటలే వేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని చించల్‌పేటలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుబంధు రావాలంటే ప్రభుత్వ అధికారులు చెప్పిన పంటలే వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో గంగమల్లు, సర్పంచ్‌ శ్రీనివాస్‌, వట్టిమీనపల్లి  నర్సింహారెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


సాగులో నూతన ఒరవడి

బంట్వారం (కోట్‌పల్లి) : రాష్ట్రంలో నూతన ఒరవడిలో సాగు పద్ధతులు చేపడుతున్నట్లు కోట్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పతంగె మంజుల అన్నారు. అన్నసాగర్‌లో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడా రు. సీఎం కేసీఆర్‌ అధిక లాభాలు వచ్చే పంటలను వేసుకోవాలని సూచించారన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి పాండురం గాచారి, ఏఈవో సందీప్‌, సొసైటీ డైరెక్టర్‌ వీరేషం, నాయకులు పతంగె పాండు తదితరులు పాల్గొన్నారు. 


మొక్కజొన్నకు మద్దతు ధర రాదు

మర్పల్లి : మొక్కజొన్న పంట వేస్తే ప్రభుత్వ మద్దతు ధర లభించదని డీసీసీబీ జిల్లా డైరెక్టర్‌ ప్రవీణ్‌రెడ్డి అన్నారు. సిరిపురం, వీర్లపల్లి, కొత్లాపురం గ్రామాల్లో జరిగిన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. పత్తి, కంది పంటలపై ఆసక్తి చూపాలని అన్నారు. కార్యక్రమంలో ఏవో వసంత, సర్పంచులు, రైతులు ఉన్నారు. 


ఈనెలాఖరు వరకు సదస్సులు : ఏడీ

తాండూరు రూరల్‌ :  తాండూరు మండల పరిధిలో ఈనెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వానాకాలం వేసే పంటలపై అవగాహన సదస్సులు జరుగుతాయని వ్యవసాయ శాఖ ఏడీ శంకర్‌ రాథోడ్‌ తెలిపారు. 25న మాచనూరు, గౌతాపూర్‌, గోపన్‌పల్లి, కోటబాస్పల్లి, ఎల్మకన్నె, 26న వీర్‌శెట్టిపల్లి, చంద్రవంచ, మిబాస్పల్లి, గుంతబాస్పల్లి, ఉద్దండాపూర్‌, అంతారం, 27న చిట్టిఘనాపూర్‌, కొత్లాపూర్‌ఖుర్దు, సంకిరెడ్డిపల్లి, చింతామణిపట్నం, పర్వతాపూర్‌, 28న కరన్‌కోట్‌, ఓగీపూర్‌, రాంపూర్‌, ఐనెల్లి, అల్లాపూర్‌, వీరారెడ్డిపల్లి, చెనిగే్‌షపూర్‌, కోణాపూర్‌, 29న మల్కాపూర్‌, జినుగుర్తి, బిజ్వార్‌, బొంకూరు, 30న సంగెంకలాన్‌, ఖాంజాన్‌పూర్‌, ఖాంజాపూర్‌, మల్‌రెడ్డిపల్లి, సాయిపూర్‌లో సదస్సులు జరుగుతాయని తెలిపారు.


కంది, పత్తి పంటలే వేయాలి

వచ్చే వానాకాలంలో తాండూరు మండల పరిధిలోని రైతులు ప్రభుత్వం సూచించిన కంది, పత్తి, పెసర, మినుము వంటి పంటలు వేసుకోవాలని ఎంపీపీ ఎస్‌.అనితాగౌడ్‌ కోరారు. ఆదివారం  ఏడీ శంకర్‌ రాథోడ్‌ ఆధ్వర్యంలో బెల్కటూర్‌లో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. రైతులు మొక్కజొన్న పంటను ఎట్టి పరిస్థితుల్లో వేసుకోరాదన్నారు.  కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎస్‌.రవీందర్‌గౌడ్‌, ఏఈవో శ్రీనివాస్‌, సర్పంచ్‌ మఽధు, ఎంపీటీసీ రాజన్న, వీఆర్వో సాయిరెడ్డి, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ వీరణ్ణ తదితరులు పాల్గొన్నారు.


సన్న వరినే సాగు చేయాలి

కులకచర్ల: వానాకాలం సీజన్‌లో రైతులు పత్తి, కందితో పాటు సన్నరకం వరి పంటలనే సాగు చేయాలని ఏవో వీరస్వామి సూచించారు. అంతారంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితిలోనే మొక్కజొన్న పంటను సాగు చేయకూడదన్నారు.   కార్యక్రమంలో సర్పంచ్‌ కృష్ణ, ఎంపీటీసీ లలితమ్మ, ఏఈవో సత్తార్‌, రైతులు పాల్గొన్నారు. 


ఎర్ర నేలల్లో కూరగాయలు వేయాలి

మోమిన్‌ పేట : మండలంలోని ఎర్ర నేలల్లో పత్తికి బదులు కూరగాయల పంటలను సాగు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. మండలంలో జరిగిన సదస్సులో వారు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, ఏవో రాధ, రైతు సమన్వయ సభ్యులు, ఏఈవోలు చంద్రిక, మౌనిక, నీరజ, శశాంక్‌, సర్పంచులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-25T10:01:01+05:30 IST